నేను నోరు విప్పితే.. మీకే ఇబ్బంది!..బీఆర్ఎస్ నేతలకు అసదుద్దీన్ హెచ్చరిక

 నేను నోరు విప్పితే.. మీకే ఇబ్బంది!..బీఆర్ఎస్ నేతలకు అసదుద్దీన్ హెచ్చరిక
  • మీ జాతకాలన్నీ నా దగ్గరున్నయ్
  • మూసీ ప్రక్షాళనకు మీరు ప్రణాళికలు వేయలేదా?
  • మీ అహంకారమే మిమ్మల్ని ఓడించింది
  • విధానాలు స్థిరంగా ఉండాలని హితవు 
  • ఇండ్లు కూల్చకుండాప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళికలు వేయలేదా? అని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయాలపై తాను నోరు విప్పితే ఆ పార్టీ నేతలే ఇబ్బందిపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అసదుద్దీన్ శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ ప్రణాళికలు వేసినప్పుడు తాను వద్దని చెప్పానన్నారు. ఆ నాటి విషయాలను ఇప్పుడు బయటకు చెప్పమంటారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తాము  స్వాగతిస్తామని చెప్పారు. 

బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని హితవు పలికారు. ‘‘మేం కాంగ్రెస్​తో జత కట్టామని బీఆర్ఎస్ అంటోంది. కానీ జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రావడానికి మేమే కారణం” అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కేవలం 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని, కానీ అప్పుడు బీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరించారని విమర్శించారు. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి వెళ్తోందంటూ బీఆర్ఎస్ నేతలు ఇటీవల కామెంట్ చేసిన నేపథ్యంలో అసదుద్దీన్ ఈ మేరకు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతల జాతకాలన్నీ తన వద్ద ఉన్నాయని, అవసరమైతే బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.    

పునర్విభజనతో సౌత్​కు నష్టం  

జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్ ఇండియాలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు. బాగా పని చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభమని ఫైర్ అయ్యారు. ఎక్కువ మంది సంతానం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు. కానీ అదే విషయాన్ని తాను చెబితే మాత్రం రాద్ధాంతం చేసేవారన్నారు. 

వక్ఫ్​లో నాన్ ముస్లిమ్స్ ఎందుకు?

కొత్తగా ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులోని 24 మందిలో నాన్ హిందువులకు చోటు లేదని అసదుద్దీన్ అన్నారు. బోర్డు స్టాఫ్​లో హిందువులు మాత్రమే ఉండాలన్న పాలసీ తీసుకువచ్చారని, దానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు ప్రతిపాదనల్లో వక్ఫ్​బోర్డులో ఇద్దరు నాన్ ముస్లిం సభ్యులు తప్పనిసరిగా ఉండాలని ప్రతిపాదించారని తెలిపారు. వక్ఫ్ చట్టంలో ఈ ప్రతిపాదనను పొందుపర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. టీటీడీలో నాన్ హిందూస్ ఉండనప్పుడు.. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు.