Virat Kohli: బతిమిలాడి మరీ కోహ్లీకి నా జట్టులో ఛాన్స్ ఇస్తా: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది.  ఫార్మాట్ ఏదైనా కోహ్లీ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.  ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇలాగే తన పేలవ ఫామ్ కొనసాగిస్తే జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. ఫామ్ కోసం కోహ్లీ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ తర్వాత కోహ్లీ కౌంటీల్లో ఆడతాడనే టాక్ వినిపిస్తుంది. విరాట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మైకేల్ క్లార్క్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. 

బియాండ్ 23 క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ ఫామ్ గురించి క్లార్క్ మాట్లాడాడు. " విరాట్ ఇటీవలి కాలంలో బాగా బ్యాటింగ్ చేయడం లేదు. కానీ  విరాట్ కోహ్లీ రేపు డబుల్ సెంచరీ సాధించగలడు. అతనికి జట్టులో అవకాశం ఇవ్వాలి. అతను టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైరైతే టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేను విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉంటే అతను టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయలేదనే విషయం తెలిసినప్పటికీ నేను అతనికి జట్టులో ఛాన్స్ ఇస్తాను. నా జట్టులో ఆడమని వేసుకుంటాను". అని క్లార్క్ తెలిపాడు. 

ALSO READ : Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ రేస్‌లో నలుగురు స్పిన్ ఆల్ రౌండర్లు.. ఇద్దరికే ఛాన్స్

ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. పెర్త్ లో జరిగిన టెస్టులో సెంచరీ మినహాయిస్తే మిగిలిన 8 ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది.