- ఖమ్మం జిల్లాలో 18,513, భద్రాద్రి జిల్లాలో 3,077 టన్నులు పెండింగ్
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించేందుకు అధికారులకు మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. గడువులోగా అందించడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతేడాది వానాకాలం (ఖరీఫ్) సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటి వరకు అప్పగించలేదు. నిబంధనల ప్రకారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(కేఎంఎస్) సెప్టెంబర్ 30తోనే ముగిసింది. అప్పటికి ఇంకా 100 శాతం సీఎంఆర్ రాకపోవడంతో చివరి అవకాశంగా ప్రభుత్వం గడువు పెంచింది.
డిసెంబర్ 31లోపు బియ్యం అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96.24 శాతం పూర్తి కాగా, ఖమ్మం జిల్లాలో 90 శాతం పూర్తయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా 3,077 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో ఇంకా 18,513 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉందని అధికారులు చెబుతున్నారు. గడువు కంటే ముందుగా సీఎంఆర్ పూర్తిగా అందజేసిన వారికే ఈ సీజన్ లో మళ్లీ ధాన్యం కేటాయిస్తామని ఆఫీసర్లు సమావేశాలల్లో పదేపదే చెబుతున్నా మిల్లర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షణ లోపంతోనే డిలే..?
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ఆలస్యానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్, జులై వరకు వేగంగా జరిగిన సీఎంఆర్ రికవరీ.. ఆ తర్వాత నత్తనడకను సాగుతోంది. మొన్నటి వరకు అధికారులు, సిబ్బంది అంతా ఎలక్షన్ డ్యూటీల్లో ఉండడంతో మిల్లర్లు కూడా లైట్ తీసుకున్నారు. ఇక సివిల్ సప్లయ్స్ మేనేజర్‌కు జిల్లా సివిల్సప్లయ్స్ఆఫీసర్ (డీఎస్వో) గా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఇద్దరి పనులను ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఆర్నెళ్లుగా రెగ్యులర్ డీఎస్వో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.
మిల్లర్ల వద్ద అసలు ధాన్యం ఉందా? లేదా?
ఖమ్మం జిల్లాలో గతేడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 7 పారా బాయిల్డ్, 57 రా రైస్ మిల్లులకు 2,72,593 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చారు. మొత్తం 1,82,637 మెట్రిక్ టన్నుల బియ్యం సప్లయ్ చేయాల్సి ఉండగా, 1,64,123 మెట్రిక్ టన్నులను సివిల్ సప్లయ్స్ కు, ఎఫ్సీఐ గోడౌన్లకు రవాణా చేశారు. అయితే మిగిలిన బియ్యం ఇచ్చేందుకు మిల్లర్ల దగ్గర అసలు ధాన్యం ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఆఫీసర్లు కొన్ని మిల్లులను విజిట్ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు.
రబీకి సీఎంఆర్ 4.2 శాతమే..
గతేడాది ఖరీఫ్‌కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటికీ పెండింగ్ ఉండగా, గతేడాది రబీకి సంబంధించిన సీఎంఆర్ రికవరీకి కూడా ప్రభుత్వం ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది రబీ సీజన్ కు సంబంధించి 25,016 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా శుక్రవారం వరకు కేవలం 4,019 టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు. మొత్తం సీఎంఆర్ లో ఇది 16 శాతం మాత్రమే. ఇంకా 20,996 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో 66,950 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2,842 మెట్రటిక్టన్నులు(4.2 శాతం) మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇంకా 64,108 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మరో రెండు వారాల్లో రబీ సీఎంఆర్ లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యమనే తెలుస్తోంది.
ఖరీఫ్ సీఎంఆర్ 90 శాతం పూర్తయింది
ఖమ్మం జిల్లాలో గతేడాది ఖరీఫ్ కు సంబంధించి 90 శాతం సీఎంఆర్ పూర్తయింది. పెండింగ్ ఉన్న మిల్లర్లతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం. ఇంకా 18,513 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. వాటిని గడువులోగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
శ్రీలత, సివిల్ సప్లయ్స్ జిల్లా ఆఫీసర్