హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్ పూర్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసి ఉంచారు. దీంతో షాపును క్లోజ్ చేయాలని పోలీసులు సూచించడంతో ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ రెచ్చిపోయి మాట్లాడాడంటూ స్థానికులు తెలిపారు. తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దంటూ ఎంఐఎం కార్పొరేటర్ మాట్లాడాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి కేటీఆర్ పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా అధికారులను ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్‌తో నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో కార్పొరేటర్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
For More News..