- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు
- ఆయా నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్ఉందని లెక్కలు
- పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ప్రతిపాదన
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని అర్బన్, బోధన్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడంపై మజ్లిస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని పార్టీ అధినేత అసదుద్దీన్ఓవైసీకి విన్నవించేందుకు జిల్లా నేతలు రెడీ అయ్యారు. మిత్రపక్షంగా భావించే ఎంఐఎమ్ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం అధికార బీఆర్ఎస్లో చర్చకు దారితీసింది.
2014 తరహా వెళ్లాలని..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ఎంఐఎంకు పట్టు ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌లో మజ్లిస్తరఫున పోటీచేసిన మీర్మజాస్ అలీ షేక్31,840 ఓట్లు సాధించి, సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. 2019 నగర పాలక ఎన్నికల్లోనూ 16 డివిజన్లలో విజయం సాధించి, బీఆర్ఎస్ సపోర్ట్‌తో డిప్యూటీ మేయర్పదవిని దక్కించుకున్నారు.
నియోజకవర్గంలో పార్టీని మరింత విస్తరించడానికి అసెంబ్లీకి పోటీ చేయాలని లీడర్లు లెక్కలు వేస్తున్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో ఎంఐఎం లీడర్లకు చాలాకాలంగా గ్యాప్ ఉండడం కూడా ప్రతిపాదనకు మరో కారణం. పార్టీ జిల్లా ఇన్చార్జి మహ్మద్ షకీల్ అహ్మద్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన మజ్లిస్ లీడర్లు అర్బన్‌లో పోటీ చేయాలని తీర్మానించారు.
బోధన్‌లో చెడిన స్నేహం..
1994లో బోధన్ బల్దియా చైర్మన్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మజ్లిస్ నేత మహ్మద్ ఇబ్రహీం ఎన్నికై, అయిదేండ్లు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఎంఐఎం తన ప్రభావాన్ని చూపింది. ప్రస్తుత పాలకవర్గంలో 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన షకీల్ ఆమేర్‌కు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. ఏడాది నుంచి ఎమ్మెల్యే షకీల్, మజ్లిస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
ఎంఐఎం పార్టీ నేతలు తనపై దాడి చేశారని కొన్ని నెలల కింద ఎమ్మెల్యే షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలువురిని అదుపులో తీసుకున్నారు. జైలుకు వెళ్లిన వారిని కలిసేందుకు నిజామాబాద్ వచ్చిన అసదుద్దీన్, వచ్చే ఎన్నికల్లో షకీల్‌కు బుద్ధి చెబుతామని ప్రకటించారు. ఇప్పుడదే విషయాన్ని ఓవైసీకి గుర్తు చేసి, పోటీకి ఒప్పించాలని స్థానిక లీడర్లు నిర్ణయించారు. బోధన్ అభ్యర్థిగా మున్సిపల్ చైర్పర్సన్ పద్మ భర్త శరత్‌రెడ్డి పేరును ప్రతిపాదించాలని స్కెచ్ వేశారు.