మిడ్​మానేర్​ నిర్వాసితులకు.. ఇండ్లు ఏమాయె

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  మిడ్ మానేరు డ్యాంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. మీ త్యాగాలు వృథాగా పోవు. డ్యాంలో మునిగిన 12 గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లకిచ్చినట్లు  రూ. 5.04లక్షలు ఇస్తాం’  అని సీఎం కేసీఆర్ 2015 జూన్‌‌లో వేములవాడ పర్యటన సందర్భంగా రాజన్న గుడి మెట్ల సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా మిడ్​మానేరు నిర్వాసితులకు ఇండ్ల నిర్మాణానికి పైసలు రాలేదు. ఈ నేపథ్యంలో 12 గ్రామాల నిర్వాసితులు నిరసన బాటపట్టారు. 

ఎనిమిదేండ్లుగా ఎదురుచూపులే

బోయిన్‌‌పల్లి మండలం మాన్వాడ వద్ద 25.6 టీఎంసీల సామర్థ్యంతో  2.32లక్షల ఎకరాలకు  సాగునీరు అందించేందుకు  2006లో మిడ్ మానేర్ ​ప్రాజెక్ట్ నిర్మాణం ​ప్రారంభించారు. 2019లో ప్రాజెక్ట్​కంప్లీట్ అయింది. డ్యాం నిర్మాణంలో 18 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.  కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్​పల్లి, అనుపురం, రుద్రవరణం, కొడముంజ, చీర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రవాణి పల్లె, ఆరెపల్లి, సంకెపల్లి, గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లోని 11,731 కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఆర్‌‌‌‌అండ్ఆర్​కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 242 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. అయితే ఈ జాగాల్లో నిర్వాసితులు సొంత డబ్బుతోనే ఇండ్లు నిర్మించుకున్నారు.  

2015లో వేములవాడలో పర్యటించిన సీఎం కేసీఆర్‌‌‌‌.. ఇండ్లు నిర్మించుకున్న నిర్వాసితులకు ప్రతి ఇంటికి రూ.5.04లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు. 12  గ్రామాల్లో ఏ ఒక్క ఇంటికీ ఈ డబ్బులు రాలేదు. 2016లో మిడ్ మానేరు కట్ట తెగినప్పుడు పరిశీలనకు వచ్చిన సీఎం.. ముంపు గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు రూ.2లక్షలు ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆఫీసర్లు వెంటనే ముంపు గ్రామాల్లో సర్వే చేసి దాదాపు 4వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో కేవలం 2 వేల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారు. మిగతా వారికి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. 

నిర్వాసితుల నిరసనలు

తమకు రావాల్సిన పరిహారాల కోసం నిర్వాసితులు 2015 నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. 2019లో ముంపు గ్రామాల ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. బోయిన్‌‌పల్లి మండలం నీలోజిపల్లె నుంచి సుమారు 20 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఇటీవల సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాకలో  అఖిలపక్షం లీడర్లు భారీ బహిరంగ సభ నిర్వహించారు. గత నెలలో మరో పోరాటానికి ముంపు బాధితులు నిరవదిక దీక్షలకు సిద్ధం కాగా పోలీసులు హౌజ్ అరెస్టులు చేశారు. యాక్టివ్‌‌ లీడర్లను పోలీస్ స్టేషన్లకు తరAలించారు.  మరోవైపు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం ఆపేది లేదని నిర్వాసితులు పేర్కొంటున్నారు. సీఎం హామీకి 2023 జూన్​నాటికి ఎనిమిదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా 8 రోజులు నిరసన చేపట్టేందుకు షెడ్యూల్​రూపొందించుకున్నారు. ఈ నెల18న ముంపు గ్రామాల్లో 8 మొక్కలు నాటారు. 19న రాజన్న టెంపుల్ లో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వారాంతంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఐక్యవేదిక లీడర్లు, నిర్వాసితులు చెప్పారు.

ఇండ్ల పరిహారం అందే దాకా పోరాటం 

2015లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా పోరాటం ఆపేది లేదు. ప్రతి నిర్వాసితునికి ఇంటి నిర్మాణానికి రూ.5.04లక్షలు ఇచ్చే దాకా పోరాడుతాం. సీఎం హామీకి ఎనిమిదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా 8 రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ముంపులో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. నీలోజిపల్లె నుంచి చీర్లవంచ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి ముంపు బాధితులకు ఉపాధి కల్పిస్తామన్న కేటీఆర్​ మాట ఇచ్చారు. దానిని కూడా నెరవేర్చాలె. 
- కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు