తల్లి పాలలోనూ మైక్రోప్లాస్టిక్స్

తల్లి పాలలోనూ మైక్రోప్లాస్టిక్స్
  • తొలిసారిగా ఇటలీ సైంటిస్టుల స్టడీలో వెల్లడి 
  • శాంపిళ్లలో పాలిథీన్, పీవీసీ, పాలీప్రొపిలీన్ గుర్తింపు

రోమ్: నీళ్లు, తిండి, పరిసరాల ద్వారా రోజూ మన శరీరంలోకి మిలియన్లకొద్దీ చిన్న చిన్న ప్లాస్టిక్ తుక్డలు చేరుతున్నాయని ఇదివరకే అనేక రీసెర్చ్ లలో తేలింది. అయితే, తల్లిపాలలోనూ మైక్రోప్లాస్టిక్స్ (5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పొడవుండే ప్లాస్టిక్ తుక్డలు) ఉన్నట్లు తొలిసారిగా ఇటలీ సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడైంది. ఇటలీలో బిడ్డలకు జన్మనిచ్చిన వారం తర్వాత 34 మంది తల్లుల పాల శాంపిళ్లను సేకరించిన ‘మర్చీ పాలిటెక్నిక్ యూనివర్సిటీ’ సైంటిస్టులు ఆ శాంపిళ్లను స్టడీ చేశారు. దీంతో మూడొంతుల శాంపిళ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. పాలిథీన్, పీవీసీ, పాలీప్రొపిలీన్ అనే 3 రకాల ప్లాస్టిక్స్ ఆ శాంపిళ్లలో ఉన్నట్లు బయటపడింది. పసిబిడ్డలకు మైక్రోప్లాస్టిక్స్ వల్ల తీవ్ర ముప్పు ఉన్నందున ఈ విషయంపై మరింత విస్తృతస్థాయిలో  పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని చిన్నారులకు తల్లిపాలను బంద్ చేయొద్దని సైంటిస్టులు స్పష్టం చేశారు. మైక్రోప్లాస్టిక్స్ వల్ల చిన్నారులకు కలిగే నష్టం కంటే తల్లిపాలు ఇవ్వకపోవడం వల్లే ఎక్కువ నష్టం జరుగుతుందని హెచ్చరించారు. 
 
పరిసరాల నుంచీ బాడీల్లోకి 
తల్లులు వినియోగించిన ప్లాస్టిక్ వస్తువులనూ సైంటిస్టులు పరిగణనలోకి తీసుకున్నారు. ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ అయిన పాలు, ఫుడ్, సీ ఫుడ్ వినియోగించారా? ప్లాస్టిక్ కలిసి ఉండే ఇతర ప్రొడక్టులను, వస్తువులను వాడారా? అన్నదీ పరిశీలించారు. అయితే, ఇలాంటి వాటితో సంబంధం లేకుండా అందరు తల్లుల పాలలోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫుడ్ ద్వారా మాత్రమే కాకుండా.. పర్యావరణ కాలుష్యం వల్ల కూడా వారిలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరి ఉంటాయని అంచనా వేశారు. కాగా, ఇప్పటివరకు మనిషి రక్తంలో, ఊపిరితిత్తుల్లో, మాయ (బిడ్డ పుట్టినప్పుడు వచ్చేది) వంటి వాటిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. డబ్బా పాలు తాగే పిల్లల బాడీలోకి రోజూ కొన్ని మిలియన్ల ప్లాస్టిక్ తుక్డలు పోతున్నాయని, ఆవు పాలలో సైతం మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నాయని కూడా వెల్లడైంది.'