రాష్ట్రం వచ్చినా సాగునీరు రాలే.. పాలమూరు వలసలు ఆగలే..!

రాష్ట్రం వచ్చినా సాగునీరు రాలే.. పాలమూరు వలసలు ఆగలే..!
  • భూములు పడావు పెట్టి పోతున్న జనాలు  
  • కరువు ప్రాంతాలకు సాగునీరివ్వకపోవడం, గిరిజన యువతకు ఉపాధి చూపకపోవడమే కారణం 

మహబూబ్​నగర్​, వెలుగు : పాలమూరు వలసలు ఆగడం లేదు.  మొన్నటి వరకు గుంపులుగా పోయేవారు..ఇప్పుడు ఒక్కొక్కరుగా వలస పోతున్నారు. ఒక్కో కుటుంబానికి ఎకరా నుంచి ఎకరన్నర వరకు మాత్రమే భూమి ఉండడం, సాగుకు నీళ్లు లేకపోవడం, ఉపాధి కూడా దొరక్క ఉన్న ఊరిని విడిచి వేరే ప్రాంతానికి పోతున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కొడంగల్​, కోస్గి, దౌల్తాబాద్​, దామరగిద్ద, నారాయణపేట, కోయిల్​కొండ, గండీడ్​, మహ్మదాబాద్, హన్వాడ, నర్వ, మహబూబ్​నగర్​, నవాబ్​పేట, మద్దూరు, బాలానగర్, నాగర్​కర్నూల్​, వనపర్తి ​ ప్రాంతాల్లో అత్యధికంగా గిరిజన తండాలున్నాయి. 65 ఏండ్ల కిందట అప్పటి ప్రభుత్వం గిరిజన కుటుంబాలకు అర్ధ ఎకరా, ఎకరా, ఎకరన్నర అసైన్డ్​, లావుని పట్టా, సీలింగ్​ భూములను కేటాయించింది. అప్పట్లో గిరిజన కుటుంబాలు వర్షాధార పంటలు సాగు చేసేవారు. కాలువలు, లిఫ్ట్​ స్కీంల ద్వారా నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో యాసంగిలో కూలీ పనులకు వెళ్లేవారు. రాను రాను వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వలసలు ఎక్కువయ్యాయి. దీంతో పాలమూరు అంటేనే వలసల జిల్లాగా పేరు సంపాదించింది. 

సాగుకు భరోసా కల్పించకనే..

తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు వలసలు ఆగాయని, రివర్స్​ పాలమూరుకే వలస వస్తున్నారని రాష్ర్ట ప్రభుత్వం చెబుతోంది. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాగు నీరు లేక, స్థానికంగా ఉపాధి దొరక్క,  కుటుంబాలను పోషించుకునేందుకు పక్కనే ఉన్న మహారాష్ర్ట, కర్ణాటక ప్రాంతాలకు వలసపోతున్నారు. 2016 డిసెంబరులో రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ప్రకారం ఈ ప్రాంతాల్లో 3,30,288 గిరిజనులున్నట్టు తేలింది. అయితే 2021 డిసెంబర్​లో ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్ ​కోసం తీసిన లెక్కల్లో రెండు లక్షల మందికిపైగానే వలసపోయినట్టు గుర్తించారు. ఇప్పుడీ లెక్క ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో వలస పోయేవారంతా డ్రాట్ ఏరియాలకు చెందిన వారే.. అయినా 25 ఏండ్లుగా ఏ ప్రభుత్వం సాగునీటిని అందించే ప్రయత్నం చేయలేదు. జీఓ 69 ద్వారా 'నారాయణపేట- –కొడంగల్​' స్కీంను చేపడితే నారాయణపేట జిల్లాలోని కరువు ప్రాంతాల్లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశమున్నా, రాష్ర్ట ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇది కేంద్ర స్కీం కావడంతో.. దీన్ని చేపట్టడం వల్ల కేంద్రానికే పేరు వస్తుందనే కారణంతో పక్కన పెట్టేసింది. పీఆర్​ఎల్​ఐలో భాగమైన కర్వెన నుంచి ఈ జిల్లాకు సాగునీటిని అందిస్తామని ఆరున్నరేండ్లుగా రాష్ర్ట ప్రభుత్వం ఊరిస్తూనే ఉంది. హన్వాడ, గండీడ్​, మహ్మదాబాద్​, కోయిల్​కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ సాగునీటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాలేదు. కోయిల్​సాగర్​ ప్రాజెక్టున్నా.. దేవరకద్ర, మరికల్​మండలాల వరకే నీరందించే పరిస్థితి ఉంది.

ఉపాధి లేక..

జిల్లాలోని గిరిజనుల్లో 14 నుంచి 30 ఏండ్లలోపు వయస్సున్నవారు 26 శాతం మంది ఉన్నారు. వీరిలో చాలామంది టెన్త్​, ఇంటర్​ వరకే చదువుకున్నారు. 2014 నుంచి రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో వీరి చదువుకు తగ్గ ఉపాధి కరువైంది. దీనికితోడు జిల్లాలో 2012 నుంచి ఇప్పటి వరకు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి ఏపీలో మంజూరు చేసిన కంపెనీలనే సెజ్​లో ప్రారంభించారు. ఈ కంపెనీల్లో స్థానికులనే దినసరి కూలీలుగా తీసుకోగా.. ఉద్యోగులను మాత్రం ఏపీ, యూపీ, బిహార్​కు చెందిన వారితో నింపేశారు. కరువు ప్రాంతాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్ ​యూనిట్లు, ఇతర పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి చూపించాల్సి ఉన్నా అలా చేయట్లేదు. దీంతో ఇక్కడి వారు పక్క రాష్ర్టాలకు వెళ్లి డ్రైవర్లుగా, డెలివరీ బాయ్స్​డ్యూటీలు చేస్తున్నారు.  

