కొద్దిసేపు ప్రపంచమంతా ఎక్కడికక్కడ నిలిచిపోయిందా అనిపించింది. రన్‌వేల మీదే నిలిచిపోయిన విమానాలు. ఎయిర్ పోర్టుల్లో బారులు తీరిన ప్రయాణికులు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేయక కాల్‌సెంటర్లకు వరుస ఫోన్లు. అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు. దీనంతటికీ కారణం మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోవడమే. ప్రపంచవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు, విండోస్‌తో పనిచేసే మెషిన్లు ఒక్కసారిగా మొరాయించాయి.
ఆ ఎఫెక్ట్ కంపెనీలు, సంస్థలతో పాటు సామాన్యుడి మీద కూడా పడింది. విండోస్ ఇన్‌స్టాల్ చేసిన ఒక్క శాతం కంప్యూటర్లలో సమస్య వస్తేనే ఇలా ఉందంటే.. ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లు క్రాష్ అయితే! ఆ పరిస్థితులను అంచనా వేయడం కూడా కష్టమే కదా. అసలు విండోస్ ఎందుకు పనిచేయలేదు? ఆ అంతరాయం ఏయే వ్యవస్థల మీద ఎక్కువ ప్రభావం చూపింది? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి? అసలు టెక్నాలజీ లేకపోతే బతకలేమా?
విండోస్.. అనగానే మైక్రోసాఫ్ట్ విండోస్ గుర్తొస్తుంది ఎక్కువమందికి. అంటేనే దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్ పనిచేయకపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసేంత పెద్ద విషయంగా మారిపోయింది. దాని ఎఫెక్ట్ ఎన్నో రంగాలపై పడింది. ఈ ఐటీ ఔటేజ్ చూశాక మైక్రోసాఫ్ట్ మీద ప్రపంచం ఎంతలా ఆధారపడిందో అర్థమవుతోంది.
మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం వల్ల యూజర్లతోపాటు సాధారణ పౌరుల మీద చాలా ఎఫెక్ట్ పడింది. హాస్పిటల్స్, ట్రైన్ నెట్‌వర్క్‌లు, టీవీ స్టేషన్లతో సహా ముఖ్యమైన సర్వీసులు అందించే చాలా సంస్థల కార్యకలాపాలు జులై19న నిలిచిపోయాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వాళ్ల సిస్టమ్స్ యాక్సెస్ చేయలేకపోయారు. కొన్ని స్టోర్స్‌లో కస్టమర్లు కార్డ్ పేమెంట్స్ చేయలేకపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో గంటల తరబడి వెయిట్ చేసిన ప్యాసింజర్లు బోలెడు మంది. ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, లాగిన్ సిస్టమ్, బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ నిలిచిపోయాయి. ఇలా ఒకటేమిటి అనేక రంగాలు దెబ్బతిన్నాయి. వీటన్నిటి ఎఫెక్ట్ పడింది మాత్రం సామాన్యుల మీదే. కొన్ని సంస్థలు గంటల్లోనే సమస్యను పరిష్కరించుకున్నాయి. కానీ.. చాలా బిజినెస్‌లు, వెబ్‌సైట్లు కోలుకోవడానికి కాస్త బాగానే టైం పట్టింది. కొన్నయితే ఇది రాసేటప్పటికి ఇంకా కోలుకోనేలేదు.
కారణమేంటి?
ఈ టెక్ ఔటేజ్(అంతరాయం)కి కారణం.. ‘క్రౌడ్‌స్ట్రయిక్’ అనే అమెరికన్ సైబర్‌సెక్యూరిటీ సంస్థ. ఇది చాలా దేశాల్లో అనేక కంపెనీల కంప్యూటర్లను హ్యాకర్‌ల నుండి కాపాడేందుకు సైబర్ సెక్యూరిటీ అందిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య ఆ కంపెనీకి ఫాల్కన్ సెన్సర్ అనే సాఫ్ట్‌వేర్‌కి ఒక అప్‌డేట్ తీసుకొచ్చింది. అందులో లోపం ఉండడం వల్ల మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అన్ని కంప్యూటర్లలో ‘బ్లూ స్క్రీన్’ డిస్‌ప్లే అయ్యింది. ఐటీ ఇండస్ట్రీ చరిత్రలో ఇంత పెద్ద సమస్య రావడం ఇదే మొదటిసారి.
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్
సాధారణంగా ఇలాంటి వాటిని ‘బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (బీఎస్‌ఓడీ )లేదంటే.. స్టాప్ కోడ్ ఎర్రర్’ అని పిలుస్తుంటారు. సిస్టమ్‌లో కొత్తగా ఏదైనా హార్డ్‌వేర్ లేదంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి ఎర్రర్ వస్తే.. సిస్టమ్‌లో దేనివల్ల వచ్చిందో కనుక్కుని సరిచేయాలి. హార్డ్‌వేర్ వల్ల వస్తే.. రిపేర్ చేసి మళ్లీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంప్యూటర్లకు ఒకేసారి ఈ సమస్య తలెత్తింది. ఇలాంటి సమస్య రావడం కొత్తేమీ కాదు. కానీ.. 85 లక్షలకు పైగా కంప్యూటర్లకు ఒకేసారి సమస్య రావడం మాత్రం ఇదే మొదటిసారి.
