
- హైదరాబాద్‌లోని హోటల్స్‌కు సరఫరా
- ఒకరు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
యాదాద్రి, వెలుగు: పాలలో నీళ్లను కలిపి కల్తీ చేయడం చూశాం. కానీ చుక్క పాలు లేకుండా పాలపొడిలో ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి హైదరాబాద్‌లోని హోటల్స్‌కు సప్లై చేస్తున్న ముఠాను ఆదివారం ఎస్‌వోటీ, భువనగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురానికి చెందిన బాలనర్సయ్య, అతడి కొడుకు భాస్కర్ 6 నెలలుగా పాల వ్యాపారం చేస్తున్నారు. నకిరేకంటి రాజు వీళ్ల దగ్గర వర్కర్‌గా పనిచేస్తున్నాడు. భాస్కర్ కుటుంబానికి డెయిరీగానీ, కనీసం ఒక గేదెగానీ లేదు. హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్‌ను పాలపౌడర్తో కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు.
రోజు 300 నుంచి 400 లీటర్లు తయారు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు హోటల్స్‌కు సప్లై చేస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు రావడంతో ఆదివారం ఎస్‌వోటీ, భువనగిరి రూరల్ పోలీసులు బీఎన్ తిమ్మాపురంలోని పాల తయారీ సెంటర్‌పై దాడి చేసి, ఎరుకల భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పాల తయారీ సెంటర్ నుంచి120 లీటర్ల కల్తీ పాలు, డాల్ఫర్ ఫ్రెష్ మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్, మిక్సింగ్ రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌వోటీ సీఐ నవీన్ తెలిపారు. ఈ పాలను ఏయే హోటల్స్‌కు పంపుతున్నారో, ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.