- మిరపకు తెగుళ్లతో దొరకని కూలి
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండేండ్లుగా ఇదే దుస్థితి
- గతేడాది జిల్లాకు 48,141 మంది కూలీలు రాగా.. ఈసారి 35,618 మంది మాత్రమే రాక..
- వచ్చినోళ్లకూ పనిలేక సొంతూళ్లకు తిరిగెళ్తున్న పరిస్థితి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో మిరపకాయ కోతలకు వచ్చే వలస ఆదివాసీలు పనులు లేక వాపస్ వెళ్తున్నారు. గత రెండేళ్లుగా మిరప తోటలకు తెగుళ్లు సోకుతుండడంతో సరైన దిగుబడి లేదు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో 26,195, ఖమ్మం జిల్లాలో 97,239 ఎకరాల విస్తీర్ణంలో మిరప పంట సాగవుతోంది.
తెగుళ్ల కారణంగా పూత రాక, పూత వచ్చినా నిలువునా ఎండిపోయి మొక్కలు చనిపోయాయి. ఈ నేపథ్యంలో మిరప తోటల్లో కూలి పనులకు వచ్చే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర పక్క రాష్ట్రాల వలస ఆదివాసీలకు చేతి నిండ పనులు దొరకడం లేదు.
ఊరి బయట గుడారాలు కనిపించట్లే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో ఊరిబయట చిన్న చిన్న గుడారాలు నిర్మించుకుని వలస ఆదివాసీలు మిరప తోటల్లో పనులకు వెళ్తారు. వీరి కోసం రైతులు ముందుగానే దండకారణ్యంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజన గూడేలకు వెళ్తారు. వారికి అడ్వాన్సు రూపంలో డబ్బులు ఇచ్చి పనులకు తీసుకొచ్చుకుంటారు. సంక్రాంతి సమయంలో మిరప కోతలకు తెల్లారక ముందే తోటల్లోకి వెళ్తారు. రెండు దశాబ్దాల కింద వరకు ఏటా ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి గొత్తికోయలు రాత్రి వేళల్లో వచ్చి కల్లాల్లో ఎండబెట్టిన మిరప కాయలను ఎత్తుకెళ్లేవారు.
కేవలం వాటి కోసమే మైళ్ల కొద్దీ దూరం నడుచుకుంటూ వచ్చేవారు. కాలక్రమేణా ఈ దొంగతనాలకు చెక్‌పెట్టి పని చేసి శ్రమకు తగిన మిరప కాయలను కూలిగా తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇటు రైతులకు కూడా కూలీల కొరత తీరింది. దీంతో ప్రతీ సంవత్సరం వలస ఆదివాసీలు మిరప తోటల్లో కోతలకు వస్తున్నారు. కానీ ఈసారి గ్రామాల్లో వారు కన్పించడం లేదు. వారి గుడారాల జాడలేదు. 2021-–22 సంవత్సరంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు 27,017 మంది వలస ఆదివాసీలు
ఖమ్మం జిల్లాకు 21,124 మంది వచ్చారు. కానీ ఈ సంవత్సరం భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు 21,412 మంది, ఖమ్మంక జిల్లాకు 14,206 మంది మాత్రమే వచ్చారు. ఈసారి పనులు దొరకడం మరింత కష్టమవడంతో వచ్చిన వారు కూడా తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారు.
సానుభూతితో వ్యవహరించాలి
రైతులు కష్టంలో ఉన్నారు. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న వలస ఆదివాసీలు ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు. వలస ఆదివాసీలు, రైతుల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలి. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు వలస ఆదివాసీలకు తగిన ఉపాధి అవకాశాలు చూపించాలి.
– యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
తోటల పరిస్థితి దారుణం
గతంలో ఎన్నడూ లేనంతగా మిరప రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తెగుళ్లు వచ్చి పంటలు పోయాయి. ఉన్న పంటకు దిగుబడి తక్కువగా వచ్చిన ధరలు లేక పెట్టుబడులు వచ్చే దాఖలాలు కన్పించడం లేదు. మేము ప్రతీ సంవత్సరం కూలీలను ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకొస్తుంటాం. ఈసారి వారికీ పని లేకుండా పోయింది.
– బోర అప్పారావు, మిర్చి రైతు,కొత్తపల్లి