
- అర్ధరాత్రి 12 తర్వాత రెస్టారెంట్లు ఓపెన్
- ఐటీ ఎంప్లాయీస్, యూత్ లో మస్తు క్రేజ్
- తెల్లవారుజాము వరకు సాగుతున్న బిజినెస్
సిటీలో బిర్యానీ అంటే నచ్చని వాళ్లు ఎవరుంటారు? క్రేజీగా పొద్దున్నే అదీ కోడి కూయక ముందే వేడివేడిగా ఘుమఘుమలాడే బిర్యానీ లాగించేస్తే ఎలా ఉంటుంది? వాహ్.. సూపర్ కదా.. ఈ ఐడియానే అమలు చేస్తూ బిర్యానీ లవర్స్‌ను నోరూరిస్తున్నాయి 3 ఏఎం, 4 ఏఎం బిర్యానీ సెంటర్లు. ఇది నిజాంకాలంనాటి లైఫ్ స్టైల్ ట్రెండ్. దీనికి మళ్లీ క్రేజీ పెరుగుతుంది. ఇంతకీ రెస్టారెంట్లు ఎక్కడుంటాయి.. వాటిల్లో స్పెషల్ ఏంటో తెలుసుకోండి.
హైదరాబాద్, వెలుగు: బర్త్ డే, మ్యారేజ్ డే.. ఇలా సందర్భం ఏదైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి లంచ్ లేదా డిన్నర్‌కు వెళ్లడం ఒకప్పటి మాట. ఇప్పడు ట్రెండ్ మారింది. అకేషన్ ఏదైనా సరే కాస్త వెరైటీగా ప్లాన్ చేసుకుంటుంది నేటి యూత్. అలాంటి వారి కోసమే ఈ ఎర్లీ మార్నింగ్ రెస్టారెంట్లు. తెల్లవారుజామున 3, 4 గంటలకు మొదలుకొని మార్నింగ్ 9 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వాటిలో హైదరాబాద్ దమ్ బిర్యానీతో పాటు హోస్కేట్ బిర్యానీ, జొన్న బిర్యానీతో... మండీ, కబాబ్స్, సూప్స్ ఇలా కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా రకరకాల ఐటమ్స్ ఫుడ్ లవర్స్‌ను ఫిదా చేస్తున్నాయి. ఈ రెస్టారెంట్లను రాత్రి 12 గంటలకు ఓపెన్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఘుమఘుమలాడే వంటకాలు తయారు చేసి అందిస్తారు.
సోషల్ మీడియాతో ఫేమస్..
ఈ రెస్టారెంట్లు చాలా రోజుల నుంచే ఉన్నప్పటికీ సోషల్ మీడియా కారణంగా ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ ఎర్లీ మార్నింగ్ బిర్యానీని రుచి చూసేందుకు నగర నలుమూలల నుంచి వచ్చి రెస్టారెంట్ల ముందు క్యూ కడుతున్నారు. ఇన్స్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చూసి ‘ఓసారి టేస్ట్ చూసి పోదాం’ అని వెళ్తున్న వారూ లేకపోలేదు.
వీకెండ్‌లో ఎక్కువ గిరాకీ..
ఐటీ, బీపీవో, నైట్ షిప్టు ఎంప్లాయీస్‌ను దృష్టిలో పెట్టుకుని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు 3 ఏఎమ్, 4 ఏఎమ్, మిడ్ నైట్ బిర్యానీల పేరుతో కొత్త రెస్టారెంట్లను ప్రారంభించారు. సాధారణ రోజుల్లో గిరాకీ అంతంతమాత్రంగా ఉన్నా వీకెండ్‌లో మాత్రం కస్టమర్లతో కిక్కిరిసిపోతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు.
కనుమరుగైన సంస్కృతి మళ్లీ..
హైదరాబాద్‌కు ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినే సంస్కృతి కొత్తేం కాదు. నిజాం కాలంలో నవాబులు షహరీలలో పాల్గొని తెల్లవారుజామున 3, 4 గంటలకు తినేవారు. ఆ సంస్కృతి కాలక్రమేణా కనుమరుగైంది. మళ్లీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిర్యానీల పేరుతో విస్తరిస్తుంది. యూత్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ 4 ఏఎమ్ కాన్సెప్ట్ మొదలుపెట్టాం. స్టార్టింగ్‌లో అంతంత మాత్రంగానే నడిచేది. రెగ్యులర్ కస్టమర్స్ పెరిగారు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్, యువతతో రద్దీగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. మా దగ్గర చిట్టి ముత్యాలతో చేసే బిర్యానీ చాలా ఫేమస్. దీనితో పాటు కబాబ్స్ ఇతర వంటకాలు తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి.
– దివాకర్, ఎన్వీ కింగ్స్ 4ఏఎమ్ బిర్యానీ, మాదాపూర్
రెండేండ్లుగా రన్ చేస్తున్నాం
2021 నవంబర్ నుంచి ఈ రెస్టారెంట్‌ను రన్ చేస్తున్నాం. పొద్దున 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మా దగ్గర చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలు ఫేమస్. వీక్ డేస్‌లో ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్‌లో ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తుంటారు.
–రాహుల్, శాంతాస్ 4ఏఎమ్
బిర్యానీ మాదాపూర్
వారానికి ఒక్క సారైనా తింటాం
నేను ఐటీ ఎంప్లాయ్‌ని. నా షిఫ్ట్ మార్నింగ్ 3.30కి ముగుస్తుంది. నేను, నా కొలీగ్స్ వారానికి ఒక్కసారైన మార్నింగ్ బిర్యానీ తింటాం. ఎప్పుడు ఒకే చోట తినం. దాదాపు మార్నింగ్ తెరిచి ఉండే అన్ని రెస్టారెంట్లలో తిన్నాం. ఇది మాకు ఒక హాబీగా మారింది.
– కిరణ్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్,
కూకట్ పల్లి