బోయినిపల్లి, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో మిడ్ మానేరు నిర్వాసితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలోజిపల్లి గ్రామానికి చెందిన గుండ్ల కనుకయ్య ( 47 ) మిడ్ మానేరు ప్రాజెక్టు లో ఇల్లు కోల్పోవడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేశాడు.
ఉపాధి లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుటుంబంతో సహా కరీంనగర్ లో పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంపాదన అంత కుటుంబ అవసరాలకే సరిపోతుండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కనుకయ్య తీవ్రంగా ఆందోళన చెందాడు. ఈనెల 11 సొంతూరు నీలోజిపల్లికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుని భార్య మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మిడ్ మానేరు నిర్వాసిత ఐక్య వేదిక అధ్యక్షుడి ఆర్థిక సాయం
గుండ్ల కనుకయ్య కుటుంబానికి మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక అధ్యక్షడు, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ.5 లక్షల 4 వేలు ఇస్తుందన్నారు. ఈ విషయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్ తో చర్చించామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా నిర్వాసితుల సమస్యలు తీసుకెళ్లామని చెప్పారు.