మిల్లర్లే ఎక్కువ కొంటున్నరు

మిల్లర్లే ఎక్కువ కొంటున్నరు
  • సర్కారు 90 వేల టన్నులు కొంటే.. మిల్లర్లు అంతకు మించి కొనుగోళ్లు 
  • క్వింటాల్​వడ్లు రూ.1900 నుంచి రూ.2 వేలకు కొనుగోలు
  • ఆంధ్రకు ధాన్యం తరలిస్తున్న కొందరు మిల్లర్లు

యాదాద్రి, వెలుగు : బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడానికి వెనుకా ముందు ఆడిన మిల్లర్లు.. వడ్ల కొనుగోళ్లలో సర్కారు కంటే ముందున్నరు. మద్దతు ధర కంటే తక్కువే ఇస్తున్నా.. వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కొనుగోలు చేస్తున్నారన్న ఉద్దేశంతో రైతులు కూడా వారికే అమ్ముకుంటున్నారు. దీంతో వందల సంఖ్యలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిన సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​కంటే ఎక్కువగా వడ్లను కొనుగోలు చేశారు. కొందరు మిల్లర్లు ఇక్కడ కొనుగోలు చేసిన వడ్లను ఆంధ్రప్రదేశ్​కు చెందిన కార్పొరేట్ బియ్యం వ్యాపారులకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. 

కొనుగోలుకు ముందే..

వానాకాలం సీజన్​వడ్లకు సీఎంఆర్​విషయంలో సర్కారు బ్యాంక్ గ్యారెంటీ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంక్ గ్యారెంటీ అంటే తాము సీఎంఆర్​తీసుకోమని మొదట్లో మిల్లర్లు మొండికేశారు. చివరకు పది శాతం గ్యారెంటీ ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి వెనుకాముందు ఆడిన మిల్లర్లు ప్రైవేట్ గా పెద్ద ఎత్తున వడ్లను కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,300 నుంచి రూ.2,320 ఉంది. 

మిల్లర్లు మాత్రం క్వింటాల్ వడ్లకు రూ.1900 నుంచి రూ.2 వేల వరకు చెల్లించడానికి రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే హమాలీ, వే బ్రిడ్జి చార్జీలు రైతులే చెల్లిస్తున్నారు. దీనికి తోడు క్వింటాల్ వడ్లకు మూడున్నర కిలోల చొప్పున కటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ తేమ, తాలు పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం, వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా ఉన్న వడ్లను అలానే రైతులు అమ్మేసుకుంటున్నారు. 

సెంటర్లను మించి కొనుగోలు..

వందల కొనుగోలు సెంటర్లున్నా మిల్లర్లు ప్రైవేటుగా ఎక్కువ వడ్లను కొనుగోలు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఈ సీజన్​లో 2.85 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కాగా ఈ సీజన్​లో సుమారు 6 లక్షల టన్నులు వడ్ల దిగుబడి వస్తుందని, అందులోంచి 4 లక్షల టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. 

అయితే జిల్లాలో ఏర్పాటు చేసిన సెంటర్లలో నెల రోజులుగా దాదాపు 90 వేల టన్నుల దొడ్డు రకం, 200 టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశారు. మిల్లర్లు మాత్రం లక్ష టన్నులకు పైగా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. మోత్కూరు, ఆలేరు, రాజాపేట, గుండాల, తుర్కపల్లి తదితర మండలాల్లో మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేశారు. 

ఆంధ్రకు తరలిస్తున్న కొందరు మిల్లర్లు..

మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసిన మిల్లర్లలో కొందరు వాటిని ఏపీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కోతలు ప్రారంభం కాగానే జిల్లాకు చెందిన కొందరు మిల్లర్లు ఏపీలోని ప్రముఖ రైస్​ ఇండస్ట్రీలతో ఒప్పందాలు చేసుకున్నట్టుగా సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం ఇక్కడ కొనుగోలు చేసిన వడ్లను ఏపీలోని పెద్దాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లోని రైస్​ఇండస్ట్రీలకు ట్రాన్స్​పోర్ట్​చేస్తున్నారు. ఇక్కడ రూ.2 వేలలోపే కొనుగోలు చేసిన వడ్లను క్వింటాల్​కు రూ.2,400 నుంచి రూ. 2,500 వరకు అమ్మేస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.500 వరకు లాభం పొందుతున్నారు.