నాంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం

  • తప్పతాగి జనాలపైకి దూసుకెళ్లిన వ్యక్తి
  • 12 మందికి గాయాలు, 8 బైకులతోపాటు కారు ధ్వంసం
  • నిందితుడిని పట్టుకొని చితకబాదిన స్థానికులు

మెహిదీపట్నం, వెలుగు : నాంపల్లి నీలోఫర్ కేఫ్ వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. తప్పతాగిన వ్యక్తి కారుతో జనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా, మరో కారుతో పాటు 8 బైక్​లు ధ్వంసమయ్యాయి. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన అహ్మద్ మాలిక్ (32) ప్రైవేటు జాబ్​చేస్తున్నారు. పీకలదాకా మద్యం సేవించి, బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్కడే బిర్యానీ కోసం లక్డీకాపూల్ నుంచి బజార్ ఘాట్​లోని అహమదుల్లా హోటల్​కు బయలుదేరాడు.

మార్గమధ్యలో నీలోఫర్ కేఫ్ వద్ద చాయ్ తాగుతున్న జనాలపైకి దూసుకెళ్లాడు. దీంతో12 మందికి గాయాలు కాగా, ఇందులో మొయినుద్దీన్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో కారుతో పాటు 8 బైక్​లు ధ్వంసం అయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ఫుల్లుగా మద్యం తాగి ఉండడంతో పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.