భారత్‌‌‌‌లో సంపద సమానత్వానికి మార్గం

భారత్‌‌‌‌లో సంపద  సమానత్వానికి మార్గం

మనం చాలాసార్లు గమనిస్తున్న అంశం ఏమిటంటే, బ్యాంకులు లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ వ్యక్తులకు రుణాలను ఇవ్వడం లేదు.  దీనికి ప్రధాన కారణం వారికి ఆదాయం లేకపోవడం కాదు. ఆదాయానికి నిర్ధారిత ధ్రువీకరణ (ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్) లేకపోవడమే.  చాలామంది ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే పన్నులు చెల్లించడమే అని తప్పుగా భావిస్తున్నారు.  

కానీ, వాస్తవానికి ఇది ఆదాయాన్ని నమోదు చేయడం మాత్రమే, పన్నులు కట్టడం తప్పనిసరి కాదు.  ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది.  ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం ద్వారా రుణాల కోసం అవసరమైన ఆర్థిక ధ్రువీకరణను పొందవచ్చు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా అర్హత పొందవచ్చు. యూనివర్సల్ ఇన్‌‌‌‌కమ్ టాక్స్ రిటర్న్స్ (యూఐటీఆర్స్), ఆధార్ ఆధారంగా ఆస్తుల ప్రకటనలను భారతదేశంలో ప్రవేశపెట్టడం, ఆర్థిక సమానత్వం,  సంపద పేదలకు చేర్చటం,పన్ను సేకరణ వ్యవస్థను మెరుగుపరచడం కోసం రూపుదిద్దుకున్న కార్యక్రమం.

ఆస్తులు,  సంపద పన్నులను ఆధార్‌‌‌‌కు అనుసంధానం చేయడం ద్వారా,  ఆదాయం రిటర్నులను తప్పనిసరి చేయడం ద్వారా ఆర్థిక అసమానతను తగ్గించడం, ఆదాయ సేకరణను పెంచడం,  పారదర్శకతను పెంచడానికి ఉపయోగపడుతుంది. యూనివర్సల్ ఇన్‌‌‌‌కమ్ టాక్స్ రిటర్న్స్, ఆధార్ ఆధారంగా ఆస్తుల ప్రకటనలు అంటే ఏమిటంటే.. యూనివర్సల్ ఇన్‌‌‌‌కమ్ టాక్స్ రిటర్న్స్  అనేది ప్రతి భారత పౌరుడు, ఆదాయ స్థాయి ఏమిటన్నది చూడకుండా, వార్షిక పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సిన విధానం.  దీనిలో పన్ను మినహాయింపుల కింద ఉన్నవారు కూడా నిల్ రిటర్న్ లేదా సింప్లిఫైడ్ రిటర్న్‌‌‌‌ను దాఖలు చేయవచ్చు. ఈ విధానం ఆర్థిక డేటాబేస్‌‌‌‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. 

ఆధార్-లింక్డ్ ప్రాపర్టీ డిక్లరేషన్.. ఈ ఆలోచన అన్ని స్థిరాస్తులను (భూమి, ఇళ్లు,  రియల్ ఎస్టేట్) యజమాని ఆధార్ నంబర్‌‌‌‌తో అనుసంధానం చేయాలని సూచిస్తుంది. ఇది సెంట్రలైజ్డ్, మార్పులకు లోనుకాకుండా ఉండే డేటాబేస్‌‌‌‌ను సృష్టిస్తుంది.  ఇది ఆస్తుల యజమాన్యంపై పారదర్శకతను పెంచుతుంది.  సంపద పన్ను సేకరణను సులభతరం చేస్తుంది.  

ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. ఆదాయ పన్ను రిటర్నులు, సంపన్న శ్రేణుల విభజన భారతదేశంలో ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ (2022–23) ఈ విధంగా ఉంది.  భారతదేశంలో మొత్తం జనాభా సుమారు 140 కోట్ల మంది ఉండగా,  పన్ను రిటర్నులు దాఖలు చేసినవారు 8.3 కోట్లు (జనాభాలో 6% మాత్రమే).  పన్ను చెల్లించేవారు మినహాయింపుల తర్వాత సుమారు 4.5 కోట్ల మంది ఉండగా,  పన్ను ఎగవేత వల్ల భారతదేశం సుమారు  రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు అంచనా.  భారత  జనాభాలో అధిక శాతం పన్ను రిటర్నుల వ్యవస్థ వెలుపల ఉండటం.  దీంతో ప్రభుత్వానికి అవసరమైన  డేటా అందుబాటులో ఉండడం లేదు.

యూఐటీఆర్స్ ఆధార్-లింక్డ్ ఆస్తి ప్రకటనల ప్రయోజనాలు

పేద,  మధ్యతరగతుల ఆర్థిక చేర్చింపు.  రుణాలకు అవకాశం: పన్ను రిటర్నుల ద్వారా డాక్యుమెంటేషన్ మెరుగుపడి, హౌసింగ్, విద్య, మరియు ఉపాధి రుణాలకు అవకాశం ఉంటుంది.   సరిఅయిన ఆదాయ డేటా ద్వారా సబ్సిడీలు, పథకాలను సరిగ్గా అందించవచ్చు.  అధిక విలువ కలిగిన ఆస్తులపై పన్ను విధించడం ద్వారా సమాజంలో అసమానతలను తగ్గించవచ్చు.  

