అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపండి

అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపండి
  • పెండింగ్​లో ఉన్న  బకాయిలన్నీ రిలీజ్ చేయండి
  • ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలను సాధ్యమైనంత ఎక్కువ రోజులు నిర్వహించాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో సమావేశాలు వంద రోజుల పాటు జరిగేవని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం చాలా తక్కువ రోజులు సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గురువారం కూడా ఉదయం 11.30కి సభ వాయిదా పడిందని, మళ్లీ మధ్యాహ్నం 3.30కి ప్రారంభం అయిందని గుర్తు చేశారు. సభ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదని, దీంతో సభ్యులందరం 4 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

 క్వశ్చన్ అవర్,  షార్ట్ డిస్కషన్ తీసేశారని పేర్కొన్నారు.  ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే.. ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని సూచించారు. కాలేజీలు, స్టూడెంట్లకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్ బకాయిలు, హాస్పిటల్స్ కు రావాల్సిన ఆరోగ్య శ్రీ బకాయిలు రిలీజ్ చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు  25 ఎకరాలు ఉండాలనే నిబంధన పెట్టారని..  హైదరాబాద్​లో అంత భూమి కష్టంగా మారిందని, కాబట్టి కనీసం సిటీ వరకైనా దాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.  మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు పది నెలల నుంచి రెంట్లు ఇవ్వడం లేదని, వెంటనే రూ.70కోట్లను రిలీజ్ చేయాలన్నారు. పలు రాష్ర్టాల్లో మహవీర్ జయంతికి సెలవు ఇస్తున్నారని, తెలంగాణ  ప్రభుత్వం కూడా ఏప్రిల్10న జరిగే మహవీర్ జయంతి రోజున సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.