పాతదే..
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే సమస్య రావడం చాలా పాత విషయమే. దశాబ్దాలుగా పర్సనల్ కంప్యూటర్ యూజర్లను బ్లూ స్క్రీన్ ఎర్రర్ భయపెడుతూనే ఉంది. కాకపోతే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు ఈ సమస్య వచ్చింది. 30 ఏళ్లుగా ఇలాంటి సమస్యలు పర్సనల్ కంప్యూటర్లలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఈసారి మాత్రం వాటి మీద అంత ఎఫెక్ట్ పడలేదు. రిటైర్డ్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డేవిడ్ ప్లమ్మర్ దీని గురించి మాట్లాడుతూ.. ‘‘బీఎస్‌ఓడీ టెక్ ట్రబుల్‌కి పర్యాయపదంగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తలెత్తడంతో అసలు సమస్య మొదలైంది. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల గురించి అంతగా తెలియనివాళ్లకు కూడా ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్’ కనిపించిందంటే.. సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని అర్థం అవుతుంది” అన్నాడు.
విమానాలు ఆగిపోయాయి
ఐటీ ఔటేజ్ వల్ల ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ‘‘మా సర్వీస్ ప్రొవైడర్‌తో కొన్ని సమస్యల వల్ల బుకింగ్, చెక్–ఇన్ సేవలతోపాటు కొన్ని ఆన్‌లైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ల్లో మాన్యువల్ చెక్–ఇన్, బోర్డింగ్ చేస్తున్నాం. కాబట్టి ప్రయాణికులు మా కౌంటర్లలో చెక్–ఇన్ కోసం ఎయిర్‌పోర్ట్‌కు కాస్త ముందుగా రావాలి” అని ఆకాశ ఎయిర్ లైన్స్ చెప్పింది. ఆకాశలో మాత్రమే కాదు.. చాలా ఎయిర్‌వేస్ కంపెనీల్లో ఇదే పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా 3,340 విమానాలు రద్దు అయ్యాయి.
ప్రపంచమంతా..
యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ లాంటివి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యాయి. చాలా ఎయిర్‌వేస్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడిపించాయి. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. అమెరికాలోని ఫ్రంటియర్ ఎయిర్ లైన్స్ రెండు గంటలకు పైగా విమానాలు ఆపేసింది. బ్రిటన్ రాజధాని లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిలెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు ఎన్నో నగరాల్లో విమానాలు స్తంభించిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌ల్లో పనులన్నీ ఆగిపోయాయి. చివరికి డిస్‌ప్లే బోర్డ్స్ కూడా పనిచేయలేదు. విమానాశ్రయ సిబ్బంది పెన్ను, పేపర్ పట్టుకుని బోర్డింగ్ పాస్‌లు ఇవ్వడం, షెడ్యూలింగ్ చేయడం వంటివి చేశారు.
బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్యాంకులను ప్రభావితం చేసింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్‌తో సహా చాలా దేశాల్లో బ్యాంక్‌లు, లెండర్స్ అందించే సేవలపై ఎఫెక్ట్ పడింది. అయితే, ఇండియాలోని బ్యాంకుల మీద మాత్రం ఈ ఎఫెక్ట్ అంతగా లేదు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద లెండర్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ తమ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని ప్రకటించింది. అక్కడి బ్యాంక్‌లు ఏఎన్‌జెడ్, వెస్ట్‌పాక్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. న్యూజిలాండ్‌లోని ఏఎస్‌బీ బ్యాంక్ కూడా సమస్యలను ఎదుర్కొన్నట్టు చెప్పింది. దక్షిణాఫ్రికాలో దేశవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. కార్డ్ పేమెంట్స్, ఏటీఎంల మీద కూడా ప్రభావం పడింది.
మన బ్యాంక్‌లకు లేదు
ఇండియాలో పేమెంట్స్ మీద ఏమంత ఎఫెక్ట్ పడలేదనే చెప్పాలి. దేశంలోని కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంక్‌ల మీద మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఎలాంటి పేమేంట్స్ మీద ఎఫెక్ట్ పడలేదు.
స్టాక్ ఎక్స్ఛేంజీలు
కొన్ని దేశాల్లో స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కొన్ని సర్వీసులు ఆగిపోయాయి. ‘నువామా, ఎడెల్‌వైజ్, మోతీలాల్ ఓస్వాల్’ లాంటి కొన్ని బ్రోకరేజీ సంస్థలు టెక్నికల్ సమస్యలు ఎదుర్కొన్నాయి. జేపీ మోర్గాన్ చేజ్‌తో సహా కొన్ని బ్యాంకుల్లో బ్యాంకర్లు తమ సర్వర్లలోకి లాగిన్ కాలేకపోయారు. దాంతో ప్రాసెసింగ్ ట్రేడ్స్‌లో ఆలస్యం జరిగింది. ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోతున్నామని కస్టమర్లు కంప్లైంట్లు చేశారని అమెరికాలో పదో అతిపెద్ద సంస్థ టీడీ బ్యాంక్ చెప్పింది.
