
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇవాళ ( డిసెంబర్ 5) మధ్యాహ్నం నెల్లూరు – బాపట్ల మధ్య తుపాను తీరందాటే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్లకల్లోలంగా తిప్పర సాగర సంగమం
కృష్ణా జిల్లా పాలకాయ తిప్పసాగర సంగమంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 200 మీటర్లపైబడి అక్కడ సముద్రం ముందుకొచ్చింది. మరోవైపు మచిలిపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో పదో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ పోర్టుకు తొమ్మిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
90–110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
మిచాంగ్ తుపాను తరుముకొస్తోంది. ప్రస్తుతం ( డిసెంబర్ 5 .. ఉదయం 11 గంటలకు) నెల్లూరుకు 20 కిమీ, బాపట్లకు 110 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 కిమీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్
మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో ఆదివారం( డిసెంబర్3) రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తిరుమలలోని జలాశయాల గేట్లు ఎత్తివేత
మిచాంగ్ కారణంగా నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను టీటీడీ అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరద నీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా.. ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు పలు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది.