దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం.. మాజీ ఆల్ రౌండర్ కన్నుమూత

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం.. మాజీ ఆల్ రౌండర్ కన్నుమూత

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, కోచ్ మైక్ ప్రొక్టర్ కన్నుమూశారు. ప్రోక్టర్ డర్బన్‌లో మరణించినట్లు అతని భార్య మేరీనా శనివారం ధృవీకరించారు. డర్బన్‌లోని తన ఇంటికి సమీపంలోని ఆసుపత్రిలో.. గుండె సమస్యల కారణంగా మరణించినట్లు ఆమె తెలిపారు.  77 సంవత్సరాల ఈ మాజీ ఆల్ రౌండర్  దక్షిణాఫ్రికా తరపున 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత కోచ్, మ్యాచ్ రిఫరీగా కూడా మారాడు. 

1967 నుండి 1970 వరకు మూడు సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ లో దక్షిణాఫ్రికా తరపున ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్ లో 7 టెస్టుల్లో 25 యావరేజ్ తో 225 పరుగులు చేశాడు. మరోవైపు బౌలింగ్ లో కేవలం 15 యావరేజ్ తో 41 వికెట్లు పడగొట్టాడు. 1970లో రోడేషియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా ఆరు సెంచరీలు బాదేశాడు. 1979లో గ్లౌసెస్టర్‌షైర్ తరపున రెండు హ్యాట్రిక్‌ లతో   అరుదైన ఘనత సాధించాడు. 

401 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 36.01 సగటుతో 21,936 పరుగులు చేశాడు. వీటిలో 48 సెంచరీలు, 109 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.    1971లో వెస్ట్రన్ ప్రావిన్స్‌పై రోడేషియా (ప్రస్తుతం జింబాబ్వే) తరపున 254 పరుగులు చేయడం అతని కెరీర్ లో  బెస్ట్ ఇన్నింగ్స్. బ్యాట్ తోనే కాదు బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. 19.53 సగటుతో 1,417 ఫస్ట్-క్లాస్ వికెట్లు తన ఖాతాగాలో వేసుకున్నాడు. దేశవాళీ సీజన్‌లో 500 పరుగులు, 50 వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా  దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు.