హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్య జరపడంతో 1948, సెప్టెంబర్ 17న లాయఖ్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. అదేరోజు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లేక్ వ్యూ అతిథి గృహంలో హైదరాబాద్ రాజ్యంలో భారత ప్రభుత్వ ఏజెంట్ కేఎం మున్షీని కలిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
ఈ సందర్భంలో ఏడో నిజాంతో అధికారికంగా పోలీస్ చర్యను ఆహ్వానిస్తూ, భారత సైన్యాలకు లొంగిపోతున్నట్లు, యూఎన్‌ఓలోని భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదులను ఉపసంహరిస్తూ రేడియో ప్రకటన చేయాలని కేఎం మున్షీ ప్రతిపాదించాడు. ఇందుకు అనుగుణంగా నిజాం అదే రోజు సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియోలో ప్రకటన చేశాడు. అంతేకాకుండా భారత సైన్యాలను బొల్లారం, సికింద్రాబాద్‌లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతించారు.
కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు, కొత్త ప్రధాన మంత్రిని నియమించే వరకు రోజువారి పరిపాలనా వ్యవహారాల్లో తనకు సహాయ పడటానికి కమిటీని ఏర్పాటు చేశారు. కానీ, మిలటరీ నియమాల ప్రకారం 1948, సెప్టెంబర్ 18న హైదరాబాద్ చేరుకున్న మేజర్ జనరల్ జేఎన్ చౌదరి పరిపాలన బాధ్యతలు స్వీకరించాడు.
పరిపాలన వ్యవహారాలు మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లడంతో ఈ ప్రభుత్వాన్ని మిలటరీ ప్రభుత్వం అంటారు. 1948, సెప్టెంబర్ 18 నుంచి 1949, డిసెంబర్ 31 వరకు మిలటరీ ప్రభుత్వం కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రంలో రజాకారులను, కమ్యూనిస్టులను అణచివేయడంలో విజయం సాధించారు. నిజాంకు చెందిన సర్ఫేఖాస్ భూములను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నష్టపరిహారంగా 3 కోట్ల రూపాయలను చెల్లించింది.
జేఎన్ చౌదరి పరిపాలన కాలంలో పౌర పరిపాలన శాఖను సివిల్ అడ్మినిస్ట్రేట్ అని మిలటరీ గవర్నర్ నేతృత్వంలో నెలకొల్పారు. ఈ శాఖను చూసే అత్యున్నత అధికారిని చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అని, తాలుకాదార్ (కలెక్టర్)ను సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని, దోయం తాలూకాదార్ (డిప్యూటీ కలెక్టర్)ను డిప్యూటీ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని, తహసీల్దార్‌ను అసిస్టెంట్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని పిలిచేవారు. చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్‌కు దాదాపు ముఖ్యమంత్రి హోదా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠా, కన్నడ, తెలంగాణకు ప్రాంతాలకు చెందిన 16 జిల్లాలు ఉండేవి.
ఒక్కో జిల్లాకు ఒక పౌరపాలన అధికారిని నియమించారు. అంతేకాకుండా బొంబాయి, మద్రాస్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కొంతమంది ఐపీఎస్ అధికారులను రప్పించి 16 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల కంటే ఉన్నత హోదాలో వారిని నియమించాడు. ఈ విధమైన పరిపాలన సంస్కరణలు ప్రవేశపెట్టినా హైదరాబాద్ రాష్ట్రం పాలన గాడిన పడలేదు. పోలీస్ చర్య అనంతరం జేఎన్ చౌదరి రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో భాగంగా కమ్యూనిస్టులను అణచివేశాడు.