న్యూస్ బ్రాడ్‌కాస్టర్లు డౌన్
బ్రిటన్‌కు చెందిన ‘స్కై న్యూస్’ మైక్రోసాఫ్ట్ పనిచేయకపోవడంతో బ్రాడ్‌కాస్టింగ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అసోసియేటెడ్ ప్రెస్ కూడా అంతరాయాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలోని ఏబీసీ న్యూస్ కూడా వార్తలను ప్రసారం చేయలేకపోయింది. చాలా వెబ్‌సైట్లు వార్తల్ని అప్‌డేట్ చేయలేకపోయాయి.
ప్రభుత్వ సంస్థల మీద
ప్రభుత్వ సంస్థల మీద కూడా ఔటేజ్ ఎఫెక్ట్ పడింది. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు కూడా ఈ సంక్షోభం నుండి తప్పించుకోలేదు. ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లోని ఉద్యోగులు పనులు ఆపేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యవసర సేవల నెంబర్ 911 సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అలాస్కా, ఇండియానా, న్యూ హ్యాంప్‌షైర్‌తో సహా చాలా రాష్ట్రాల్లో 911 అత్యవసర సేవలు ఎఫెక్ట్ అయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి.
స్కూళ్లు.. కాలేజీలు
మైక్రోసాఫ్ట్ బీఎస్‌ఓడీ లోపం వల్ల విద్యా సంస్థల ఆపరేషన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని ఐటీ ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. ఎందుకంటే.. కాలేజీలు, స్కూల్స్‌లో అకడమిక్ పనుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ పనుల వరకు ఎక్కువగా ఐటీ మీదే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ 365 సర్వీసులను ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి ఎఫెక్ట్ ఉంటుంది. మోడర్న్ క్లాస్‌రూమ్స్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్‌లు, డిజిటల్ ప్రొజెక్టర్లు లాంటి టెక్నాలజీలతోనే నడుస్తున్నాయి. అవన్నీ విండోస్‌తోనే పనిచేస్తాయి. కంప్యూటర్ ల్యాబ్‌లు, మీడియా సెంటర్లు కూడా స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. విద్యా సంస్థలు అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఎక్కువగా టెక్నాలజీనే వాడుతున్నాయి. ముఖ్యంగా పిల్లల అటెండెన్స్, ఇనిస్టిట్యూట్ రికార్డులు డిజిటల్‌గానే సేవ్ చేసుకుంటున్నాయి.
అసలేం జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల విండోస్ సిస్టమ్స్‌ని ఎఫెక్ట్ చేసిన చరిత్రలో అతిపెద్ద ఐటీ ఔటేజ్ ఇది. అయితే.. ముందుగా అందరూ అనుకున్నట్టు ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ లోపం వల్ల వచ్చిన సమస్య కాదు. దీనికి ప్రధాన కారణం.. ఒక ఎండ్ పాయింట్ సెక్యూరిటీ వెండర్ అయిన ‘క్రౌడ్‌స్ట్రయిక్’. దీని ప్రైమరీ టెక్నాలజీ ప్లాట్‌ఫాం ఫాల్కన్. ఇది సైబర్ సెక్యూరిటీ రిస్క్‌ల నుంచి సిస్టమ్స్‌ని కాపాడుతూ ఉంటుంది.
దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాడుతున్నాయి. అయితే.. ఇది పనిచేయడానికి విండోస్ సాఫ్ట్‌వేర్ నుంచి చాలావరకు యాక్సెస్ తీసుకుంటుంది. మైక్రోసాఫ్ట్.. విండోస్ ఓఎస్ అంతటా రియల్ టైం ఆపరేషన్స్‌ని మానిటర్ చేసే యాక్సెస్ ఫాల్కన్‌కు ఇస్తుంది. అయితే.. ఫాల్కన్ సెన్సర్ అప్‌డేటెడ్ వెర్షన్లలో ఒక లోపం ఉంది. దీని వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్ క్రాష్ అయ్యింది. అయితే.. అది గమనించిన క్రౌడ్‌స్ట్రయిక్ మరో అప్‌డేట్ ఇచ్చింది. కానీ.. ఆ లోపే చాలామంది లోపం ఉన్న వెర్షన్‌ని అప్‌డేట్ చేసుకున్నారు. రీవెర్షన్ వచ్చినా లాభం లేకుండా పోయింది.
ఎన్ని కంప్యూటర్ల మీద అంటే...
మైక్రోసాఫ్ట్ అంచనా ప్రకారం... సుమారు 8.5 మిలియన్ విండోస్ సిస్టమ్స్ క్రౌడ్‌స్ట్రైక్ లాజిక్ ఎర్రర్ లోపం వల్ల నేరుగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇది మైక్రోసాఫ్ట్‌కు ఉన్న గ్లోబల్ విండోస్ ఇన్‌స్టాల్ బేస్‌లో ఒక శాతం కంటే తక్కువే. అయినా.. వాటిలో ఎక్కువగా కంపెనీలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల్లో వాడేవే ఉండడంతో ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.
