- సీఎంఆర్ అప్పగింతపై మిల్లర్ల మల్లగుల్లాలు
- జిల్లాలో కొనడానికి వడ్లు లేక పక్కచూపులు
- ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోళ్లు
- రేషన్ బియ్యంపై కూడా నజర్
- మీటర్ రన్ కాకుండా సీఎంఆర్ఇస్తే దొరికి పోతామని అతి తెలివి
నిజామాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న వడ్లను బయట అమ్ముకున్న మిల్లర్లు వాటిని తిరిగి భర్తీ చేయడానికి దొడ్డిదారిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు తమ ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని కొంటూనే మరో వైపు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రైస్ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రైస్రవాణా అవుతోంది.
రేషన్ బియ్యంపై చూపు..
సీఎంఆర్ భర్తీకి మిల్లర్లు రేషన్ రైస్‌పై నజర్‌పెట్టారు. జిల్లాలో 4.2 లక్షల రేషన్ కార్డులుండగా, 759 షాపుల ద్వారా ప్రతినెలా 6,449 మెట్రిక్ టన్నుల రైస్ పంపిణీ అవుతుంది. బియ్యాన్ని బయట అమ్ముకునే వ్యక్తుల వివరాలను రేషన్ డీలర్ల నుంచి సేకరించి ఏజెంట్ల ద్వారా వారిని క్యాచ్ చేస్తున్నారు. డీలర్‌కు క్వింటాల్‌కు రూ.500 కమీషన్ ముట్టజెప్పి, రూ.2,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. విలేజ్‌కు చెందిన ఏజెంట్‌కు క్వింటాల్‌కు రూ.200 కమీషన్ ఇస్తున్నారు. ఇలా ఏజెంట్లు రోజుకు రూ.5 వేల దాకా సంపాదిస్తున్నారు. సేకరించిన రైస్‌ను అర్ధరాత్రి దాటిన తర్వాత సారంగాపూర్, బోధన్ శివారులోని 12 రైస్ మిల్లులకు వ్యాన్లలో తరలిస్తున్నారు.
బిహార్ నుంచి..
ఈ నెల 15న రుద్రూర్‌లోని ఒక రైస్‌మిల్లుకు బిహార్ నుంచి దొడ్డు బియ్యం లారీ లోడ్ వచ్చింది. సీఎంఆర్ కొరతను భర్తీ చేయడానికి ఓ మిల్లర్అక్కడి నుంచి బియ్యం తెప్పించాడు. మరో పది రోజులు కంటిన్యూగా పది లోడ్లు తెప్పించుకోడానికి పేమెంట్కూడా చేశాడు. జిల్లాలో 71 బాయిల్డ్, 257 రా రైస్ మిల్లులు ఉండగా నిజామాబాద్, బోధన్ చుట్టే సగం ఉంటాయి. ఈ రెండు ఏరియాల్లోని 18 మిల్లులకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి రోజు 25 లారీల రైస్ రవాణా అవుతోంది. ఈ రకంగా హైదరాబాద్‌నుంచి 308 క్వింటాళ్ల బియ్యంతో వచ్చిన లారీని 15 న పట్టుకున్న పోలీసులు రూరల్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఇవి రేషన్బియ్యామా? లేక వేరేనా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు.
వడ్లు లేక తిప్పలు
2022–23 ఖరీఫ్‌కు సంబంధించి 22 వేల టన్నులు, అదే ఏడాది యాసంగికి చెందిన 3.12 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఎఫ్ సీఐకి చేరాల్సి ఉంది. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించిన గవర్నమెంట్ చివరగాఈ నెలాఖరుకు డెడ్‌లైన్ విధించింది. తర్వాత వడ్ల విలువలో 25 శాతం పెనాల్టీ విధిస్తామని, సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ఇచ్చింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సీఎంఆర్ పట్ల సీరియస్‌గా ఉన్నందున వీలైనంత త్వరగా బియ్యాన్ని అప్పగించాలనే ఆత్రుతలో మిల్లర్లు అడ్డదారులు తొక్కుతున్నారు.
రీసైక్లింగ్ ఎత్తుగడ
గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మరాడించి బియ్యంగా మార్చడానికి కచ్చితంగా మిల్లు నడపాల్సిందే. ఒక నెలలో వినియోగించిన కరెంట్‌తో ఎంత మేర వడ్లను మరాడించిన విషయాన్ని అంచనా వేయొచ్చు. బయట నుంచి నేరుగా బియ్యాన్ని సేకరిస్తున్న మిల్లర్లు వాటిని అలాగే సీఎంఆర్కింద తోలితే కరెంట్ బిల్లుల్లో దొరికిపోతామని బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు.