15 అసెంబ్లీ స్థానాలపై ఎంఐఎం గురి

  • 15 అసెంబ్లీ స్థానాలపై ఎంఐఎం గురి
  • పక్కా ప్లాన్​తో గ్రౌండ్​వర్క్​ చేసుకుంటున్న మజ్లిస్​

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల బయట కూడా పాగా వేయాలని మజ్లిస్​పార్టీ భావిస్తోంది. గతంలోనూ జిల్లాల్లో  కొన్నిచోట్ల మజ్లిస్ పోటీ చేసింది. కొన్ని సందర్భాల్లో గెలుపు ఓటముల మీద ప్రభావం చూపింది. కానీ ఈసారి గెలుపు కోసమే బరిలోకి దిగాలన్న పక్కా ప్లాన్​తో ముందుకెళ్తోంది. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండి.. పార్టీ బలంగా ఉన్న 15 అసెంబ్లీ సీట్ల మీద కన్ను వేసింది. పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో ఇప్పటికే గ్రౌండ్​వర్క్​ మొదలుపెట్టింది. మైనారిటీ ఓటర్లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను కూడా ఆకట్టుకోగలిగే ప్రజాదరణ ఉన్న లీడర్లను బరిలోకి దింపాలని వ్యూహరచన చేస్తోంది.     

నిజామాబాద్,  వెలుగు:   పాత బస్తీతో పాటు జంటనగరాల్లో తన ఆధిక్యాన్ని చాటుకుంటున్న ఎంఐఎం జిల్లాలకు విస్తరించేందుకు రెడీ అవుతోంది.  ఇందులో భాగంగా నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, కోరుట్ల, భువనగిరి, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్, ఖమ్మం, జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో  బలాన్ని పెంచుకునేందుకు పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తోంది.  క్యాడర్​తో మీటింగ్ లు నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యల మీద దృష్టి పెడుతోంది.  బీసీ, ఇతర వర్గాలను సమీకరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ పర్యటించి  క్యాడర్​కు దిశానిర్దేశం చేశారు. 

బీసీలను కలుపుకొని..

ముస్లింలతో పాటు బీసీ సామాజిక వర్గాల సాయంతో అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని ఎంఐఎం ఆశిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు  స్థానాల నుంచి  పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ  అధినేత అసదుద్దీన్ ఒవైసీ  క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్, బోధన్,  కామారెడ్డిల్లో  ఎంఐఎం పోటీ చేయనుంది. అయా చోట్ల పార్టీ క్యాడర్​ఎన్నికలకు సిద్దమవుతోంది. ముస్లింలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన హిందూ కాండిడేట్లను  పోటీ చేయించాలని ప్లాన్  చేస్తోంది. గతంలో కూడా ఎంఐఎం ఈ స్ట్రాటజీ అమలు చేసింది.  2014 ఎన్నికల్లో నిజామాబాద్​అర్బన్​ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన  మీర్​మజాజ్ రెండో స్థానంలో నిలిచారు.

టీఆర్ఎస్​ క్యాండిడేట్​కు 31.15 శాతం, ఎంఐఎంకు  23.53 శాతం ఓట్లు వచ్చాయి. నిజామాబాద్​ కార్పొరేషన్​లో 50 సీట్లకు ఎంఐఎం 16 చోట్ల గెలిచింది.  ​ఇక్కడ ఎంఐఎం బలమైన బీసీ క్యాండిడేట్​ను  బరిలోకి దింపితే  ఫలితాలు మారే చాన్స్ ​లేకపోలేదు. బోధన్ లోనూ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మున్సిపాలిటీలో 38 వార్డులకు   11 మంది ఎంఐఎం  కౌన్సిలర్లు గెలిచారు. ఎంఐఎం పోటీ చేయాలని భావిస్తున్న సీట్లలో చాలాచోట్ల మైనారిటీ ఓటర్లే కీలకం. బీసీ తదితర సామాజికవర్గాల నుంచి ఎంతోకొంత మద్దతు లభిస్తే జిల్లాల్లోనూ ఎంఐఎం ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది.