జగిత్యాలలో ముసురు వాన.. తడుస్తున్న వరి ధాన్యం

'మిగ్ జాం' తుఫాన్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంట తడిసిపోతుండడంతో  రైతులు నష్టపోతున్నారు. డిసెంబర్ 6వ తేదీ బుధవారం తుఫాన్ ప్రభావంతో  జగిత్యాల జిల్లాలో పలు చోట్ల ఉదయం నుంచి ముసురు కురుస్తుంది. కోరుట్ల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా పట్టిన ముసురుతో మార్కెట్ యార్డులలో ఉన్న వరి ధాన్యం తడిసిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు కప్పి వరి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.

'మిగ్ జాం' తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నారు.  దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. తమిళనాడు పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెన్నైతోపాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్ లు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.