అమెరికాలో వాన బీభత్సం..నీట మునిగిన కౌంటీలు

అమెరికాలోని అయోవా రాష్ట్రం వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది.  చాలా కౌంటీలు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళుతున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్  నది పొంగిపొర్లుతోంది. రాక్ వ్యాలీలోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. అయోవాలోని 21 కౌంటీల్లో అలర్ట్ ప్రకటించారు. సియూక్స్  కౌంటీ మొత్తం జలమయమైంది. ఎక్కడా వీధులు కనిపించడంలేదు. ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. 

వర్షాలతో సౌత్  డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. సౌత్ డకోటాలోని చాలావరకు జాతీయ రహదారులు జలమయమయ్యాయి. సియోక్స్  ఫాల్ లో కూడా భారీ వర్షం కురిసింది. ఇప్పుడు వానలు కొంచెం తగ్గినా అలర్ట్ గా ఉండాలన్నారు అధికారులు. ఇవాళ, రేపు ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు.