పర్మల్ల పాఠశాలలో మిడ్ డే మీల్స్ బంద్

పర్మల్ల పాఠశాలలో మిడ్ డే మీల్స్ బంద్
  •   2024  జనవరి నుంచి ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్
  •   పట్టించుకోని విద్యాశాఖ ఆఫీసర్లు

  లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పర్మల్ల గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ లో  విద్యార్థులకు మిడ్ డే మీల్స్ అందడం లేదు. దీంతో స్టూడెంట్లు ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుని తింటున్నారు. 

మధ్యాహ్న భోజన బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారన్న కారణంతో ఏజెన్సీ నిర్వాహకులు వంట చేయడం మానేశారు. దీంతో 2024  జనవరి నుంచి విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు.  పర్మల్ల గ్రామానికి చెందిన 105 మంది, పర్మల్ల తండాకు చెంది15 మంది స్టూడెంట్లు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు.  ఈ పాఠశాలలో హెడ్మాష్టర్ తో పాటు ముగ్గురు టీచర్లు పని చేస్తున్నారు.  

జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అయినా కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కరవైంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు 
కోరుతున్నారు. 

సమస్యకు  త్వరలోనే పరిష్కారం చూపిస్తాం: 
పర్మల్ల  ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని మాట వాస్తవమే. కానీ ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించాం.  రెండు రోజుల్లో పేరేంట్స్, విద్యాకమిటీ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తాం.  - ఎంఈఓ రామస్వామి
ఎవరూ ముందుకు రావడంలేదు... 


స్కూల్​లో మధ్యాహ్న భోజనం వండడానికి  గ్రామస్థులు ఎవరు ముందుకు రావడం లేదు. దాంతో మిడ్​డే మీల్స్ ను స్టూడెంట్లకు అందించలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకుపోయాం. -  హెడ్మాస్టర్ ​ రాజేందర్