యాపిల్, లైనక్స్ సేఫ్
క్రౌడ్ స్ట్రయిక్ సాఫ్ట్‌వేర్ కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్‌లో మాత్రమే కాదు.. యాపిల్‌కి చెందిన మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఓఎస్‌లో కూడా పనిచేస్తుంది. కానీ.. ఇప్పుడు ఔటేజ్ మాత్రం మైక్రోసాఫ్ట్ విండోస్‌ను మాత్రమే ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే... విండోస్ సిస్టమ్స్‌ను మాత్రమే ఎఫెక్ట్ చేసే సెన్సర్ కాన్ఫిగరేషన్ అప్‌డేట్ ఇచ్చింది క్రౌడ్‌స్ట్రయిక్. దాన్ని మ్యాక్ ఓఎస్, లైనక్స్ సిస్టమ్‌లకు పంపలేదు.
ఇంకెంత టైం...
క్రౌడ్‌స్ట్రయిక్ అప్‌డేట్ ఇచ్చాక 79 నిమిషాల్లోనే సమస్యకు పరిష్కారాన్ని గుర్తించి, అమలు చేసింది. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే సిస్టమ్స్ మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు చాలా టైం పట్టింది. ఐటీ అడ్మినిస్ట్రేటర్స్ సిస్టమ్స్‌ని మాన్యువల్‌గా బూట్ చేయాల్సి వచ్చింది. కొన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో తిరిగి పనిచేయడానికి నెలకుపైగా టైం పట్టొచ్చని అంచనా.
బ్యాకప్ తప్పనిసరి
క్రౌడ్‌స్ట్రయిక్–విండోస్ ఔటేజ్ వల్ల టెక్నాలజీ మీద ఆధునిక సమాజం ఎంతలా ఆధారపడుతోందో స్పష్టంగా తెలిసేలా చేసింది. ఎంతలా టెక్నాలజీ మీద ఆధారపడినా అత్యవసర సమయాల్లో పనిచేసేందుకు సిస్టమ్ బ్యాకప్‌లు, ఆటోమేటెడ్ ప్రాసెస్ సిస్టమ్ ఉన్నా మాన్యువల్ విధానాలు అందుబాటులో పెట్టుకోవాలని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సాధారణంగా.. అన్ని సిస్టమ్స్ ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆటోమేటెడ్ అప్‌డేట్స్‌కి పర్మిషన్ ఇవ్వడం కొన్నేండ్ల కిందటే మొదలైంది. సైబర్ ఎటాక్స్ నుంచి కాపాడుకోవాలంటే అదే ఉత్తమమైన పద్ధతి కూడా. కానీ.. క్రౌడ్ స్ట్రయిక్ సమస్య ఆ విధానంలో అంతర్లీనంగా ఉన్న ప్రమాదాన్ని ప్రపంచానికి చెప్పింది. కాబట్టి క్రిటికల్ సిస్టమ్స్‌లో అప్‌డేట్స్ వచ్చిన వెంటనే టెస్ట్ చేసి.. అప్‌డేట్ చేసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
ఇలాంటివి జరిగాయా?
ప్రపంచ టెక్ చరిత్రలో ఇంతకు ముందు కూడా ఇలాంటి ఔటేజ్‌లు రికార్డ్ అయ్యాయి. తీవ్రత తక్కువగా ఉన్నా.. ఇలాంటి ఔటేజ్‌లు ప్రపంచానికి పరిచయమే. 2017లో అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌లో వరుస ఎర్రర్స్ వల్ల పదివేల వెబ్‌సైట్స్ ఆపరేషన్స్ ఎఫెక్ట్స్ అయ్యాయి. 2021లో కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ ‘ఫాస్ట్‌లీ ఇంక్’లో సమస్యలు రావడంతో బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌తో సహా అనేక మీడియా నెట్‌వర్క్‌ల వెబ్‌సైట్స్ క్రాష్ అయ్యాయి. కానీ.. అలాంటివాటితో పోలిస్తే.. ఇది చాలా పెద్ద ఐటీ ఔటేజ్ అని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ కన్సల్టెంట్‌లో హ్యాక్–చెకింగ్ వెబ్‌సైట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న ట్రాయ్ హంట్ అన్నాడు.
హ్యాకర్లతో జాగ్రత్త
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఔటేజ్ వల్ల దాని పరిష్కారాల కోసం వెతికేవాళ్లను హ్యాకర్లు టార్గెట్ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యురిటీ సంస్థలు చెప్తున్నాయి. క్రౌడ్ స్ట్రయిక్ కూడా దీనిపై ఒక ప్రకటన చేసింది. తమ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవాళ్లు.. ఫోన్‌లో లేదా మరో కంప్యూటర్లో దాని గురించి వెబ్ సెర్చ్ చేస్తుంటారు. అలాంటప్పుడు సరైన వెబ్‌సైట్‌ని ఎంచుకుంటే పర్వాలేదు. కానీ.. ఔటేజ్‌ని అవకాశంగా తీసుకుని హ్యాకర్స్ క్రియేట్ చేసిన వెబ్‌సైట్స్‌లోకి వెళ్తేనే సమస్య. ‘క్రౌడ్ స్ట్రయిక్’ అని సెర్చ్ చేసినప్పుడు పేజీలో కనిపించేలా హ్యాకర్లు వాళ్ల వెబ్‌సైట్స్ ప్రమోట్ చేస్తుంటారు. క్రౌడ్‌స్ట్రయిక్ లాంటి కీవర్డ్స్‌తో ఉన్న డొమైన్ పేర్లు వాడతారు. అలాంటి వెబ్‌సైట్స్‌లో ఉండే లింక్‌ల మీద క్లిక్ చేస్తే.. పర్సనల్ డాటా అంతా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. లేదంటే.. ఆకర్షించడానికి నకిలీ క్రిప్టోకరెన్సీ ఆఫర్లు చూపించి మోసం చేస్తుంటారు.
