- తాము చెప్పిన వరి రకాలు సాగు చేస్తేనే కటింగ్ లేకుండా కొంటామని షరతు
- లేకపోతే కోత తప్పదని రైతులకు మిల్లర్ల హుకూం
- స్థానికంగా సీడ్స్ దొరకక వేరే జిల్లాల నుంచి తెచ్చుకుంటున్న రైతులు
జగిత్యాల, వెలుగు: వానాకాలం సీజన్‌కు రెడీ అవుతున్న రైతులకు మిల్లర్లు కండీషన్లు పెడుతున్నారు. తాము చెప్పిన వరి రకాలు సాగు చేస్తేనే కటింగ్ లేకుండా తీసుకుంటామని, లేకపోతే కోత తప్పదని హుకూం జారీ చేస్తున్నారు. అయితే ఎలాంటి అగ్రిమెంట్లేకుండా కేవలం నోటిమాటగానే చెబుతుండడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మిల్లర్లు చెప్పిన సీడ్ స్థానికంగా దొరకక కొందరు రైతులు వేరే జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నారు. గతంలో కొందరు మిల్లర్లు చెప్పిన సీడ్స్ వేసిన కొనుగోళ్ల టైంలో కటింగ్తప్పలేదని గుర్తుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సర్కార్, అగ్రికల్చర్ ఆఫీసర్లు సైలంట్‌గా ఉండడం గమనార్హం.
ఏటా 3 లక్షల ఎకరాల్లో సాగు
జగిత్యాల జిల్లాలో ఏటా వానాకాలం సీజన్‌లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ సీజన్ లో 60–70 శాతం సన్న రకాలు పండిస్తే 30–-40 శాతం దొడ్డు రకాల వడ్లు సాగు చేస్తారు. కానీ సన్నరకాల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో గతేడాది నుంచి వానాకాలంలోనూ దొడ్డు రకాలు సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. పైగా ప్రభుత్వం సన్నరకానికి రూ. 2,030 మద్దతు ధర ఇస్తే దొడ్డు రకానికి రూ. 2,060 ధర ఇవ్వడం కూడా రైతులు
పునరాలోచనలో పడ్డారు. ఇటీవల సెంట్రల్ సర్కార్ మద్దతు ధరను రూ.2,203కు పెంచింది. దీంతో దొడ్డురకం సాగు పెరగగా సన్న రకం సాగు పడిపోయింది. ప్రస్తుతం రైతులు దొడ్డు రకాలు 2 లక్షల ఎకరాల్లో, సన్న రకాలను లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరోవైపు దొడ్డు రకాలకు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర దక్కుతుండడం, సన్నరకాల కోసం మిల్లర్లపై ఆధారపడాల్సి రావడం కూడా రైతులు దొడ్డు రకాల వైపు మొగ్గుతున్నారు. అయితే మిలర్లు సన్నరకాలు వేస్తేనే తీసుకుంటామని తేల్చిచెప్పడం, అయినా కొంటారన్న గ్యారంటీ లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
సన్నాలు సాగు చేయాలని మిల్లర్ల పేచీ
తాము సూచించిన వరి రకాలు సాగు చేస్తనే కటింగ్ లేకుండా కొంటామని మిల్లర్లు చెబుతుండడంతో రైతులు వారు చెప్పిన రకాల కోసం తిరుగుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాగవుతున్న ఎంటీయూ-1001, ఎంటీయూ-1156, ఎంటీయూ-1153, ఎంటీయూ-1121, ఎంటీయూ-3291 రకాలు ఎఫ్‌సీఐ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని మిల్లర్లు పేచీ పెడుతున్నారు. ఈ రకాలను మిల్లింగ్ చేసినప్పుడు నూక శాతం ఎక్కువగా వస్తోందని, ఈ వానాకాలం సీజన్ నుంచి ఈ రకాలను తీసుకోబోమని మిల్లర్లు కరాఖండిగా చెబుతున్నారు. వీటికి బదులు ఎంటీయూ-1061, ఎంటీయూ-1064, ఎంటీయూ-1271, ఎంటీయూ-7029, బీపీటీ-5204, బీపీటీ-1224, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ సోనా వంటివి సన్నాలను సాగు చేయాలని మిల్లర్లు సూచిస్తున్నారు. అయితే ఈ రకాలు స్థానికంగా దొరకకపోవడంతో కరీంనగర్, వరంగల్, కోదాడ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు.
మిల్లర్లపై భారం వేసి నాట్లు
కొనుగోళ్ల టైంలో రైతులు కటింగ్పేరుతో దోపిడీకి గురవుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన సర్కార్.. మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడంపై చేసేదేమీ లేక వారు సూచించిన రకాలు సాగుచేసేందుకు రెడీ అవుతున్నారు. రైతులతో ఎలాంటి అగ్రిమెంట్ లేకున్నా మిల్లర్ల నోటిమాటతోనే వారు చెప్పిన రకాలను సాగుచేస్తున్నారు. ఇప్పటికే నాట్లు కూడా స్టార్ట్అయ్యాయి.
గతంలో మిల్లర్లు చెప్పిన రకం వేసినా కటింగ్ తప్పలే..
ప్రస్తుతం మిల్లర్లు మీటింగ్‌పెట్టి రైతులందరూ భద్రకాళి, బీపీటీ రకానికి చెందిన వడ్లు పండిస్తే పావు కేజీ కూడా కటింగ్ లేకుండా కొంటామని చెబుతున్నారు. గతంలో మిల్లర్లు చెప్పిన రకం వడ్లు సాగు చేసినా.. అడ్డగోలుగా 7 కేజీలు కటింగ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో మిల్లర్ ఒక్కో రకంగా చెబుతున్నారు.
- బరుపటి జనార్దన్, రైతు, జగిత్యాల
300 కి.మీ. వెళ్లి విత్తనాలు కొనుకొచ్చా
గతంలో నాణ్యమైన వరి రకాలు వేసినా 5 కేజీలకు పైగా కట్ చేశారు. భద్రకాళి రకానికి చెందిన వడ్ల విత్తనాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొరకడం లేదు. వ్యయ ప్రయాసాలకోర్చి సుమారు 300 కి.మీ. దూరంలో కోదాడ వెళ్లి కొనుక్కొస్తున్నాం. పంట సాగయ్యాక మిల్లర్లు ఏం చేస్తారో చూడాలి.
- అల్లం రమేశ్, రైతు, వెల్గటూర్