అర్ధరాత్రి వరుస దొంగతనాలు..భయాందోళనలో లక్సెట్టిపేట

లక్సెట్టిపేట, వెలుగు : లక్సెట్టిపేట పట్టణంలో గురువారం అర్ధరాత్రి జరిగిన దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. సుమారు 6 దుకాణాల్లో వెనుక డోర్లు పగులగొట్టి క్యాష్ కౌంటర్లలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ప్రభుత్వ కళాశాల సమీపంలో మూడు దుకాణాలు, ఊట్కూర్ చౌరస్తా వద్ద మూడు దుకాణాల్లో దొంగతనాలు జరిగాయి.  

ఓ దుకాణంలో జరిగిన చోరీకి సంబంధించి దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో ఒక్కరే క్యాష్ కౌంటర్ లో డబ్బులు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 30 వేల రూపాయల వరకు చోరీ అయినట్లు భావిస్తున్నారు.