ఇంకొందరు హ్యాకర్లు ఫోన్ చేసి.. కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ రికవరీకి సాయం చేస్తామని చెప్తుంటారు. ‘‘అందుకు ఛార్జ్ చేస్తాం. మేం పంపిన పేమెంట్ లింక్ మీద క్లిక్ చేయాల’’ని చెప్తుంటారు. అలాంటి పనులు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం ఖాయం అంటున్నారు సైబర్ సెక్యురిటీ ఎక్స్‌పర్ట్స్. కొందరు హ్యాకర్లు జిప్ ఫైల్స్ పంపి వాటిని కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చని చెప్పొచ్చు. అలా చేస్తే.. హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి.. దాని ద్వారా హ్యాకర్లు కంప్యూటర్‌ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు 2017లో ఈక్విఫాక్స్ డాటా రిలీజ్ చేశాక సైబర్ నేరగాళ్లు బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నట్టు మాట్లాడడం.. ఫిషింగ్ ఇ–మెయిల్స్ పంపడం లాంటివి చేశారు.
మాన్యువల్ పద్ధతులు
టెక్నాలజీ వచ్చాక పూర్తిగా దానిమీదే ఆధారపడుతున్నాం. కొన్ని పనులకు తప్పనిసరి పరిస్థితుల్లో టెక్నాలజీని వాడాల్సి వస్తుంది. వాటికి మాన్యువల్ మెథడ్స్ కూడా లేవు. అలాంటి వాటి విషయంలో పర్వాలేదు. కానీ.. మనుషులు చేయగలిగే కొన్ని పనుల విషయంలో వ్యాపార సంస్థలు బ్యాకప్ పెట్టుకోవాలి. డిజిటల్ యుగానికి ముందు అన్ని పనులు మాన్యువల్‌గానే చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
అంతటితో జీవితం ఆగిపోదు
మనం ఇప్పుడు బతుకుతున్నది టెక్నలాజికల్ ప్రపంచంలో. అలారం క్లాక్ నిద్రలేపడంతో మొదలై బెడ్ పక్కనే ఉన్న మొబైల్ఫోన్ని చేతుల్లోకి తీసుకుని అప్‌డేట్స్ చూడడంతో మొదలవుతుంది దినచర్య. అందుకే టెక్నాలజీ లేకుండా అసలు బతకడమే కష్టం అనుకంటారు చాలామంది. శారీరకంగా, మానసికంగా టెక్నాలజీ అనేది మన జీవితాల్లో ప్రతీ విషయంలో ఎంతలా పెనవేసుకుపోయిందో కదా! ఇంటి అవసరాల నుంచి ఆఫీసు పనుల వరకు మొబైల్ అప్లికేషన్స్ వాడుతున్నాం.
ఫిట్నెస్ పేరిట తింటున్న కాలరీలు లెక్కేసుకునేందుకు స్మార్ట్‌వాచీలు కూడా వాడుతున్నాం. మరో వైపు ఎప్పుడు, ఎక్కడ ఉన్నా ఎమోషనల్ సపోర్టు కోసం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు మొబైల్‌ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. ఇదంతా చదివితే ‘‘అమ్మో టెక్నాలజీ లేకపోతే మన జీవితాలు ఆగిపోతాయేమో కదా’’ అనిపిస్తుంది. ఇలాంటప్పుడే టెక్నాలజీతో సంబంధం లేకుండా గడిపిన రోజుల్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఉంది.
నిద్రలో నుంచి లేవగానే గదిలో ఆన్ చేసే లైట్ నుంచి కమ్యూనికేషన్, ట్రావెలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్.. లాంటివన్నీ టెక్నాలజీతోనే ముడిపడి ఉన్నాయి. అయితే.. ఇవన్నీ లేనప్పుడు మనిషికి బతకడం కష్టమైందా? అస్సలు కాలేదు. కాకపోతే.. కొన్ని కంఫర్ట్స్ లేవు. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడు కూడా కంపెనీలు ఆగిపోలేదు. జీవితాలు ఆగిపోలేదు. ఇంటర్నెట్‌తో సహా.. ఫోన్, కంప్యూటర్లు ఏవీ అందుబాటులో లేకపోయినా బతకొచ్చు. టెక్ చరిత్రలో కొన్నిసార్లు ఇంటర్నెట్ వాడకంలో ఇబ్బందులు వచ్చాయి. ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి యాప్స్ పనిచేయడం ఆగిపోయింది. అంతెందుందుకు సన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఛానెల్స్ కూడా ఆగిపోయాయి. ఇలాంటివి ఎన్ని జరిగినా.. మనిషి మళ్లీ నిలబడ్డాడు. ఎప్పటిలాగే బతుకుతున్నాడు. ఇకముందు ఇలాంటివి జరిగినా.. మళ్లీ కోలుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
టెక్నాలజీ లేని రోజుల్లో....
