నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా సబ్బండ వర్గాల ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం రోడ్డెక్కి కొట్లాడారు. తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేండ్లలో నిధులు, నియామకాల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో నీళ్ల గోస ఇంకా అట్లనే ఉన్నది. పాలమూరు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. భూమి ఉన్నా పండించుకోలేని దీనస్థితిలో ఎంతో మంది అన్నదాతలున్నారు. ఉన్న ఊరును, కన్నవారిని వదిలి పొట్టకూటి కోసం దేశ నలుమూలలకు పాలమూరు వాసుల వలస బాట ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిస్థితి మారుతుందనే భావన ఉండేది. కానీ ప్రాజెక్టుల నిర్మాణంలో, పూర్తి చేయడంలో ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన అలసత్వం, నిర్లక్ష్యమే ఇప్పుడూ సాగుతున్నది. దీంతో చేసేది లేక ఇప్పటికీ చాలా మంది పిల్లల చదువులు, పొట్ట కూటి కోసం ముంబై ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
వలస వెళ్లి ఇబ్బందులు పడుతూ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం జనాభా 42 లక్షలు. కాగా అందులో దాదాపు15 లక్షల మంది వలస వెళ్లడం ఆందోళన కలిగిస్తున్నది. ఊరిలో భూమి ఉన్నా సాగునీరు లేక వ్యవసాయం చేయలేని పరిస్థితి. పిల్లలను హాస్టళ్లలో వేసి ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు, ఇతర నగరాలకు తరలిపోతున్నారు. స్వరాష్ట్రంలో కూడా వలసలు తప్పకపోవడంతో చాలా మంది ఆవేదన చెందుతున్నారు. వలసల నివారణకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాలమూరును దత్తత తీసుకున్నారు. స్వరాష్ట్ర సాధనలోనూ నాయకులు అనేక సందర్భాల్లో పాలమూరు వలసలను ఆపేందుకు హామీలు ఇచ్చారు. కానీ వలసలు ఆగలేదు. అభివృద్ధి జాడలేదు. పక్కనే నదులు పారుతున్నా పాలమూరు జిల్లాకు నీళ్లు అందని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో నలభై లక్షల ఎకరాల వ్యవసాయయోగ్య భూములున్నాయి. అయితే వాటికి నీటి వసతి లేదు. దీంతో ఆ భూముల్లో మెట్ట పంటలు సాగు చేస్తున్నారు. పడీపడని వర్షాలతో ఆ భూముల్లో మెట్ట పంటలు కూడా పండటం లేదు. ఒకవేళ పండినా అరకొర దిగుబడే. పాలమూరు నుంచి వలస వెళ్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఎక్కువ. మధ్యవర్తులు ఒక జంటకు పది నెలల సీజన్‌కు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఇచ్చి తీసుకువెళ్తున్నారు. వెళ్లిన చోట సౌలత్లు సక్కగ లేక ఇబ్బంది పడటం, ప్లాస్టిక్ కవర్లు, ఫ్లెక్సీలతో గుడారాలు వేసుకొని వర్షాలకు, చలికి ఇబ్బంది పడుతూ, తిండి దొరక్క నానా కష్టాలు అనుభవిస్తూ కూలి పనులు చేస్తున్నారు. వలస కూలీలంటే పనిచేయించుకుంటున్న వారికి కూడా చులకనే. కూలీలను పనికి తీసుకెళ్లేటప్పుడు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వారిపేర్లు నమోదు చేయించాలి. ఒక్కొక్కరికి లక్ష రూపాయల బీమా చేయించాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. కార్మిక చట్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వలస కూలీలకు కనీస పని గంటలు ఉండవు. పొద్దు పొడిచింది మొదలు చీకటయ్యే వరకు పనిచేస్తూనే ఉండాలి. డబ్బులు ఇచ్చి తీసుకువెళ్లిన మధ్యవర్తులు, పని చేయించుకునే ఓనర్ల దుర్మార్గాలకు ఎంతో మంది వలస కూలీలు ప్రాణాలు విడుస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. పాలమూరు జిల్లాలో వలస కూలీ శవం రాని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. వలస వెళ్లిన ప్రాంతంలో కూలీ మరణిస్తే శవాన్ని సొంత ఊరికి పంపడానికి డబ్బులు లేక చందాలు వేసుకుంటారు. అదీ సాధ్యం కాకపోతే పని ప్రదేశంలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. వలస వెళ్లిన మహిళా కూలీలు అక్కడ సరైన రక్షణ లేక అత్యాచారాలకు గురైన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి అనేక ఘటనలను బయటకు రానియ్యరు.
ప్రాజెక్టులు పూర్తిగాక..
అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 67 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాజెక్టు వల్ల పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీటి సదుపాయం లేదు. 1943లో నిజాం నవాబు కాలంలో నిర్మించిన డిండి ప్రాజెక్టు మొదలు మొన్నటి జలయజ్ఞం ప్రాజెక్టుల వరకు పాలమూరు జిల్లాలో నిర్మించిన ఏ ప్రాజెక్టూ పాలమూరు బీడు భూములను తడపడం లేదు. ఇక్కడి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు వలసబాట వీడటం లేదు. అంబేద్కర్ లిప్ట్ ఇరిగేషన్ పథకం పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా మార్చిన పాలకులు, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని నేటికీ పూర్తి చేయలేదు. ఇక్కడి ప్రజలు ప్రాజెక్టుల్లో తమ భూములు కోల్పోవడంతోపాటు, ఆయా ప్రాజెక్టుల నిర్మాణంలో కూలి పనిచేస్తున్న దుస్థితి నెలకొంది. డిండి, జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పనులు కూడా ముందుకు సాగడం లేదు. జూరాల ప్రాజెక్టు మొదలు ప్రతిపాదిత సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, కర్నాటక అభ్యంతరం తర్వాత దాన్ని 6 టీఎంసీలకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాజెక్టులో నిల్వ ఉండే నీరు సాగుకు సరిపోదని రైతులు నిట్టూరుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో పాలమూరు బిడ్డల కష్టార్జితం ఉన్నది. దాదాపు50 వేల మంది కార్మికులు ప్రాజెక్టుల్లో కూలీలుగా మారారు. సీఎం కేసీఆర్ ఉంటున్న ప్రగతి భవన్‌లో కూడా పాలమూరు కార్మికులు పనిచేస్తున్నారన్నది కఠోర సత్యం. స్వరాష్ట్రంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా దుస్థితి ఇలాగే కొనసాగడం ఎంత మాత్రమూ సమంజసం కాదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. బీడు భూములకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. వలసల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అమలు చేయాలి. - జటావత్ హనుము, రీసెర్చ్ స్కాలర్, ఓయూ