లెటర్​ టు ఎడిటర్​: రైళ్లలో మిడిల్ బెర్త్ లను తొలగించాలి

లెటర్​ టు ఎడిటర్​:  రైళ్లలో మిడిల్ బెర్త్  లను తొలగించాలి

భారతీయ రైల్వేశాఖ ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన, అత్యాధునిక బోగీలను ఏర్పాటు చేస్తోంది.  అతి వేగవంతమైన  వందే భారత్  రైళ్లలో  కూడా ఆకర్షణీయమైనవిధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసి నడుపుతున్నది. ఇది చాలా  హర్షించదగ్గ విషయం.   కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టుగా రైళ్లలో  ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించారు.  ప్రస్తుతం జనరల్,  స్లీపర్,  థర్డ్ ఏసీ,  సెకండ్ క్లాస్​ ఏసీ,  ఫస్ట్ ఏసీ  క్లాస్ బోగీలను  నడుపుతున్నారు.   రైల్వే వ్యవస్థలో అన్ని రంగాలలో కూడా ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థలను నెలకొల్పుతున్నారు.  గతంలో  జనరల్  బోగీలలో  చెక్కలతో తయారుచేసిన సీట్లు ఉండేవి. రైల్వే ప్రయాణికులు పడుతున్న కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని  రైల్వేశాఖ వాటిని కుషన్ సీట్లుగా  మార్చింది. 

ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు 

అవసరాలను దృష్టిలో పెట్టుకొని  అవసరాలకు అనుగుణంగా మార్పులను తీసుకొని వస్తున్నారు.  కానీ,  స్లీపర్,  థర్డ్ ఏసీ బోగీలలో మార్పులు తీసుకురాకపోవడం వలన ప్రయాణికులు  కష్టాలు ఎదుర్కొంటున్నారు.  ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన శరీరం దృఢంగా ఉండలేకపోవడంతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.  దీనివలన ప్రయాణికులు ఐపాడ్లు,  ల్యాప్ టాప్,   స్మార్ట్​ఫోన్లు  ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను  ప్రయాణ సమయంలోనూ  విరివిగా ఉపయోగించుకుంటున్నారు.  

ఫలితంగా  మిడిల్ బెర్త్​లలో  ప్రయాణం చేయడం కష్టతరమవుతున్నది.  ఇంతేగాక అనారోగ్యబారిన పడుటకు ఆస్కారం ఉన్నది.   థర్డ్ ఏసీ బోగీలను తొలగించి వాటి స్థానంలో టూ టైర్ స్లీపర్,  సెకండ్ ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలి.   టిక్కెట్ ధరలు కూడా  అధికంగా వసూలు చేయకుండా స్లీపర్ థర్డ్ ఏసీ ధరల ప్రకారం నిర్ణయిస్తే  ప్రయాణికులు వేసవిలో ఎక్కువగా ఆకర్షితులై  రైళ్లలో ప్రయాణం చేయుటకు ఉత్సాహం చూపుతారు. 

   - దండంరాజు రాంచందర్ రావు-