మహబూబాబాద్​ జిల్లాలో ఖనిజ సంపద మాయం!

  •     జిల్లాలో ఆగని బెరైటీస్​ అక్రమ రవాణా
  •     రాత్రి వేళల్లో తరలిస్తున్న అక్రమార్కులు
  •     ప్రభుత్వ ఖజానాకు గండి
  •     నిఘాను పెంచుతామంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు : ఖనిజ సంపద మాయమవుతున్నది. మహబూబాబాద్​ జిల్లా పరిధిలోని గార్ల మండలంలో వందల ఎకరాల్లో ఉన్న ఖనిజ సంపదపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికి రాత్రే మినరల్స్​ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఓ వైపు అధికారులు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు అవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇతర జిల్లాల మీదుగా రాష్ర్టం దాటిస్తున్నారు. 

అక్రమంగా కడపకు రవాణా..

మహబూబాబాద్ జిల్లా పరిధిలో గార్ల మండలంలో రాత్రి సమయంలో విలువైన బెరైటీస్ ఖనిజం అక్రమ రవాణా కొనసాగుతోంది. బాలాజీ తండా, కోట్యా నాయక్ తండా, పాత పోచారం, నగరం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో బెరైటీస్ ఖనిజ నిక్షేపాలున్నాయి. గతంలో ప్రభుత్వ అనుమతితో తవ్వకాలు జరిగాయి. అడవి ప్రాంతంలో ఖనిజం  తవ్వకాలు జరపడం మూలంగా కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో

వివిధ కారణాలతో తవ్వకం నిలిపివేశారు. ఆ సమయంలో బెరైటీస్ ఖనిజం నిల్వలు బయటకు తీసి కుప్పలుగా పోశారు. వాటిని రాత్రి వేళలో కొంతమంది అక్రమార్కులు మహబూబాబాద్ జిల్లా నుంచి ఖమ్మం ద్వారా కడపకు అక్రమంగా రవాణా చేపడుతూ లక్షల్లో కూడబెట్టుకుంటున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

అక్రమంగా బెరైటీస్ తరలింపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఒక్కో టిప్పర్ లో సుమారుగా 35 టన్నుల వరకు బెరైటీస్ ఖనిజం తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఖనిజాన్ని ఒక చోటికి చేర్చి అక్కడి నుంచి టిప్పర్లలో కడపకు రవాణా చేస్తున్నారు. క్వాలిటీ కలిగిన బెరైటీస్ ఖనిజం టన్నుకు రూ.10 వేల చొప్పున, ఒక్కో టిప్పర్ లో సుమారు రూ.4 లక్షల విలువైన ఖనిజం తరలిస్తున్నారు. స్థానికంగా సహకరిస్తున్న వారికి ట్రిప్పుకు సుమారు రూ.60 వేలు చెల్లిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

బెరైటీస్​తరలింపును నిరోధించడానికి ఫారెస్ట్​ఆఫీసర్లు భారీగా కందకాలు తవ్వినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కందకాలను పూడ్చి మరీ ఖనిజాన్ని తరలిస్తున్నారు. గతేడాది పాత పోచారం నుంచి కమలాపురం వెళ్లే రోడ్డులో బెరైటీస్ తో కూడిన లారీని పోలీసులు పట్టుకున్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ఫారెస్ట్, పోలీస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఖనిజం స్మగ్లింగ్ ఆగడం లేదు. ఖనిజ సంపదను కాపాడాలని పర్యావరణవేత్తలు, ప్రజలు కోరుతున్నారు. 

నిఘాను మరింతగా పెంచుతాం..

జిల్లాలోని గార్ల మండల పరిధిలో ఫారెస్ట్​లోని బెరైటీస్ ఖనిజ నిక్షేపాలను అక్రమార్కులు రాత్రి సమయంలో సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా మాదృష్టికి వచ్చింది. ఇప్పటికే ఖనిజ నిల్వలున్న ప్రాంతంలో కందకాల తవ్వకం చేపట్టాం. ఫారెస్ట్​సిబ్బందితో నిఘాను మరింతగా పెంచడంతోపాటు  అక్రమంగా బెరైటీస్ తరలింపు చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. 

విశాల్, జిల్లా ఫారెస్టు ఆఫీసర్, మహబూబాబాద్