ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మా పార్టీ మీ వెంటే ఉంటుంది’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసదుద్దీన్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ గ్రోత్ సెంటర్ గా మారిందని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా అన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న సీఎం ప్రకటనకు ధన్యవాదాలు తెలిపిన ఒవైసీ.. రైతులకు కూడా ఈ ప్రభుత్వం సహకరించడం మంచి తరుణమని కొనియాడారు.
నల్గొండ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎం ను కోరారు. అదేవిధంగా ఓల్డ్ సిటీ లో మరిన్ని ఫైర్ స్టేషన్లు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓల్డ్ సిటీ యాకత్ పురా లో రోడ్డు వైండింగ్ చేయాల్సిన అవసరం ఉందని కోరారు.
ఓల్డ్ సిటీ లో మెట్రో కోసం భూమి కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. మీరాలం మండిలో రానున్న మెట్రో స్టేషన్ నుండి చార్మినార్ వరకు స్కై వాక్ ఏర్పాటు చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వంట చేసి పెట్టిన వాళ్ళను మర్చిపోకుండా వారిని పిలిపించుకుని సహాయం చేయడం మంచి పరిణామమని కొనియాడారు. 1998 లో తనని కూడా అప్పటి సీఎం చంద్రబాబు జైల్లో పెట్టించారని తెలిపారు.