గోపాల్ పేట, వెలుగు: ప్రభుత్వం రైతులకు సాగునీటి సౌకర్యాలు కల్పిస్తుండడంతో వలసలు వాపస్ వస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. శనివారం గోపాల్ పేట మండలం బుద్ధారంలో జాగీర్దార్ కాల్వకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు వందేళ్ల కిందటి జాగీర్దార్ కాలువకు పునరుజ్జీవం కల్పించామన్నారు. ఈ కాలువ ద్వారా బుద్దారం, పొలికెపాడు, చెన్నూరు గ్రామాలతో పాటు నాలుగు తండాలు, గోపాల్ పేట శివారులోని కాలువ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు.
కాలువ కింద భూమి కోల్పోయిన రైతులందరికీ పరిహారం ఇప్పిస్తామని, కాలువకు కేటాయించిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయవద్దని కోరారు. అనంతరం వేరుశనగ పొలంలో రైతులతో ముచ్చటించారు. అంతకుముందు తొలిమెట్టులో భాగంగా గోపాల్ పేట జడ్పీహెచ్‌లో రేవల్లి, గోపాల్ పేట మండలాల స్థాయి బోధనాభ్యసన సామాగ్రి మేళాను ప్రారంభించారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది వేయాలని, తద్వారా లక్ష్యం పెట్టుకునే చదువుతారని అభిప్రాయపడ్డారు. మన ఊరు–మన బడితో స్కూళ్లను బాగు చేస్తున్నామన్నారు.