కేంద్ర ప్రభుత్వం జేఎన్ చౌదరికి ఐదుగురు సలహాదారులను నియమించింది. చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దత్త ప్రసన్న సదాశివ బాఖ్లే (డీఎస్ బాఖ్లే), అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్డీ ఆర్ ప్రధాన్ (ఐసీఎస్), సభ్యులు నవాబ్ జైన్ యార్జంగ్ బహదూర్, రాజా దొండిరాజ్ బహదూర్, జి.వి.హెచ్.కృష్ణారావు, సి.వి.ఎస్.రావు
జేఎన్ చౌదరి ఫర్మానా (1949, ఫిబ్రవరి 6)
ఈ ఫర్మానాను రాజ్‌ప్రముఖ్ హోదాలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం శుక్రవారం స్థానంలో ఆదివారంగా మార్చారు. జాగీర్లు రద్దయ్యాయి. ఈ చర్య వల్ల హైదరాబాద్ నగరం అత్యంత ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న నగరంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. నిజాం కరెన్సీ రద్దయింది. 1955, ఏప్రిల్ 1న ఉస్మానియా సిక్కా పూర్తిగా రద్దయింది. నిజాం ఆస్తి అయిన సర్ఫేఖాస్ను ప్రభుత్వం వినియోగించుకున్నది.
పండిట్ సుందర్‌లాల్ కమిటీ
పోలీస్ చర్య సందర్భంగా భారత సైన్యం చేతిలో వేల మంది ప్రాణాలను కోల్పోయారని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించిన పండిట్ సుందర్‌లాల్ కమిటీ రిపోర్టులో పేర్కొన్నది. పోలీస్ చర్య వల్ల నిజాంతోపాటు రజాకార్లు, వారి నాయకుడు ఖాసీం రజ్వీ లొంగిపోయారు. కానీ రజాకార్లు లొంగిపోయే ముందు వారి ఆయుధాలను కమ్యూనిస్టులకు అప్పగించారనే తప్పుడు భావనతో మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి కేంద్ర ప్రభుత్వ పరోక్ష అండదండలతో కమ్యూనిస్టులతోపాటు ముస్లింలపై దాడులను ముమ్మరం చేయడం కాకుండా మారణహోమం సృష్టించారు.
చివరికి భారత ప్రభుత్వం ముస్లింలపై జరిగిన దాడులపై విచారణ జరపడానికి 1949, అక్టోబర్‌లో పండిట్ సుందర్‌లాల్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. సభ్యులుగా ఖాజీ అబ్దుల్ గఫార్, మౌలానా అబ్దుల్ మిస్త్రి, కార్యదర్శులుగా ఫరూఖ్ సియార్, పి.వి.అంబుల్కర్లను నియమించారు. ఈ కమిటీ 1949, నవంబర్ 29 నుంచి హైదరాబాద్‌తోపాటు 9 జిల్లాలు, ఏడు జిల్లాల కేంద్రాలు, 21 పట్టణాలు, 23 గ్రామాలను సందర్శించి విచారణ జరిపింది. 1949, డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
ఈ నివేదికలోని అంశాలను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం వల్ల దాడుల తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2013లో యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియంలోని లైబ్రరీలో ఉన్న నివేదికను అందుబాటులోకి తెచ్చింది. పండిట్ సుందర్‌లాల్ కమిటీ నివేదిక ఢిల్లీలోని లైబ్రరీలో ఉంది. దీనిని 2015, సెప్టెంబర్ 17న బహిర్గతం చేశారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం 27,000 మంది మరణించారు.
జేఎన్ చౌదరి
జయంత్‌నాథ్ చౌదరి బెంగాల్‌లోని హరిపురాలో జన్మించాడు. ఈయన డబ్ల్యూసీ బెనర్జీ మనుమడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్‌ను పొందాడు. 1948, ఫిబ్రవరిలో మేజర్ జనరల్‌గా పదోన్నతి పొంది చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో జేఎన్ చౌదరి ఆర్మీ చీఫ్ హోదాలో భారత సైన్యాలను ముందుకు నడిపించాడు. దేశంలోనే అతిపెద్ద మిలటరీ స్టేషన్ అయిన సికింద్రాబాద్ బైసన్‌పోలో డివిజన్లోని బ్రిటీష్ ఆర్మీలో పనిచేశారు.