వరంగల్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరురాలిని చేస్తామని.. మా ప్రభుత్వంలో ఆడబిడ్డలే కీలకంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకుర్తి గడ్డ మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసిందే ఆడబిడ్డనేని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుని దీవించారని అన్నారు. రాష్ట్రంలోని మహిళలపై భారం పడకూదని తమ ప్రభుత్వం భావిస్తోందని.. ఇందులో భాగంగానే మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. 2014 నుండి 2018 వరకు కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని.. మా కేబినెట్లో ఇద్దరు వరంగల్ మహిళలకు అవకాశం ఇచ్చామన్నారు.
మాది మహిళల రాజ్యమని గర్వంగా చెబుతున్నానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 19) వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
ALSO READ | కాళోజీ కళా క్షేత్రం జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన కాళోజీ కళా క్షేత్రాన్ని అధికారంలోకి రాగానే మేం పట్టుబట్టి పూర్తి చేశామని తెలిపారు. కాళోజీని, ఆయన పోరాటాన్ని మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని.. డెవలప్మెంట్కు అడ్డుతగిలితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తే ఊరుకోమని.. ఎవరైనా సరే జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు.