ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల ఎంత చల్లటి కబురు చెప్పారంటే..

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల ఎంత చల్లటి కబురు చెప్పారంటే..
  • ఏఐ, క్లౌడ్​ కోసం రూ.25,700 కోట్లు.. ఇన్వెస్ట్​ చేస్తామన్న మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల
  • 2030 నాటికి కోటికి మందికి ఏఐ శిక్షణ ఇస్తామని ప్రకటన

బెంగళూరు: మన దేశంలో క్లౌడ్ ​కంప్యూటింగ్​, ఏఐ సేవలను విస్తరించడానికి మూడు బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) ఖర్చు చేస్తామని ఐటీ సేవల కంపెనీ మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. 2030 నాటికి కోటి మందికి ఏఐ స్కిల్స్​లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

బెంగళూరులో మంగళవారం స్టార్టప్​ ఫౌండర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ కంపెనీ ఎన్నడూ లేని స్థాయిలో మొదటిసారిగా ఇండియాలో మూడు బిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేస్తోందని చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఈ డబ్బు ఖర్చు చేస్తామని విషయాన్ని తెలియజేయలేదు. ఇండియాలో ఏఐ విస్తరణ​ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. మైక్రోసాఫ్ట్​ అజ్యూర్​ పేరుతో క్లౌడ్​ కంప్యూటింగ్ ​సేవలను అందిస్తోంది. దీనికి 300 డేటా సెంటర్లు ఉన్నాయి.

ఇండియాలో తాము పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామని, జియోతోనూ కలసి పనిచేస్తున్నామని సత్య వివరించారు. ఆయన గత ఏడాది ఫిబ్రవరిలోనూ ఇండియాను సందర్శించారు. 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలపై ఫోకస్​ చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఆయన సోమవారం భేటీ అయ్యారు.

ఇండియా స్టాక్​, ఏఐ వంటి అంశాలపై తన అభిప్రాయాలను వివరించారని మైక్రోసాఫ్ట్​ చైర్మన్ ​చెప్పారు.  ‘‘మేం ప్రపంచస్థాయి ఏఐ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను నిర్మిస్తున్నాం. ఇన్నోవేషన్లకు ఇది ఎంతో అనుకూలం. ఏఐ ఇన్నోవేషన్ ​విషయంలో ఇండియా వేగంగా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇండియా ఏఐ ఫస్ట్​గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యానికి ఈ పెట్టుబడులు నిదర్శనం. దీనివల్ల ఇండియాలోని ప్రజలకు, సంస్థలకు మేలు జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో మా కంపెనీ విస్తరిస్తోంది”అని ఆయన వివరించారు.

భారీగా నిధుల కేటాయింపు
మైక్రోసాఫ్ట్ ​ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇన్​ఫ్రాను, డేటా సెంటర్ల నెట్​వర్క్​ను అభివృద్ధి చేయడానికి బిలియన్ల డాలర్లు గుమ్మరిస్తోంది. ఏఐ డేటా సెంటర్ల కోసం 80 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని గతవారమే ప్రకటించింది. ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఇక్కడి డెవలపర్లు తయారు చేస్తున్న ప్రొడక్టులు, సొల్యూషన్లు కీలకమని గత పర్యటన సందర్భంగా సత్య అన్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా వాడుకోవచ్చని చెప్పారు.

2024 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల మంది మహిళా డెవెలపర్లను తయారు చేయడానికి ‘కోడ్​: వితౌట్​ బారియర్స్​’  కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. టీసీఎస్​, ఇన్ఫోసిస్​, విప్రో వంటి భారీ ఐటీ కంపెనీలు ఉన్న ఇండియాను ఇటీవలి నెలల్లో చిప్​మేకర్​ ఎన్విడియా చీఫ్​ జెన్సెన్​ హువాంగ్​, ఏఎండీ లియా సూ, మెటా చీఫ్​ఏఐ సైంటిస్ట్​ యాన్​ లీకున్​ సందర్శించారు.