సేవింగ్స్ ఇలా..
అఖిల... ఈ మధ్యే ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. నెలకు 40 వేల రూపాయలు సంపాదిస్తోంది. సంపాదన ప్రారంభించిన వెంటనే నెలనెలా కొంత పొదుపు చేయాలని ఆమె కోరిక. కానీ పొదుపు ఎలా చేయాలి? ఎంత పొదుపు చేయాలనేది పెద్ద ప్రశ్న, నిజం చెప్పాలంటే పొదుపు చేయడం.. మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. చాలా సందర్భాల్లో దాచాలనుకున్న డబ్బును కూడా ఏదో ఒక అవసరాలకు ఖర్చు పెట్టేస్తుంటాం. పొదుపు ఒక పద్ధతి ప్రకారం మొదలుపెట్టి.. పట్టుదలతో కొనసాగిస్తేనే సక్సెస్ అవుతుంది. కొత్తగా పొదుపు ప్రారంభించే వారి కోసం ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చెబుతున్నారు. అవేంటో చూద్దాం ..
ఖర్చులను రాసుకోండి
పొదుపు చేయాలనుకుంటే మొట్టమొదట మనకు వచ్చే నెలా జీతాన్ని ఎలా, ఎందుకు, ఎంత ఖర్చు చేస్తున్నామనే విషయంపై ఒక అవ గాహనకు రావాలి. ఇదేదో ఊరికే నోటి లెక్కల తో అనుకుంటే సరిపోదు. కచ్చితంగా రాసిపెట్టుకోవాలి. అందుకే ఖర్చుల కోసం ప్రత్యేకంగా డైరీ రాసుకోవాలి. ఇంట్లో నిత్యావసరాల కోసం వాడే ప్రతి పైసాను అందులో రాసి పెట్టుకోవాలి.
గ్యాస్, కిరాణా, సామాన్లు, కూరగాయలు, పాలు, ఇంటి అద్దె ఇలా ప్రతి దాన్ని రాసుకోవా లి. అలాగే ప్రతి రోజూ మనం చేస్తున్న ఖర్చులు అంటే.. కాఫీ, టీ, న్యూస్ పేపర్, స్నాక్స్ (బయట పెట్టే ఖర్చులు) ఇలా ఏది కొన్నా ప్రతి పైసాను ఇందులో కచ్చితంగా రాసి పెట్టుకోవాలి.
Also Read :- నడుం నొప్పితో బాధపడుతున్నారా.. ఇలాంటి ఆహారం తీసుకోండి
ఇంత చిన్న చిన్న విషయాలను ఏం రాసుకుంటాంలే అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇలాంటి చిన్న ఖర్చులే చాలా సందర్భాల్లో మీ పర్సు ఖాళీ చేస్తాయి. ఒకవేళ క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే బ్యాంక్ స్టేట్మెంట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు ఆన్లైన్ అకౌంట్ ఉంటే ప్రతి నెల మీ ఖర్చులను సులభంగా విభజించుకోవచ్చు. దీనివల్ల ఎక్కడైనా అనవసరమైన ఖర్చులు ఉంటే వాటిని నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది.
బడ్జెట్ తయారు చేసుకోండి
బడ్జెట్ అంటే ఎంతో పెద్ద పదంగా అంతా అనుకుంటారు. దేశానికీ, రాష్ట్రానికే కాదు ప్రతి ఇంటికీ మనిషికీ కూడా బడ్జెట్ ముఖ్యం. ప్రతి నెలా బడ్జెట్ తయారు చేసుకుంటే దానికి అనుగుణంగా మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా మీరు అనుకున్న బడ్జెట్ కు మించి ఖర్చులు ఉండకుండా జాగ్రత్తపడాలి. మీ బడ్జె ట్ లో కారు, టూ వీలర్ ఖర్చులతో పాటు అత్యవసరాల కోసం కొంత కేటాయించాలి.
ఇప్పుడే ప్రారంభించండి
బడ్జెట్ తయారు చేసుకున్న తర్వాత అందులో ఎంత వరకు పొదుపు చేయగలరో ఓ అంచనాకు రావాలి. కనీసం మీ ఆదాయంలో 10 నుంచి 15 శాతం పొదుపు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఖర్చులు అధికంగా ఉంటే.. మీరు ఎప్పటికీ పొదుపు చేయలేరు. మీరు వేసుకున్న బడ్జెట్ ఖర్చులు తగ్గించడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలి. విలాసాలకో, సరదాలకో మీరు అధికంగా ఖర్చుచేస్తుంటే అవి తగ్గిస్తే మంచిది.
లక్ష్యాలు పెట్టుకోండి
జీవితంలో అభివృద్ధి కోరుకునే వారు కచ్చితంగా లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఏ లక్ష్యం లేని వారు ఏమీ సాధించలేరు. అందుకే మీరు పొదుపు చేయదలచుకుంటే దానికి ఓ లక్ష్యం పెట్టుకోవాలి. వాటిని దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్ప కాలిక లక్ష్యాలుగా విభజించుకోండి. సొంతిల్లు. పిల్లల చదువు, రిటైర్మెంట్ లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఉంటాయి. కారు, వెకేష న్స్ లాంటివి స్వల్పకాలిక లక్ష్యాలు. వీటి కోసం వేరువేరుగా పొదుపు చేయాలి.
సొంత ఇల్లును నిర్మించుకోవాలనుకుంటే దీని కోసం నెలనెలా ఎంత డబ్బు, ఎన్ని సంవత్సరాలు పొదుపు చేస్తే సొంత ఇల్లును కొనుక్కోగలరో ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. దీని కోసం ఇన్వెస్ట్మెంట్లు, షేర్స్, బాండ్స్ వంటి వాటిని ఆశ్రయించవచ్చు. అయితే, వీటిలో కొన్ని రిస్క్ కూడుకొని ఉంటాయి. కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాలి.
=== V6 వెలుగు, లైఫ్