అలారం క్లాక్ లేని రోజుల్లో, మొబైల్‌ఫోన్ బెడ్ పక్కన పెట్టుకుని నిద్ర పోని రోజుల్లో ఉదయాన్నే నిద్ర ఎలా లేచేవాళ్లు? ఎలాగేంటి కోడి కొక్కొరకో, పక్షుల అరుపులు నిద్రలేపేవి. ఇదంతా సరే కానీ.. ఎయిర్‌కండిషనర్ ఆగిపోతే? గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోతే? చేతిలో మొబైల్‌ఫోన్ లేకపోతే? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్ చేతిలో లేకపోతే? హా... లేకపోతే ఏమవుతుంది? ప్రపంచంలో జరిగే విశేషాలు లేదా మీ ఫేవరెట్ సెలబ్రిటీ జీవితంలో ఏం జరిగింది అనేది తెలియదు. వామ్మో అలా ఎలా అనిపిస్తుందా?
కానీ అక్కడితో జీవితం ఆగిపోతుందా? లేదు కదా. సరే ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఉదయం నిద్రలేచాక నెక్స్ట్ చేయాల్సింది స్నానం. స్నానం చేయడానికి వెళ్లారు. అక్కడ గీజర్ లేదు. లేదా బాత్రూమ్లో నీళ్లు లేవు. ఓహ్ ఎలా? ఏమవుతుంది స్నానం చేయడానికి మన ముందున్న ఆప్షన్స్ ఏంటో చూడాలి. ఇదివరకు అయితే బావి నీళ్లు తోడుకుని లేదా చెరువులు, కాలువల్లో స్నానం చేసేవాళ్లు.
తిండి ఎలా?
ఇక వర్క్ విషయానికి వద్దాం. ల్యాప్‌టాప్ లేదు. మరే ఎలక్ట్రానిక్ డివైస్ లేదు. ఎక్సెల్ రిపోర్ట్స్ లేవు. డెవలప్ చేయడానికి వెబ్‌సైట్ లేదు. ఇలా టెక్నలాజికల్గా ఏమీ లేవు. పనిలేకపోతే డబ్బు ఎలా? ఎలాగోలా పొట్ట నింపుకోవాలి. ఇలాంటప్పుడు మళ్లీ వెనకటి కాలంలోకి వెళ్తే ఆకలి తీరడానికి పొలానికి వెళ్లి పనిచేసుకునేవాళ్లు. లేదా అడవికి వెళ్లి పండ్లు, ఫలాలు తెచ్చుకునేవాళ్లు. అబ్బో ఈ రోజుల్లో ఇది కష్టం అనిపిస్తుంది. కానీ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఆకలికి అలమటించాల్సిన అవసరం లేని ఆప్షన్ అయితే ఒకటి ఉంది కదా.
లేజీగా చేసింది
టెక్నాలజీ అనేది జీవితం ఈజీగా గడిచిపోయేలా చేసింది. ఈ విషయాన్నే ఇంకోలా చెప్పాలంటే మనుషుల్ని లేజీగా చేసింది అనొచ్చు. చిన్న విషయం నుంచి పెద్ద విషయాల వరకు చాలా కీ రోల్ ప్లే చేస్తోంది. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే... మెషినరీ, టెక్నాలజీ ఇవి ఏవైనా జీవితాన్ని సౌకర్యవంతంగా గడిపేందుకు మనిషి ఆలోచన నుంచి తయారైన ప్రొడక్ట్స్ అని. నిజంగానే టెక్నాలజీ అనేది మనుషుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. వ్యవసాయంలో తక్కువ స్పేస్ వాడి ఎక్కువ పంటలు పండిస్తున్నారు. అలానే బిజినెస్, ట్రేడింగ్, హెల్త్‌కేర్, స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడంలో ఎన్నో రకాలుగా టెక్నాలజీ ఉపయోగపడుతోంది.
ఇవేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముతున్నాం. వర్చువల్ రియాలిటీని వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, స్టడీ వంటి వాటిలో వాడుతున్నాం. కాకపోతే టెక్నాలజీని మోతాదు మించి వాడడం అనేది మనుషుల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో దూరాన్ని పెంచుతోంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు టెక్నాలజీ అవసరమే.
కానీ అందమైన బంధాలను, మనుషుల్ని దూరం చేసుకునేంత అవసరం అయితే కాదు. అందుకే టెక్నాలజీని చాలా తెలివిగా వాడుకోవాలి. అందుకే ఆ సిస్టమ్ ఆగిపోతే అంతటితో మానవజీవితం స్తంభించిపోదనే విషయం గమనించాలి. బతికేందుకు బోలెడన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొత్తగా గూగుల్ చేసి తెలుసుకోవాల్సిన అవసరంలేదు.