సంక్షేమ విధానాలు కులంపై ఆధారపడి కాకుండా ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి రిటర్నులతో మరింత మంది పన్ను వ్యవస్థలో చేరతారు.  పన్ను సేకరణ పెరుగుదల నమోదు చేయడంతోపటు పన్ను ఎగవేతలను తగ్గించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.50,000 కోట్ల వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఆధార్ ఆధారంగా ఆస్తి బదిలీలు సరళంగా, పారదర్శకంగా ఉంటాయి. సంక్షేమ పథకాల కోసం కేటాయింపులు పెంచే అవకాశం ఉంటుంది.  పన్నుల ద్వారా వచ్చిన అధిక ఆదాయాన్ని ఆరోగ్యం, విద్య, మరియు మౌలిక వసతుల మీద ఖర్చు చేయవచ్చు. 

ప్రపంచంలో  యూటీఐఆర్​నుఅమలు చేస్తున్న దేశాలు 

యునైటెడ్ స్టేట్స్ (ఐఆర్ఎస్​): ప్రతి పౌరుడు పన్ను రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. పన్ను రికార్డులు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి అవసరం.  స్కాండినేవియన్ దేశాలు (నార్వే, స్వీడన్) ఈ దేశాలు అధిక విలువ కలిగిన ఆస్తులపై సంపద పన్నులను విధించాయి. బ్రెజిల్ (సీపీఎఫ్​).. బ్రెజిల్ తన సెంట్రల్ సిస్టమ్‌‌‌‌ను ఆస్తులు, అలాగే ఆర్థిక లావాదేవీలపై అప్రమత్తంగా ఉపయోగిస్తోంది.

ఐడియా మీద వ్యతిరేకత,  గోప్యతా సమస్యలు

ఆధార్-లింక్డ్ ఆస్తుల ప్రకటన వ్యక్తిగత సమాచార దుర్వినియోగం భయాలను కలిగిస్తుంది.  ధనవంతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.  పన్ను వేధింపులు లేదా ధనవంతుల ఆస్తులపై అధిక పన్ను విధించే విధానాల వల్ల వ్యతిరేకత ఉండవచ్చు.  అమలులో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. 1.4 బిలియన్ జనాభాలో ప్రతి ఒక్కరికీ రిటర్నులను తప్పనిసరి చేయడం అనేది సవాలుగా ఉంటుంది.  తక్కువ ఆదాయం గల వ్యక్తులపై అధిక నియంత్రణ ఒత్తిడి తలెత్తే ప్రమాదం ఉంది.

ఆర్థిక సమానత్వానికి మార్గం

యూటీఐఆర్,  ఆధార్ ఆధారంగా ఆస్తుల ప్రకటనలు సమాజంలో పారదర్శకతను పెంచే కీలక మార్గాలు. పన్ను రిటర్నుల సార్వత్రికీకరణ, మరియు ఆస్తుల ప్రకటనలు ధనవంతుల నుంచి సముచిత పన్నులను సేకరించడంలో,  పేదలకు మౌలిక వసతులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ధనం మూలం ఇదం జగత్తు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.  ఒక కుటుంబం నడవాలన్నా, ఒక దేశం నడవాలన్నా ధనం ముఖ్యం, మూలం. 

భారతదేశంలోని సంపద, ఆస్తి యాజమాన్యం

అగ్రస్థాయిలోని ఒకశాతం భారతీయులు 40.5%  భారీసంపదను కలిగి ఉన్నారు.  కానీ,  బాటమ్ 50%లో  కేవలం 3% మాత్రమే సంపద కలిగి ఉన్నారు (ఆక్స్ఫామ్ నివేదిక 2023).   సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువైన బినామీ ఆస్తులు ఉన్నట్లు అంచనా.   రియల్ ఎస్టేట్ భారత జీడీపీలో 7% వాటా కలిగి ఉంది. కానీ, పన్ను ఎగవేత ఎక్కువగా ఉన్న రంగాలలో ఇది ఒకటి.  యూఐటీఆర్స్ ఆధార్- లింక్డ్ ఆస్తుల ప్రకటనలు ఎలా పని చేస్తాయంటే.. తప్పనిసరి ఫైలింగ్ చేయాలి. ఆదాయం స్థాయి ఏదైనా, ప్రతి పౌరుడు ఆదాయం రిటర్నులను దాఖలు చేయాలి.  

సరళీకృత రిటర్నులు తక్కువ ఆదాయం ఉన్నవారికి సులభమైన లేదా నిల్ రిటర్నులను అందించవచ్చు. డేటా ఆధారిత పాలన సేకరించిన డేటా ప్రభుత్వానికి లక్ష్యాన్ని అమలు చేసే విధానాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది.  ఆధార్  అనుసంధానం ద్వారా ఒకే డేటా బేస్‌‌‌‌ను  సృష్టించడం ద్వారా ఆస్తుల ఎగవేతలను తగ్గించవచ్చు.  ఆస్తి విలువ ఆధారంగా పన్నులు  విధించడం ద్వారా ధనవంతుల నుంచి సముచిత పన్ను సేకరణ, ఆధార్ అనుసంధానంతో ఆస్తి లావాదేవీలు నిష్పాక్షికంగా మారతాయి.

- డా. బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ, భువనగిరి-