ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టండి

ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టండి

1970 సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయ పరిధి నుంచి తప్పించి ప్రభుత్వ చట్ట ప్రకారం ఇంటర్మీడియట్ విద్యా మండలి "ఇంటర్మీడియట్ బోర్డు"ను 1971సంవత్సరంలో నెలకొల్పారు. ఈ మండలికి స్టాట్యూటరీ బాడీ అధికారాన్ని ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ప్రీ యూనివర్సిటీ కోర్స్ (పీయూసీ)గా ఉన్న దీనిని 1969 నుంచి ఇంటర్మీడియట్ విద్యగా మార్చారు. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలైనప్పటికీ నేటికీ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయం, ఏకరూప దుస్తుల(యూనిఫారం) ఏర్పాటు జరగలేదు. 

వీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు గత ప్రభుత్వం నిరాశను మిగిల్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లో ప్రభుత్వ, పంచాయతీరాజ్, వివిధ గురుకుల సొసైటీలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2023 –24 విద్యా సంవత్సరానికి సుమారు 39 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు సమకూర్చిన ప్రభుత్వం 408 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 1.5 లక్షల పైచిలుకు విద్యార్థులకు మాత్రం ఈ సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం. 

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేవలం 1.5 లక్షల పైచిలుకు మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇప్పటికైనా ఈ నూతన ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం  నుంచైనా మధ్యాహ్న భోజన పథకం, ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేసినట్లయితే  జూనియర్ కళాశాలల పరిస్థితి మెరుగవుతుంది.

- షేక్​ జాన్ పాషా,రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డ్ గ్రహీత,
ప్రభుత్వ జూనియర్ కాలేజీ, నెమ్మికల్, సూర్యాపేట(జిల్లా)