ముగ్గురు యువకులను బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం

ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు ఆయువు తీస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే.. అకారణంగా తనువు చాలిస్తున్నవారు మరికొందరు. తాజాగా కుత్బుల్లాపూర్ లో మృత్యుఘంటికలు మోగాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8వ తేదీ అర్థరాత్రి రోడ్డు ప్రమాద ఘటన కలవరం రేపింది. రెండు వేరు వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

వివరాల్లోకి వెళితే.. కొంపల్లి నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న కారు అర్థరాత్రి 3 గంటల సమయంలో అతివేగంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటనలో.. 
అర్థరాత్రి 2 గంటలకు సుశ్వంత్ నాయక్ (23) బైక్ పై దూలపల్లి నుంచి బహదూర్ పల్లికి వెళ్తున్నాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన కారు ఢీ కోనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సుశ్వంత్ ఎంఆర్ సిఇటి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెట్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.