- ఇటీవల కశ్మీర్ టూర్‌కు సిరిసిల్ల కౌన్సిలర్లు, వారి ఫ్యామిలీలు
- హస్తం పార్టీలోకి జోరుగా వలసలు
- కారు దిగుతున్న లీడర్లతో బీఆర్ఎస్‌లో టెన్షన్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. టూర్లు, దావత్‌లతో బుజ్జగించినా ఫలితం కన్పించడం లేదు. గత నెలలో సిరిసిల్ల బల్దియాను కాపాడుకునేందుకు కౌన్సిలర్లను కశ్మీర్ టూర్‌కు తిప్పినా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్‌లో టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఇలాఖాలో కాంగ్రెస్‌లోకి వలసలు పెరగడం ఆయనకూ ఇబ్బందికరంగా మారింది.
టూర్లకు తిప్పినా కారు దిగుతున్నారు
హైకమాండ్ సూచన మేరకు పార్టీని వీడుతారన్న సమాచారంతో పలువురు బల్దియా కౌన్సిలర్లు, వారి కుటుంబాలను నార్త్ ఇండియా టూర్‌కు తీసుకెళ్లారు. టూర్లో భాగంగా కశ్మీర్ కు తీసుకెళ్లి దావత్లు ఇచ్చి మరీ బుజ్జగించారు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కరుగా బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. నాలుగు రోజుల కింద నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో తమ వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, మాజీ మంత్రి కేటీఆర్ కూడా తమను ఏనాడూ పట్టించుకోలేదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు కౌన్సిలర్లు ఆరోపించారు.
వీరితోపాటు ఇటీవల ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్యతోపాటు 8 మంది సర్పంచులు, తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల కాంగ్రెస్ లో చేరారు. గంభీరావుపేట మేజర్ జీపీ సర్పంచ్ శ్రీధర్ సైతం హస్తం పార్టీలో చేరారు. ఎల్లారెడ్డిపేట జీపీ పాలకవర్గం సైతం అధికార పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఇన్నాళ్లూ బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న సిరిసిల్లలో క్యాడర్ కాంగ్రెస్‌లోకి పోతుండడం పార్టీలో కలవరం నెలకొంది.
పదవులపై ఆశతోనే..?
పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలకు ఎలక్షన్లు జరుగుతాయి. అప్పటి వరకు అధికార పార్టీలో ఉంటే ఏదో ఒక పదవి దక్కించుకోవచ్చన్న ఆశతో లీడర్లు అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు భారీగానే ఉన్నారు. వీరితోపాటు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో నిరాదరణకు గురైనవారు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
రెండు సెగ్మెంట్లలోనూ ప్రతిపక్షం ఖాళీ..!
జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో గతంలో బీఆర్ఎస్ బలంగా ఉండేది. కాగా అధికారం పోయాక ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు పెరిగాయి. ఇప్పటికే వేములవాడ సెగ్మెంట్ లో ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతలు భారీగా చేరుతున్నారు. వేములవాడలో బల్దియాలో వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. సిరిసిల్లలోనూ త్వరలోనే మరి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరో 10 మంది కౌన్సిలర్లు కారుదిగి హస్తం పార్టీలో చేరితే సిరిసిల్ల బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ మీటింగ్‌లు నిర్వహించినప్పుడల్లా పార్టీ ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు కళకళలాడుతుండేవి. కానీ ప్రస్తుతం పలువురు లీడర్లు మీటింగ్‌లకు డుమ్మా కొడుతుండడం పార్టీలో చర్చ జరుగుతోంది.