- వడ్లు దింపుకోని మిల్లర్లు.. వానలకు తడుస్తున్న కుప్పలు
- సర్కారు, మిల్లర్ల మధ్య నలుగుతున్న రైతులు
- 30శాతం సెంటర్లే ఓపెన్.. అక్కడా కొనుగోళ్లు అంతంతే
- 8 కోట్ల బ్యాగులకు టెండర్ పిలిస్తే ఒక్కరూ రాలే
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా 30 శాతం కూడా ఐకేపీ సెంటర్లను ప్రారంభించకపోవడం.. కొన్ని చోట్ల రిబ్బన్ కట్ చేసినా కాంటాలు పెట్టకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి. బార్దాన్ లేకపోవడం, తమకు బోనస్ ఇచ్చేదాకా వడ్లు దింపుకునేది లేదని మిల్లర్లు మొండికేయడంతో చాలా చోట్ల కాంటాలు నిలిచిపోతున్నాయి. మిల్లర్లకు బోనస్ ఇవ్వాలా.. సీఎంఆర్ కోటా తగ్గించాలా అన్న అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు. సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మిల్లర్లు సహకరించాలని, అంతవరకు సెంటర్ల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో దింపుకోవాలని ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మిల్లర్లతో సమావేశమై చెప్పారు. అయితే.. ఇంకా బోనస్‌పై క్లారిటీ రాకపోవడంతో మిల్లర్లు వడ్లు దింపుకుంటలేరు. సెంటర్లలో కాంటా పెడ్తలేరు.
మొదట్లో బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రారైస్ ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మిల్లర్లు, అధికారులతో సమావేశమై రా రైస్ సప్లయ్ చేస్తే వచ్చే లాభనష్టాల గురించి చర్చించారు. యాసంగి వడ్లను మిల్లింగ్ చేస్తే నూకశాతం ఎక్కువగా ఉంటుందని, తాము నష్టపోకుండా ఉండాలంటే క్వింటాల్ కు రూ. 300 బోనస్ ఇవ్వాలని మిల్లర్లు కోరారు. దీనిపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్న మంత్రి, ధాన్యం కొనుగోలుకు ఆటంకాలు కలిగించొద్దని, వడ్లు వస్తే దించుకోవాలని నచ్చజెప్పారు. అప్పటికి తలూపిన మిల్లర్లు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వాళ్ల పరిధిలోని ఐకేపీ సెంటర్లలో కాంటాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. మంత్రి మాట విని వడ్లు దించుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సివస్తుందని, సర్కారు తీసుకునే నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉంటే నష్టపోతామని వారు మొండికేస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
గన్నీ బ్యాగులు రాలే..
ఈసారి వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాదాపు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమైతే ఇప్పటి వరకు కేవలం 3 కోట్ల పాత సంచులు సేకరించారు. అవి సరిపోయే పరిస్థితి లేకపోవటంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు గన్నీ బ్యాగులు కావాలని టెండర్లు పిలిచింది. 8 కోట్ల బ్యాగులకు టెండర్ పిలిస్తే ఒక్కరు కూడా రాలేదు. మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క సెంటర్‌కు కూడా టార్పాలిన్లు సప్లయ్ చేయలేదు.
తడుస్తున్న వడ్లు.. రైతుల ఆందోళన
తెలంగాణ అంతటా వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. సెంటర్లు ఏర్పాటు చేసే ప్రాంతాలకు రైతులు వడ్లను తరలిస్తున్నారు. సెంటర్ ఓపెన్ చేసినా.. కాంటాలు పెట్టకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయి. నాలుగురోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలా చోట్ల వానలు పడుతున్నాయి. దీంతో కల్లాల్లో ఉన్న వడ్లు తడిసిపోతున్నాయి. వానకు వడ్లు కొట్టుకుపోతుండగా వాటిని కుప్ప చేయడానికి రైతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిసిపోయాయి. నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు వడ్లను నర్సాపూర్మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఆరబోశారు. కొల్చారం మండలం నాయిని జలాల్పూర్లో కొనుగోలు కేంద్రం దగ్గర ఆరబెట్టిన, కుప్పలు పోసిన వడ్లు తడిసి పోయాయి. హవేలి ఘనపూర్ మండలం నాగాపూర్‌లో వడగండ్ల వాన పడి.. వడ్ల కుప్పలు తడిసిపోయాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు ఐకేపీ సెంటర్ లో పోసిన వడ్లు వానకు కొట్టుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి, కోనరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని సెంటర్లకు తెచ్చిన వడ్లు తడిసిపోయాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ సెంటర్లో కొనుగోలు చేయకపోవడంతో వారం రోజులనుంచి కుప్పలుగా పోసిన వడ్లు పూర్తిగా తడిశాయి. సిద్దిపేట జిల్లా కోహెడ వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ వడ్ల కుప్పలు తడిసిపోయాయి.
ఇప్పటి దాకా కొన్నది కేవలం 3 శాతమే..
మంత్రులు, ఎమ్మెల్యేలు ఊరూరా సెంటర్లను గ్రాండ్‌గా ఓపెన్ చేస్తున్నప్పటికీ కాంటాలు మాత్రం పెట్టడం లేదు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల సెంటర్లు ఓపెన్ చేయాల్సి ఉండగా, గురువారం వరకు కేవలం 2,384 సెంటర్లు(30శాతం) తెరిచారు. మొత్తం 60 లక్షల టన్నుల వడ్లు కొనాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.90 లక్ష టన్నులు మాత్రమే కొన్నారు. కొనుగోళ్లు మొదలై 14 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు 3 శాతం వడ్లు మాత్రమే కొన్నారంటే కొనుగోళ్లు ఎంత మెల్లగా జరుగుతున్నయో అర్థం చేసుకోవచ్చు.
వడ్లన్నీ తడిసినయ్
మేము యాసంగిల ఐదెకరాల్లో వరి పొలం వేసినం. మొన్న వరి కోసి వడ్లను సెంటర్ కాడికి తెచ్చి కుప్పలు పోసినం. ఆఫీసర్లు ఇంకా కాంటా షురూ చేయలేదు. ఇంతట్ల గురువారం పెద్ద వాన పడి వడ్లన్నీ తడిసిపోయినయ్. వెంటనే సెంటర్ తెరిచి వడ్లు కొనాలె.
‑ నాయిని లక్ష్మి, ఎన్.జలాల్పూర్, మెదక్ జిల్లా