ఆర్మూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీసిందని టీ టీడీపీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మస్కతి అలీం ఆరోపించారు. ఆర్మూర్ లో బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్, నియోజక వర్గ ఇన్ఛార్జి దేగాం యాదాగౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మినీ మహానాడు నిర్వహించారు. మాజీ మంత్రి స్వర్గీయ మహిపాల్ రెడ్డి, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసిన అనంతరం మినీమహానాడు ప్రారంభించారు.
పార్టీ కోసం పని చేసి చనిపోయిన లీడర్లకు సంతాపం తెలిపిన అనంతరం పలు తీర్మానాలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని, ఆర్మూర్ లో పసుపు బోర్డు మంజూరు చేయాలని, సెజ్, లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని, జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని తీర్మానించారు. బోధన్షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు ఫెరోజ్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ కోఆర్డినేటర్ వినోద్ కుమార్, కోరుట్ల నియోజక వర్గం కోఆర్డినేటర్ మనుక ప్రవీణ్, జగిత్యాల నియోజకవర్గం మహంకాళి రాజన్న, పార్లమెంట్ ముఖ్య నాయకులు, రెంజర్ల సురేశ్, హన్మంత్రావ్, పావులూరి వెంకటేశ్వర రావు, అనుబంధ సంఘాల లీడర్లు అహ్మద్, శేఖర్ మావూరి, దంతాల ఆనంద్ పాల్గొన్నారు.