
- ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 25 కంపెనీల్లో చోటు
- కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లకుపైగా ఆదాయం సాధించిన కంపెనీ
- మార్కెట్ క్యాప్ అయితే రూ.17 లక్షల కోట్ల పైనే
న్యూఢిల్లీ: మనదేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), ఇటీవల నికర విలువ (నెట్ వర్త్) పరంగా ప్రపంచంలోని 25 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో స్థానం సంపాదించింది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), సౌదీ అరామ్‌కో వంటి కంపెనీల సరసన చేరింది. ఆయిల్, రిటైల్, -టెలికాం రంగాల్లో విస్తరించిన ఈ కంపెనీ, 2024–25 లో 118 బిలియన్ డాలర్ల (రూ. 10.14 లక్షల కోట్ల) పైనే ఆదాయాన్ని సంపాదించింది.
బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర విలువ పరంగా ప్రపంచంలోనే టాప్ 21 వ కంపెనీగా స్థానం సంపాదించింది. ఆలీబాబా, ఏటీ అండ్ టీ, టోటల్ ఎనర్జీస్ వంటి గ్లోబల్ మేజర్‌ల కంటే కొంచెం వెనకబడి ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం సుమారు 201 బిలియన్ డాలర్లు (రూ.17 లక్షల కోట్లు)గా ఉంది. ఇది టోటల్ ఎస్‌ఏ, బీపీ పీఎల్‌సీల కంటే ఎక్కువ. ఆర్‌ఐఎల్ మొత్తం మార్కెట్ క్యాప్ ఇప్పుడు నిఫ్టీ 50లోని 19 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌కు లేదా 35 పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, బ్యాంకులు లేదా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ జాబితాలోని అన్ని సంస్థల మొత్తం మార్కెట్ క్యాప్‌కు సమానంగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో బాండ్ల ద్వారా రూ. 25,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలని నిర్ణయించింది. 2024–25 కి గాను షేరుకు రూ. 5.5 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. రిలయన్స్ షేర్లు శుక్రవారం రూ. 1,300.40 వద్ద ఫ్లాట్‌గా ముగిశాయి.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారిన మొదటి కుమారుడు అనంత్
బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వచ్చే నెల 1 నుంచి ఐదేళ్ల పాటు ఆయనీ పదవిలో ఉంటారు. అంబానీ 2023 ఆగస్టులో తన ముగ్గురు పిల్లలు -ఇషా, ఆకాశ్, అనంత్‌ను కంపెనీ బోర్డులో నాన్- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేర్చారు. రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన అంబానీ పిల్లల్లో అనంతే మొదటివాడు కావడం విశేషం.
ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ 2014లో రిలయన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ఆ తర్వాత 2022 జూన్ నుంచి టెలికాం సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఇషా కంపెనీ రిటైల్ విభాగాన్ని చూసుకుంటున్నారు. ఈ–కామర్స్, లగ్జరీ వ్యాపారాలను ఆమె నడిపిస్తున్నారు. అనంత్ అంబానీ న్యూ ఎనర్జీ బిజినెస్‌ను చూస్తున్నారు.“ఏప్రిల్ 25న జరిగిన రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో, హ్యూమన్ రిసోర్సెస్, నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ సిఫారసు మేరకు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అనంత్ అంబానీని... కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.
మే 1, 2025 నుంచి ఐదేండ్ల కాలానికిగాను ఆయనీ పదవిలో ఉంటారు. హోల్-టైమ్ డైరెక్టర్‌గా సేవలందిస్తారు” అని రిలయన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. బ్రౌన్ యూనివర్శిటీ నుంచి అనంత్ అంబానీ గ్రాడ్యుయేట్ అయ్యారు. అనంత్ 2022 ఆగస్టు నుంచి కంపెనీ ఎనర్జీ బిజినెస్‌ను చూసుకుంటున్నారు. మార్చి 2020 నుంచి జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ బోర్డులో, మే 2022 నుంచి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో, జూన్ 2021 నుంచి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డులో ఉన్నారు. సెప్టెంబర్ 2022 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ -- బోర్డులో కూడా ఉన్నారు.