మహబూబ్నగర్/చిన్నచింతకుంట, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు ఉన్నప్పుడే నాట్లు పడిపోవాలని రైతులు ఆలస్యం చేయడం లేదు. దీంతో స్థానికంగా ఉన్న కూలీలు సరిపోవడంలేదు. బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ నుంచి కూలీలు వస్తున్నారు. వీరికి ఎకరాకు రూ.4వేల నుంచి రూ. 4500 చెల్లిస్తున్నారు. దాదాపు మూడు నెలల పాటు వ్యవసాయ పనులు చేసుకునేందుకు కుటుంబాలతో సహా వస్తున్నారు.
రూ.6,500 నుంచి రూ.7 వేల చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా స్థానికంగా కూలీలు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 20 వేల మందికి పైగానే ఇతర రాష్ర్టాల వలస కూలీలు పాలమూరులో నాట్లు వేయడానికి వచ్చారు. అందులో అత్యధికంగా నాలుగు వేల మంది బిహార్ కు చెందిన కూలీలే ఉన్నారు. వీరంతా చిన్నచింతకుంట, మదనాపురం, కొత్తకోట, దేవరకద్ర మండలాల ప్రాంతాల్లో నాట్లు వేస్తుండగా, కర్ణాటక రాష్ర్టానికి చెందిన కూలీలు మాగనూరు, కృష్ణ, మక్తల్, ఊట్కూరు మండలాల్లో.. హన్వాడ, మహబూబ్నగర్ రూరల్, కౌకుంట్ల ప్రాంతాల్లో ఒరిస్సాకు చెందిన కూలీలు, వేపూర్
మదనాపురం తదితర ప్రాంతాల్లో యూపీకి చెందిన కూలీలు నాట్లు వేస్తున్నారు. స్థానిక కూలీలు వరి నారును క్రమ వరుసలో కాకుండా నాట్లు పెట్టుకుంటూ పోతారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న కూలీలు తాళ్లను ఉపయోగించి సాళ్ల పద్ధతిలో నాట్లు పెడుతున్నారు. ఇలాంటి సాళ్ల విధానంతో నాట్లు వేస్తే వరి పిలకలు బాగా వస్తాయి. చేనులోకి గాలి బాగా వస్తుంది. చీడ పీడలు కూడా తక్కువగా ఉంటాయి. పాలమూరులో వరినాట్ల పని దొరకడంతో ఈ వలస కూలీలు ఇంటిల్లిపాది వచ్చి ఉపాధి పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.