ఇంటర్నెట్ లేకపోతే..
ప్రపంచవ్యాప్తంగా 4.66 బిలియన్ల కంటే ఎక్కుమ మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. దాని వల్ల రకరకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. అలాగని ఇంటర్నెట్ ఆగిపోతే.. వాళ్ల జీవితాలు ఆగిపోవు. వాళ్లు మరో పని వెతుక్కుంటారు. కొత్త ఉపాధి రంగాలు పుట్టుకొస్తాయి. మొబైల్, సోషల్ మీడియా, టెక్ గాడ్జెట్స్ లేకుండా జీవితం గడపాల్సి వస్తుంది. ఇవన్నీ లేనప్పుడు మన పూర్వీకులు అలాంటి జీవితాన్నే గడిపారు.
మొబైల్ లేకపోతే..
టెలిఫోన్‌ని 1876లో గ్రాహంబెల్ కనిపెట్టాడనే విషయం అందరికీ తెలిసిందే. అది ఆ శతాబ్దంలోనే అత్యంత ఉపయోగకరమైన ఆవిష్కరణ. అప్పట్లో అది ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్‌కి మాత్రమే ఉపయోగపడేది. కానీ.. సాంకేతికత పెరిగినా కొద్దీ అది అప్‌గ్రేడ్ అవుతూ వచ్చింది. చివరికి ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది.
కానీ.. దాన్ని మొదట్లో కాల్స్ మాట్లాడుకోవడానకి మాత్రమే ఉపయోగించేవాళ్లు. కానీ.. ఇప్పుడు కాల్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియా కోసం ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోనే కాదు.. టెలిఫోన్ లేని టైంలో కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. కాకాపోతే.. ఆ వ్యవస్థ స్లోగా పనిచేసేది. ఇప్పుడు ఫోన్ లేకపోయినా మళ్లీ అలాంటి వ్యవస్థను మరింత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవచ్చు.
క్రౌడ్‌స్ట్రయిక్ షేర్లు డౌన్
న్యూయార్క్ ట్రేడింగ్‌లో క్రౌడ్‌స్ట్రయిక్ షేర్లు 11 శాతం పడిపోయాయి. వాటి విలువ 304.96 అమెరికన్ డాలర్లు. మార్కెట్ వ్యాల్యూలో 9 బిలియన్ల డాలర్లకుపైగా తుడిచిపెట్టుకుపోయింది. నవంబర్ 2022 తర్వాత ఇది వాళ్ల అతిపెద్ద సింగిల్-డే లాస్. మైక్రోసాఫ్ట్ షేర్లు ఒక శాతం వరకు పడిపోయి 437.11 డాలర్లకు చేరుకున్నాయి.
చైనాలో ‘నో’ ఎఫెక్ట్
ప్రపంచంలో ఎన్నో దేశాలు మైక్రోసాఫ్ట్ విండోస్ ఔటేజ్ వల్ల ఇబ్బందిపడ్డాయి. కానీ.. చైనాపై మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం.. చైనాలోని విదేశీ వ్యాపారాలు, హోటల్ చెయిన్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. చైనాలోని మౌలిక సదుపాయాలు, మెజారిటీ సేవల మీద ఎఫెక్ట్ లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బ్రిటన్, అమెరికాలో కూడా విమానాలు రద్దయ్యాయి.
భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ లాంటి చైనా పొరుగు దేశాల్లోని ఎయిర్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. అయినా... చైనాలో ఆ పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే.. చైనా సైబర్ సెక్యురిటీ విషయంలో థర్డ్ పార్టీ, విదేశీ సర్వీసుల మీద ఆధారపడటం చాలా తక్కువ. విదేశీ హార్డ్‌వేర్లను కూడా చాలా తక్కువగా వాడుతుంది. ఆ దేశంలో మైక్రోసాఫ్ట్ వాడేవాళ్లు కూడా తక్కువే. చైనాలో పనిచేస్తున్న విదేశీ సంస్థలు మాత్రమే క్రౌడ్ స్ట్రయిక్ సేవలు వాడుతున్నాయి.
ఇండియన్ రైలు ఆగలేదు!
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల కొన్ని దేశాల్లో విమానాల సర్వీసులతోపాటు రైళ్ల రాకపోకల మీద కూడా ఎఫెక్ట్ పడింది. కానీ.. ఈ ఔటేజీ వల్ల తమ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఇండియన్ రైల్వేస్ చెప్పింది. మైక్రోసాఫ్ట్ ఆగిపోవడం వల్ల రైల్వే టికెటింగ్ సిస్టమ్, ట్రైన్ రన్నింగ్, కంట్రోల్ ఆఫీస్ ఆటోమేషన్‌తోపాటు ఇతర రైల్వే సేవలపై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. దానికి కారణం.. రైల్వే శాఖ1999లో ప్రత్యేకంగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్‌ఐఎస్) అనే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది. ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఇప్పటికీ అదే సిస్టమ్‌ని వాడుతున్నారు. అందుకే ఈ ఔటేజీ ఎఫెక్ట్ ఇండియన్ రైల్వేల మీద పెద్దగా పడలేదు.
