గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గూడూరులోని నెక్కొండ రోడ్ లోని గణేశ్ వైన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు అర్దరాత్రి దొంగతనం చేసి నాలుగున్నర లక్షలు ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్ ప్రశాంత్ వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు షాపు క్లోజ్ చేసి వర్కర్లు ఇంటికి వెళ్లిపోయారు. అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తి షాపు పై భాగంలో రేకులను తొలగించి లోనికి చొరబడ్డాడు. కౌంటర్లో ఉన్న నాలుగున్నర లక్షలను ఎత్తు కెళ్లినట్లు ఆరోపించారు. ఉదయాన్నే షాపు తీసి చూసే సరికి దొంగతనం జరిగినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఎస్సై గిరిధర్ రెడ్డి సీసీ టీవీ పుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ఓనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మండలంలోని లక్ష్మిపురం గ్రామంలో కిరాణ షాపుల్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించారని నలుగురు అనుమానితులను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుకున్న వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కిరాణం షాపుల్లో దొంగతనం చేయడానికి నలుగురు కలిసి ప్రయత్నం చేసినట్టు నేరం ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.