సీఎంఆర్ టూ లేట్..!

సీఎంఆర్ టూ లేట్..!
  • డెడ్​లైన్​ను డోంట్ కేర్ అంటున్న మిల్లర్లు
  • గత వానాకాలం టార్గెట్ నేటికీ పూర్తి కాలే..
  • మిల్లర్ల మాయాజాలంపై ఆఫీసర్ల నజర్​

జనగామ, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్ అందజేయడంలో మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసర్లు డెడ్ లైన్ పెడుతున్నా డోంట్ కేర్​ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్కారుకు టైంకు బియ్యం అందడంలేదు. ఒక సీజన్ వడ్లను మరో సీజన్​కు వాడుకుంటూ రొటేషన్​ చేస్తూ మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగగా, ప్రస్తుత కాంగ్రెస్ ​పాలనలో ఆఫీసర్లు చీకటి దందాకు చెక్​పెడుతున్నారు. 

గత వానాకాలందే పెండింగ్..​

జనగామ జిల్లాలో గత వానాకాలం సీఎంఆర్ టార్గెట్ నేటికీ పూర్తి కావడం లేదు. సర్కారు కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలోని 58 మిల్లులకు 80,864.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అందించగా, 86.43 శాతం అనగా, 46, 089.182 మెట్రిక్​టన్నుల బియ్యం మాత్రమే సర్కారుకు అందించారు. ఇంకా 54,273.889 మెట్రిక్ టన్నులు అందించాల్సి ఉంది. ఖిలాషాపూర్ పీవీఆర్ ఆగ్రో మిల్లు, స్టేషన్ ఘన్​పూర్​ మండలం శివునిపల్లి రాజరాజేశ్వరీ బిన్నీ రైస్ మిల్, కేశవాపూర్ చల్లా ఏజెన్సీస్ మిల్లు, జఫర్​గఢ్​ఉదయశ్రీ రైస్ మిల్లు, కంచనపల్లి రాజరాజేశ్వరీ మిల్లు, కన్నెబోయిన గూడెం శ్రేష్ట రైస్ మిల్లు, సూరారం సంతోషీమాత రైస్ మిల్లు, కుందారం విజయ దుర్గా రైస్ మిల్లు నుంచి ఎక్కువ మొత్తం సీఎంఆర్​ పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 గత యాసంగిలో 49 మిల్లులకు కొనుగోలు కేంద్రాల ద్వారా 142 వేల 806.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించగా, ఇప్పటి వరకు 59.75 శాతం అనగా, 57,864.438 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అందించారు. ఇంకా 96,844.687 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అందించాల్సి ఉంది. మిగిలిన బియ్యాన్ని త్వరగా అందించాలని ఆఫీసర్లు రివ్యూ మీటింగ్​లు పెట్టి మిల్లర్లను హెచ్చరించినా, పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 

మిల్లర్ల మాయాజాలం..

సీఎంఆర్ రైస్ అందించడంలో మిల్లర్లు రొటేషన్ దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సర్కారు కొనుగోళ్ల ద్వారా అందించే వడ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సీజన్​ ప్రకారం రైస్​అందించకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో అధికారులు మిల్లర్ల మాయాజాలంపై ఫోకస్​పెట్టారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల అధికారుల తనిఖీల్లో దేవరుప్పుల మండలం మన్​పహాడ్ సాయిరామ్ మోడ్రన్ బిన్నీ రైస్ మిల్ లో అవకతవకలు బయటపడ్డాయి. రూ 5.67 కోట్ల విలువ చేసే సీఎంఆర్ మాయమైనట్లు సివిల్​సప్లై అధికారులు గుర్తించి, యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

 రైస్ మిల్లర్ తోపాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను గుర్తించి సొమ్మును రికవరీ చేయాలని తహసీల్దార్​ను కలెక్టర్ ఆదేశించారు. సదరు మిల్లర్​కు 2022-–23, 2023-–24 కు సంబంధించిన యాసంగి, వానాకాలం సీజన్లకు 1987.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవ్వగా, కేవలం 143.038  మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అందించారు. రూ.5.67 కోట్ల విలువైన 1774.071 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు మాయంకావడంతో చర్యలకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలిచ్చి సుమారు 15  రోజులు కావస్తున్నా, అక్కడి రెవెన్యూ అధికారులు, పోలీసులు అంతగా పట్టింపులేనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

మిల్లర్లను ఆదేశించాం..

సకాలంలో సీఎంఆర్ అందించాలని జిల్లాల్లోని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. పూర్తిగా వెనకబడిన మిల్లర్లను హెచ్చరించాం. దేవరుప్పుల మండలం మన్​పహాడ్​లో ఇటీవల చేపట్టిన తనిఖీల్లో రూ.5 కోట్ల పై చిలుకు విలువ చేసే సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. సీఎంఆర్ సేకరణను మరింత స్పీడప్ చేస్తాం. ​ - హథీరామ్, సివిల్ సప్లై డీఎం, జనగామ