స్టీవ్ జాబ్స్
మైక్రోసాఫ్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే.. సుమారు పందొమ్మిదేళ్ల క్రితం1995లో యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌ని విమర్శించాడు. ‘మైక్రోసాఫ్ట్ థర్డ్ రేట్ (నాసిరకం) ప్రొడక్ట్స్ తయారు చేస్తోంది’ అని అన్నాడు. మైక్రోసాఫ్ట్ ఔటేజీ సందర్భంగా ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
జెరోదా సేఫ్
ఇండియాలోని టాప్ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీల్లో జెరోదా ఒకటి. మన దగ్గర చాలా కంపెనీల మీద ఔటేజీ ఎఫెక్ట్ పడినా.. ఈ కంపెనీ మీద మాత్రం ఎఫెక్ట్ పడలేదు. కంపెనీ కో– ఫౌండర్ సీఈవో నితిన్ కామత్ మైక్రోసాఫ్ట్ ఔటేజీని కంపెనీ ఎలా ఎదుర్కొందో ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. కంపెనీలో సీఈవోతోపాటు దాదాపు ఆ సంస్థ ఉద్యోగులంతా లైనక్స్ బేస్డ్ ల్యాప్‌టాప్స్ వాడుతున్నారు. అందుకే ఔటేజీ నుంచి కంపెనీ తప్పించుకుంది.
మస్క్ పోస్ట్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్రౌడ్‌స్ట్రయిక్ అప్‌డేట్ వల్ల ఏర్పడిన ప్రపంచవ్యాప్త ఔటేజ్ మీద స్పందించాడు. కంపెనీ తమ సర్వీసులను పునరుద్ధరించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చాడు. అదే విషయం మీద ఎక్స్‌లో ‘‘క్రౌడ్‌స్ట్రయిక్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యవస్థలను ప్రభావితం చేసిన అప్‌డేట్ ఒకటి రిలీజ్ చేసింది. మేం ఈ సమస్య గురించి తెలుసుకున్నాం. సమస్యను పరిష్కరించడానికి క్రౌడ్ స్ట్రయిక్‌తో కలిసి పనిచేస్తున్నాం” అని పోస్ట్ చేశాడు.
ఆ తర్వాత సత్య నాదెళ్ల ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ‘‘ఇది ఆటోమోటివ్ సప్లయ్ చైన్‌కు ఒక నిర్బంధాన్ని ఇచ్చింది” అని పోస్ట్ చేశాడు. 2021లో మస్క్ చేసిన ఒక ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేశాడు. అందులో అతను మైక్రోసాఫ్ట్‌ను ‘‘మ్యాక్రోహార్డ్” అని వ్యంగ్యంగా రాశాడు. మరో ట్వీట్‌లో ‘‘వరల్డ్ ఔటేజ్ ఉన్నప్పటికీ ఎక్స్ పనిచేయడం ఆగిపోలేదు” అంటూ చురకలు అంటించాడు.
హెల్త్ సర్వీసులు స్టాప్
చాలా దేశాల్లో హెల్త్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంగ్లాండ్‌లో డాక్టర్లు వాడే హెల్త్ బుకింగ్ సిస్టమ్ ఆఫ్‌లైన్‌లో పని చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లోని12.6 మిలియన్ల మందికి హెల్త్ సర్వీసులు అందిస్తున్న ‘కైజర్ పర్మనెంట్’ అన్ని హాస్పిటల్స్ వ్యవస్థలు ఎఫెక్ట్ అయ్యాయి. దాంతో పేషెంట్స్‌ను చూసుకోవడానికి బ్యాకప్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.అమెరికాలోని అతిపెద్ద హెల్త్ కేర్ సిస్టమ్స్‌లో ఒకటి ‘మాస్ జనరల్ బ్రిగమ్’. బోస్టన్‌లో దీనికి మొత్తం15 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఏడాదికి సగటున 2.5 మిలియన్ల మంది ఈ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటారు.
మైక్రోసాఫ్ట్ ఔటేజీ అయినప్పుడు ఈ హాస్పిటల్ ‘‘ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందిస్తాం. మిగతా అన్ని రకాల సర్వీసులను నిలిపివేశాం” అని ఒక ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్లు, మెడికల్ ఎక్విప్మెంట్ పనిచేయకపోవడంతో డాక్టర్లు, సిబ్బంది పెన్ను, పేపర్ పట్టుకోవాల్సి వచ్చింది. హెల్త్ కేర్ రంగంలో ‘ఎపిక్’ అనేది ముఖ్యమైన మెడికల్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. ఔటేజీ టైంలో ఇది పనిచేయలేదు. పేషెంట్ల హెల్త్ రికార్డులు స్టోర్ చేసే ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచవ్యాప్తంగా లిస్ట్ అయిన హాస్పిటల్స్‌లో పేషెంట్ల డాటా ఉంటుంది. అలా305 మిలియన్ల కంటే ఎక్కువమంది డాటానే ఇందులో ఉంది.