లెక్కలు ఎక్కడ?

2016లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో.. 2017లో నిర్వహించిన రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళన (ఎల్ఆర్ఈపీ)లో వలస కూలీల వివరాలను నోట్​చేయలేదు. తండాల్లో ఉన్న వారి వివరాలను మాత్రమే సేకరించింది. ఎల్ఆర్ఈపీ కింద అందుబాటులో ఉన్న వారి వివరాలు సేకరించి, వలస పోయిన వారి భూములకు సంబంధించిన డిజిటల్​ సిగ్నేచర్​లను పెండింగ్​లో పెట్టింది. అప్పటి వరకు ఉమ్మడి ఏపీలో 14 లక్షల మంది పాలమూరు నుంచి కూలీలు వలస పోతున్నారని చెప్పిన ప్రస్థుత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు..2018 నుంచి వాపస్​ వలసలు వస్తున్నారని ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ, 2020 మార్చిలో విధించిన కొవిడ్ ​లాక్​డౌన్​తో ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది ఉమ్మడి జిల్లాల పరిధిలోని చెక్​పోస్టుల వద్ద క్వారంటైన్​లో ఉండడం కనిపించింది. ఆ టైంలో కూడా వీరి వివరాలు ఎంట్రీ చేయలేదు. వ్యాక్సినేషన్​ టైమ్​లో వంద శాతం వ్యాక్సినేషన్​ పూర్తి చేశామని చెప్పినా, ఇందులో వలస కూలీలుగా ఉన్న వారంతా ముంబై, పుణేలోనే టీకాలు తీసుకున్నట్లు తేలింది. 

  • ఇది పాలమూరు జిల్లా మహ్మదాబాద్​మండలంలోని అన్నారెడ్డిపల్లి. 2012 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ కుటుంబాలు 200 వరకు ఉన్నాయి. జనాభా 2,100 కాగా, 850 మంది ఓటర్లున్నారు. వీరికి లావుని, సీలింగ్​, అసైన్డ్​ భూమి కలిపి 1,500 ఎకరాలుంది. కానీ, సాగునీటి వసతి లేదు. బోర్లున్నా నీళ్లు లేవు. దీంతో భూములను పడావుగా వదిలేసి  1,200 మంది ముంబై, పుణేలకు వలస పోయారు. 
  • ఇది మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలంలోని రామ్​నాయక్​తండా. ఇక్కడ 65 ఎస్టీ కుటుంబాలున్నాయి. 730 మంది జనాభా, 350 వరకు ఓటర్లున్నారు. వీరికి 300 ఎకరాల అసైన్డ్,​ 200 ఎకరాల పట్టా భూములున్నాయి. సాగుకు నీరు, ఉపాధి లేక 150 మంది ముంబై, హైదరాబాద్ ​వలస పోయారు.
  • ఆటోలో ముందు కూర్చున్న వ్యక్తి రాత్లావత్​ రాజు. ఇతడిది పాలమూరు జిల్లాలోని రామ్​నాయక్​ తండా. ఇతడికి అరెకరం పొలం ఉంది. సాగుకు నీళ్లు లేక, కుటుంబ పోషణ భారమై భార్య పిల్లలతో కలిసి ఏండ్ల కింద పుణేకు వలస పోయాడు. వారం క్రితం బంధువుల ఇంట్లో ఫంక్షన్​ ఉంటే వచ్చి మళ్లీ ముంబై బస్సెక్కేందుకు ఆటోలో ప్రయాణమయ్యాడు.   

భూమి ఉన్నా.. నీళ్లు లేవు

నా భర్త కాలం చేసిండు. ఎకరా భూమి ఉన్నా నీళ్లు లేక పడావు పెట్టిన. నాకు ఇద్దరు ఆడ బిడ్డలు, కొడుకు ఉన్నాడు. ముగ్గురిని గవర్నమెంట్ ​హాస్టల్​లో చేర్పించి, నేను పుణేకు వలసపోయినా. ఇక్కడ రోజూ కూలీకి పోతే రూ.250 మించి రాదు. ఆ పైసలతో పిల్లల చదువులు, కుటుంబ పోషణ ఎట్లా అయితది? పుణేలో రోజు కూలి రూ.600 వరకు ఇస్తరు. అందుకే అక్కడికి వెళ్లినా. పిల్లల్ని చూడాలనిపిస్తే, మూడు నెలలకోసారి వచ్చిపోతా. - తారాబాయి, వలస కూలి, అన్నారెడ్డిపల్లి

ఆరుగురు కొడుకులు వలస పోయిండ్రు

నాకు ఆరు మంది కొడుకులు . అందరికీ కలిపి రెండున్నర ఎకరాల భూమే ఉంది. ఆ భూమిలో నీళ్లు లేవు. బోర్లు వేసినా నీళ్లొస్తలేవు. కుటుంబం పెద్దది కావడంతో పోషణ భారమై పెద్ద కొడుకు దుబాయ్​, మిగిలిన ఐదుగురు ముంబై, పుణే వలస పోయిండ్రు. అక్కడే పార పనులు చేసుకుంటుండ్రు. ఏడాదికోసారి ఊరిలో జరిగే తుల్జా భవాని పూజకు వచ్చి.. నన్ను చూసి పోతరు. - ముత్యాలమ్మ, అన్నారెడ్డిపల్లి