రెండు మిల్లుల్లో.. రూ. 217 కోట్ల సీఎంఆర్‌‌ మాయం

రెండు మిల్లుల్లో.. రూ. 217 కోట్ల సీఎంఆర్‌‌ మాయం
  • విజిలెన్స్‌‌ ఎంక్వైరీలో వెలుగు చూసిన వైనం
  • సూర్యాపేట జిల్లాకు చెందిన ఇద్దరు మిల్లర్లపై కేసులు నమోదు

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం కేటాయించిన వడ్లను బియ్యంగా మార్చి తిరిగి అప్పగించాల్సిన మిల్లర్లు అక్రమ దందాకు తెరలేపారు. సూర్యాపేట జిల్లాలోని కొన్ని మిల్లులు 2022– 23, 2023–24కు సంబంధించిన సీఎంఆర్‌‌ ఇవ్వకుండా అమ్మేసుకున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. జిల్లా సివిల్‌‌ సప్లై ఆఫీసర్లతో కలిసి మూడు రోజులుగా మిల్లుల్లో సోదాలు నిర్వహించి బియ్యం లెక్కలపై కూపీ లాగుతున్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఆరుగురు మిల్లర్లపై కేసు నమోదు కాగా తాజాగా మరో రెండు మిల్లుల్లోనూ వందల కోట్ల విలువైన సీఎంఆర్‌‌ మాయమైనట్లు లెక్క తేల్చారు.

ఇద్దరు మిల్లర్లపై క్రిమినల్‌‌ కేసులు

హుజూర్‌‌నగర్‌‌ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలం తిరుమల రైస్​కార్పొరేషన్‌‌ మిల్లులో 2022 –23, 2023– 24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 33,936 టన్నుల సీఎమ్మార్‌‌ ప్రభుత్వానికి ఇవ్వకుండా అమ్ముకున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. వీటి విలువ జరిమానాతో కలిపి రూ.107,16,90,801 ఉంటుందని తేలింది. సివిల్‌‌ సప్లై ఆఫీసర్ల సూచన మేరకు మిల్‌‌ యజమాని రాజేశ్‌‌పై నేరేడుచర్ల పోలీసులు క్రిమినల్‌‌ కేసు నమోదు చేశారు. అదేవిధంగా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని శ్రీసంతోషిమా పార్ బాయిల్డ్‌‌ మోడ్రన్‌‌ రైస్‌‌మిల్లులో 2022–23, 2023– 24 సీజన్లకు సంబందించిన సీఎంఆర్‌‌  పక్కదారి పట్టినట్లు తేలింది. మిల్లులో ఒక్క బస్తా కూడా లేదని ఆఫీసర్లు గుర్తించారు. ఈ బియ్యం మొత్తం విలువ రూ.110,39,98,525 ఉంటుందని తేల్చిన ఆఫీసర్లు గరిడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిల్లు యజమాని జి. వెంకటేశ్వర్లుపై పోలీసులు కేసు 
నమోదు చేశారు.

మిల్లు ఎదుట రైతుల ధర్నా

సీఎంఆర్‌‌ను భర్తీ చేసేందుకు మిల్లర్లు రైతుల నుంచి నేరుగా వడ్ల కొనుగోళ్లు చేపట్టారు. గడ్డిపల్లి సంతోషిమా రైస్‌‌మిల్‌‌ యజమాని రైతుల నుంచి వడ్లుకొని సీఎంఆర్‌‌ లోడు పూడ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే టాస్క్‌‌ఫోర్స్‌‌ ఆఫీసర్లు దాడి చేయడంతో అసలు విషయం బయటపడింది. మరో వైపు కొనుగోలు చేసిన వడ్లకు సంబందించిన డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు మిల్లు ఎదుట ధర్నాకు దిగారు. వందలాది మంది రైతులం వడ్లు అమ్మామని, ఇప్పుడు మిల్‌‌ యజమానిపై కేసు నమోదు కావడం, అతడు అందుబాటులో లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆఫీసర్లు ఇన్ని రోజులు ఏం చేశారని, వడ్ల కోతల సమయంలోనే కేసులు గుర్తుకువచ్చాయా? అని ప్రశ్నించారు.