- జనగామ జిల్లాలో రూ.6 కోట్లకు పైగా బకాయిలు ఉన్న ఇద్దరు మిల్లర్లు
- క్రిమినల్ కేసులు పెట్టినా స్పందన కరువు
- వసూళ్ల కోసం యంత్రాంగం తిప్పలు
- రెండు మూడు రోజుల్లో చర్యలకు రంగం సిద్ధం
జనగామ, వెలుగు: సీఎంఆర్(కస్టమ్‌మిల్లింగ్ రైస్) బకాయిల చెల్లింపు పై మిలర్లు మొండికేస్తున్నారు. క్రిమినల్కేసులు పెట్టినా స్పందించకపోవడం సివిల్సప్లై అధికారులకు ఇబ్బందిగా మారింది. బకాయిపడిన బియ్యాన్ని రాబట్టేందుకు అధికార యంత్రాంగం మరింత కఠిన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఆదేశాలు బేఖాతర్..
జనగామ జిల్లాలోని 20 బాయిల్డ్ రైస్ మిల్లులు, 39 రా రైస్ మిల్లులకు అధికారులు సర్కారు సెంటర్లలో కొనుగోలు చేసిన వడ్లను పంపించారు. సకాలంలో సీఎంఆర్ రైస్‌ను అందించాల్సి ఉండగా, కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవరుప్పుల మండలం మన్పహాడ్లోని సాయిరాం మోడ్రన్ బిన్నీ రైస్ మిల్యాజమాన్యం ఏకంగా రూ.5,67,46,429 విలువ చేసే సీఎంఆర్‌ను ప్రభుత్వానికి ఇవ్వకుండా మొండికేసింది. ఈ మిల్లుకు 2022–-23 యాసంగి సీజన్, 2023-–24 వానాకాలంలో 1987.560 మెట్రిక్‌టన్నుల ధాన్యం కేటాయించగా, కేవలం 143.038 మెట్రిక్‌టన్నుల సీఎంఆర్మాత్రమే అందించింది.
మిగిలిన 1774.071 మెట్రిక్‌టన్నుల రైస్ ను అందించకుండా వడ్లను పక్కదారి పట్టించారు. దీంతో అధికారులు అక్టోబర్ లో మిల్లుపై దాడులు నిర్వహించి, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సదరు మిల్లర్ కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లను చేయొద్దని రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు సదరు మిల్లర్పేమెంట్చేయడం లేదు. రఘనాథపల్లి మండలం కంచనపల్లిలోని రాజరాజేశ్వర రైస్‌మిల్లు కూడా సుమారు రూ.కోటి విలువ చేసే సీంఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉండడంతో నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ మిల్లర్ కూడా తీవ్ర జాప్యం చేస్తున్నాడని, కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కొనసాగుతున్న సేకరణ..
జిల్లాలో గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ సేకరణ త్వరగా చేపడుతున్నారు. జిల్లాలోని రెండు మిల్లుల యజమానులు మొండికేసినా మిగిలిన మిల్లర్లు సజావుగానే సీఎంఆర్ అందిస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. 2023-–24 వానాకాలం లో 80,864.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లుకు పంపారు. మొత్తం 54,273.366 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అందించాల్సి ఉండగా, 53,399.353 మెట్రిక్ టన్నులు అందించారు.
Also Read :- ధరణి ఇక భూభారతి.. ప్రతి కమతానికి భూధార్ నంబర్
98.39 శాతం సేకరణ జరుగగా, మరో 874.013 మెట్రిక్ టన్నులు ఇస్తే పూర్తి స్థాయి టార్గెట్ చేరుకోనున్నారు. 2023-–24 యాసంగి సీజన్లో 1,42,806.160 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు పంపారు. దీనికి 96,989.808 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా, 78,878.990 మెట్రిక్ టన్నులు అందించారు. మొత్తం 81.33 శాతం సేకరణ జరుగగా మరో 18,110.819 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సేకరణ జరుగాల్సి ఉంది.
బకాయిల వసూళ్లకు చర్యలు
దేవరుప్పుల మండలంలోని సాయిరాం మెడ్రన్ బిన్నీ రైస్ మిల్లు యాజమాన్యం రూ.5,67,46, 429 విలువైన సీఎంఆర్ అందించాల్సి ఉంది. రికవరీకి ఆదేశాలిచ్చాం. సదరు మిల్లర్ పై క్రిమినల్ కేసు పెట్టినా స్పందించడం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసూళ్ల కోసం చర్యలు వేగవంతం చేస్తాం. రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని మరో మిల్లర్కూడా సీఎంఆర్ ఇచ్చేందుకు మొండికేస్తున్నారు. అతడిపై కూడా చర్యలు చేపడుతాం.- వీ హథీరామ్, సివిల్ సప్లై డీఎం, జనగామ