- సీఎమ్మార్ చుట్టే రాజకీయాలు హైకోర్టుకెక్కిన పంచాయితీ
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో 2023 ఏడాదికి సంబంధించిన సీఎంఆర్ పెట్టడకపోవడంతో పలువురు మిల్లర్లు డీఫాల్టర్లుగా మారారు. సంబంధిత మిల్లర్లు , సివిల్ సప్లై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆరుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను జిల్లాలోని 114 రైస్ మిల్లులకు కేటాయించారు.
మిల్లర్లు గత ఏడాది డిసెంబర్ 31 నాటికి బియ్యం అప్పగించాల్సి ఉంది. గడువు దాటినా బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలు నిర్వహించిన ఆఫీసర్లు వడ్లను మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నట్లు గుర్తించారు. దీంతో డీఫాల్ట్ మిలర్ల ఆస్తుల వివరాలు సేకరించారు. ఆరు మిల్లుల యజమాన్యంపై కేసులు వేశారు. ఇటీవల ఓ మిల్లర్ ను అరెస్ట్ చేశారు.
విజిలెన్స్ ఆఫీసర్ల సోదాలు..
ప్రభుత్వం నుంచి వడ్లను మిల్లింగ్ కోసం తీసుకొని బియ్యం ఇవ్వకుండా సతాయిస్తున్న వారిపై రాష్ట్ర విజిలెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టారు. తీసుకున్న వడ్లు పక్కదారి పట్టించడం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై దృష్టి పెట్టారు. కొందరు ప్రభుత్వ పెద్దల అండతో 2021 నుంచి ఇవ్వాల్సిన బియ్యాన్ని నేటికీ ఇవ్వలేకపోయారు. ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో లొసుగులు బయటపడ్డాయి.
దీంతో ఇక్కడి డీఎంను ప్రభుత్వం బదిలీ చేసింది. గడువులోగా ఎఫ్ సీఐకి బియ్యం ఇవ్వకుంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తప్పవని ఇటీవల మిల్లర్లను కలెక్టర్ హెచ్చరించారు. గత్యంతరం లేక కొందరు మిల్లర్లు అమ్ముకున్న వడ్లకు బదులుగా రైతుల నుంచి వడ్లు కొని బియ్యం అప్పగిస్తున్నారు. డిసెంబర్ 31నాటికి ఎఫ్ సీఐకి 3,570 ఏసీకేలు రావాల్సి ఉండగా, ఇందులో గత నెలలో 940 ఏసీకేలు అందించారు. ఈ నెల 29 చివరి గడువు పెట్టారు. ఇక రైస్ మిల్లుల్లో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కల్నల్ ప్రకాశ్ జిల్లాకు వచ్చారు. మిల్లుల్లో స్టాక్ ను లెక్కబెట్టి తక్కువ ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు.
హైకోర్టుకు చేరిన పంచాయితీ..
కొత్తకోట మండలం మిరాషిపల్లిలోని ఇషాన్ ట్రేడర్స్, పాన్ గల్ మండలం మహమ్మదాపూర్ మీనాక్షి ఫుడ్ ప్రొడక్షన్, వనపర్తి పట్టణంలోని కేదారనాథ్ రైస్ మిల్, పానగల్ మండలం ఇషాన్ ఆగ్రో, పరమేశ్వర రైస్ మిల్లులపై గత నెలలో పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు బుక్ చేశారు. ఎఫ్ సీఐకి బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలు చేసి మిల్లులను సీజ్ చేశారు.
Also Read : హైదరాబాద్ లో కారు దిగుతున్నరు!
ఈ మిల్లుల్లో 2,25,179 బస్తాల తేడా ఉన్నట్లు గుర్తించి కేసులు పెట్టారు. అయితే ఈ రైస్ మిల్లుల ఓనర్ పరమేశ్వర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయించుకొని మిల్లుల్లో వడ్ల బస్తాలు మరోసారి లెక్కపెట్టాలని, తనపై కక్షతోనే తనను అరెస్ట్ చేసి వేధించారని హైకోర్టు దృష్టికి తేవడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తనను మంత్రి జూపల్లి కృష్ణారావు కావాలని వేధిస్తున్నారని, కేసుల్లో ఇరికించారని ఆరోపణలు చేయడంతో మంత్రి, మాజీ మంత్రి మధ్య వార్ మరోసారి బయటపడింది. అయితే తమ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన అనంతరమే కేసు నమోదు చేశారని, ఎలాంటి ఒత్తిడి లేదని వనపర్తి డీఎస్వో శ్రీనాథ్ తెలిపారు.