- అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో తొలగని ఇబ్బందులు
- ఎయిర్‌లైన్స్, హాస్పిటల్స్, కంపెనీల సేవలకు ఇంకా అంతరాయం
- ఇండియాపై ప్రభావం తక్కువే.. అన్ని ఎయిర్‌పోర్టులూ నార్మల్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచాన్ని ఆగమాగం చేసిన మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య భారత్ లో దాదాపుగా సద్దుమణిగింది. కానీ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో ఎయిర్ లైన్స్, బ్యాంకింగ్, ఇతర రంగాల్లో సేవలపై ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భారత్‌లో ప్రధానంగా ఎయిర్ లైన్స్ సేవలపైనే బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య ప్రభావం పడగా.. అది కూడా శనివారం తెల్లవారుజాము నుంచే క్లియర్ అయిందని కేంద్రం వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ కంపెనీకి సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్న క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఫాల్ట్ అప్డేట్ను లాంచ్ చేయడం వల్ల శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది విండోస్ కంప్యూటర్లు క్రాష్ అయ్యాయి. దీంతో ఎయిర్ లైన్స్, బ్యాంకింగ్, హెల్త్ సర్వీస్‌లు, కంపెనీలు, మీడియా సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అమెరికాలో మూడు ప్రధాన ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని విమానాలూ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
ఆస్ట్రేలియా, బ్రిటన్ లోనూ తీవ్ర గందరగోళం తలెత్తింది. ఈ ఒక్క సమస్య కారణంగా అమెరికాలో చాలా కంపెనీల ఉద్యోగులకు చెల్లింపుల విషయంలోనూ సమస్య వచ్చినట్టు ఆయా కంపెనీలు తెలిపాయి. సమస్యను గుర్తించామని, ఫిక్స్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలు శుక్రవారమే ప్రకటించినా.. ఆయా దేశాల్లోని సంస్థల ఆన్ లైన్ సేవలను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారత్‌పై ఎఫెక్ట్ తక్కువే..
మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ప్రభావం భారత్‌లో స్వల్పంగానే కనిపించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో విండోస్ సిస్టమ్స్ క్రాష్ కావడంతో దాదాపు 200 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. బెంగళూరు, ఢిల్లీ, శంషాబాద్, చెన్నై, ముంబై తదిత ర ఎయిర్ పోర్టుల్లో ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు చెక్ ఇన్, బుకింగ్, రీఫండ్స్ వంటి సర్వీసులు నిలిచిపోయాయి.
ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని ఆ కంపెనీ తెలిపింది. భారత్‌లో ఎయిర్ లైన్స్ పై మినహా బ్యాంకింగ్, ఇతర రంగాలకూ పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఎయిర్ పోర్టులు నార్మల్‌గా పని చేస్తున్నయ్: రామ్మోహన్ నాయుడు
మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా ఎయిర్ పోర్టుల్లో తలెత్తిన సమస్య పరిష్కారం అయిందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శనివారం తెల్లవారు జాము న 3 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులూ నార్మల్ గా పని చేస్తున్నాయని, విమానాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
అన్ని ఎయిర్ పోర్టుల్లో రాకపోకలు, రీ అడ్జస్ట్ మెంట్లు, రీఫండ్స్ వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం బ్యాక్ లాగ్ క్లియరింగ్ కొనసాగుతోందని ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొన్నాయి.