- యాదాద్రి, సూర్యాపేటలో 8 లక్షల టన్నులకు పైనే..
- చివరి దశకు చేరిన వడ్ల కొనుగోళ్లు
- ఇప్పటికే సగానికి పైగా సెంటర్లు మూత
యాదాద్రి, వెలుగు: వానాకాలం సీజన్వడ్లలో సగం వరకు మిల్లర్లే కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ.. సివిల్ప్లై డిపార్ట్మెంట్తో పోడి పడి కొన్నారు. ధర బాగానే ఇవ్వడం, పొలాలకు వద్దకు వెళ్లి కొనడంతో పాటు తేమ, తాలును పెద్దగా పట్టించుకోకపోవడంతో రైతులు సైతం మిల్లర్లకే అమ్మేసుకున్నారు. వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవడంతో సగానికి పైగాసెంటర్లు మూత పడ్టాయి. ఈ నెల చివరి వారానికి మొత్త ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
దొడ్డు రకాలే అధికం..
యాదాద్రి జిల్లాలో రైతులు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో దాదాపు 2.90 లక్షల్లో దొడ్డు రకాలు వేయగా.. కుటుంబ అవసరాల కోసం కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే సన్న రకాలు సాగు చేశారు. దీంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు 6 లక్షల మెట్రికల్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది.
దీంతో 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గుతుందని ఆఫీసర్లు లెక్కలు వేసుకున్నారు. వచ్చిన దిగుబడిలో 3.50 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సూర్యాపేట జిల్లా లో 4.46లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ జిల్లాలో సన్న రకం ఎక్కువగా వేశారు. మొత్తంగా 11.44 లక్షల టన్నుల( 6.24లక్షల టన్నుల సన్న వడ్లు, 5.20లక్షల టన్నుల దొడ్డు వడ్లు) దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు.
రైతుల నుంచి నేరుగా కొన్న మిల్లర్లు
సాధారణంగా సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ నుంచి వడ్లు తీసుకొని మరాడించే మిల్లర్లు ఈసారి కొనుగోలు ప్రారంభించే సమయంలోనే నేరుగా రంగంలోకి దిగారు. నిబంధనల ప్రకారం తేమ, తాలు శాతం ఉన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 2203 నిర్ణయించారు. అయితే మిల్లర్లు నేరుగా పొలాల వద్దకే వెళ్లి వడ్లు ఎలా ఉన్నా కొంటామని, క్వింటాల్ వడ్లకు రూ. 1800 నుంచి రూ. 1900 వరకూ ఇస్తామని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో రైతులు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చులతో పాటు తేమ, తాలు శాతం ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో మిల్లర్లకు అమ్మేందుకు అంగీకరించారు. దీంతో దాదాపు 2 లక్షల టన్నుల వడ్లను మిల్లర్లే కొనుగోలు చేసినట్టుగా అనధికార అంచనా. ఈసారి సూర్యాపేటతో పాటు ఏపీకి చెందిన కొందరు మిల్లర్లు కూడా జిల్లాలో వడ్లను కొనుగోలు చేసినట్టు తెలిసింది. సూర్యాపేట జిల్లాలో 6 లక్షల టన్నుల మిల్లర్లే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
యాదాద్రిలో 227 సెంటర్లు మూత
జిల్లాలో 314 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆఫీసర్లు చివరికి 293 మాత్రమే ఏర్పాటు చేశారు. అక్టోబర్ నెలాఖరులో కొనుగోళ్లు ప్రారంభం కాగా.. ఇప్పటివరకూ 28,686 మంది రైతుల నుంచి 2.46 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. 2.15 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ. 474.25 కోట్లను జమ చేశారు. ఇంకా రైతులకు రూ. 67 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో 227 కొనుగోలు సెంటర్లను మూసి వేశారు. ఇంకా రాజాపేట, తుర్కపల్లి, రామన్నపేట సహా మరికొన్ని మండలాల్లోని సెంటర్లలో వడ్ల కుప్పలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 274 సెంటర్లు ఓపెన్ చేయగా ఇప్పటివరకూ 36,022 మంది రైతుల వద్ద 1,41,241 టన్నులను సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేసింది. వీరిలో 28,071 రైతుల ఖాతాల్లో రూ. 341.09 కోట్లను జమ చేశారు.
ఇంకా 7981 మంది రైతులకు రూ. 98 కోట్లు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు120 సెంటర్లను మూసి వేశారు. నల్గొండ జిల్లాలో 245 సెంటర్లకు 232 ఓపెన్ చేసి 48106 మంది రైతుల నుంచి 3,02,800 మెట్రిక్ టన్నులు కొన్నారు. రూ.597 కోట్లు 42196 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ. 1.94 కోట్లు చెల్లించాల్సి ఉంది. 165 సెంటర్లు మూసివేశారు.