- చెరకు క్రషింగ్ కోసం
- కర్నాటక, మహారాష్ట్ర వెళుతున్నవలస కూలీలు
- నారాయణ ఖేడ్లోపోలింగ్ శాతం తగ్గే అవకాశాలు
సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ ప్రాంతవాసులు చాలామంది పోలింగ్ కు దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో గిరిజన కుటుంబాలు మూటాముల్లె సర్దుకుని పిల్లలతో కలిసి చెరుకు క్రషింగ్ కోసం మహారాష్ట్ర, కర్నాటకకు వలస వెళతారు.
ఈ పరిస్థితి ఎక్కువగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, మనూర్ మండలాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా గిరిజన తండాలు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వలసల సీజన్సరిగ్గా ఎన్నికల టైంలో రావడంతో పోలింగ్‌పై ప్రభావం పడనుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వలసలు ఆగడం లేదు.
ఏడాదిలో 6 నెలలు..
వలస కూలీలు ఏడాదిలో ఆరు నెలలు ఇతర ప్రాంతాల్లో పనిచేసి తిరిగి సొంతూరికి వస్తారు. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ మరో ఆరు నెలలు కుటుంబాలను పోషిస్తారు. ఈ విధంగా నారాయణఖేడ్ ప్రాంతంలో వందల కుటుంబాలు వలసలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మరికొంతమంది హైదరాబాద్‌వెళ్లి ఫుట్‌పాత్‌లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు.
వ్యవసాయేతర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని వారు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్లు మాత్రం ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఓటు వేయాలనే విషయాన్ని పట్టించుకోకుండా పనికోసం వలస వెళుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, అధికారులు ఎంత బుజ్జగించినా వారు వినకుండా వలస వెళుతున్నారు.
పోలింగ్ పై ప్రభావం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో 84.31 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి వలసల సీజన్ వల్ల వందల కుటుంబాలు ఊర్లని విడిచి వెళ్లిపోయాయి. ఈ కారణంగా అక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం స్పందించి ఓటు విలువ గురించి తెలియజేసి ఓటర్లను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ ఇప్పటివరకు అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వలసలు మరింత పెరుగుతున్నాయి. ఈ వలసల ప్రభావం కచ్చితంగా ఓటింగ్‌పై, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపు, ఓటములపై పడుతుందని అంచానా.
చైతన్యం కల్పిస్తున్నాం
నారాయణఖేడ్ ప్రాంతంలో వలసపోతున్న కుటుంబాల్లో చైతన్యం కల్పిస్తున్నాం. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 2018 సాధారణ ఎలక్షన్ లో ఖేడ్ నియోజకవర్గంలో 84 శాతం పోలింగ్ కాగా ఈసారి 90 శాతానికి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. వలసలకు పోతున్న మాట వాస్తవమే కానీ వాటిని ఆపి బయట ఉన్న ఓటర్లను కూడా పిలిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ALSO READ : మళ్లీ గెలిచిన తర్వాత డోర్నకల్‌కు నిధులు ఇస్తా : కేసీఆర్
నలువాల వెంకటేశ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి